దేశవ్యాప్తంగా వరుసగా ఐదోరోజు పెట్రోల్, డీజిల్ ధరలను పెంచాయి చమురు సంస్థలు. మంగళవారం లీటరు పెట్రోల్ పై 6పైసలు, డీజిల్‌పై 16పైసలు పెంచాయి. దేశ రాజధాని దిల్లీలో పెట్రోల్ రేటు లీటరుకు రూ. 81.53 నుంచి 81.59కి పెరిగింది. డీజిల్ రేటు లీటరుకు రూ.71.25 నుంచి 71.41కి ఎగబాకింది.
గత శుక్రవారం నుంచి ఇంధన ధరలు పెరుగుతూ వస్తున్నాయి. గత ఐదు రోజుల్లో లీటర్ పెట్రోల్ ధర 53 పైసలు పెరగ్గా.. డీజిల్‌పై 95 పైసలు పెరిగింది. దాదాపు రెండు నెలల తర్వాత పెట్రోల్, డీజిల్ ధరల్లో ఇలా వరుస పెంపు కనిపిస్తోంది.
ధరల పెంపు ఎందుకు?
కరోనా వ్యాక్సిన్ ట్రయల్స్ విజయవంతమవుతున్నట్లు వస్తున్న వార్తలు.. అంతర్జాతీయంగా చమురు ధరల సూచీలకు కలిసొచ్చాయి. దీంతో క్రమంగా పెరుగుతున్న ధరల ఆధారంగా.. దేశీయంగా పెట్రోల్, డీజిల్ ధరలను సవరించినట్లు చమురు మార్కెటింగ్ కంపెనీలు తెలిపాయి. బ్రెంట్ ధర ప్రస్తుతం బ్యారల్‌కు 45 డాలర్లు దాటింది.