ఆటోమొబైల్ సంస్థలు ఇకపై ఫ్లెక్స్ ఫ్యూయల్(Flex-fuel Engine) ఇంజిన్లతో కూడిన వాహనాలు మాత్రమే అందుబాటులోకి తేవాలని కేంద్ర రోడ్డు, రవాణాశాఖ మంత్రి నితిన్ గడ్కరీ(Nitin Gadkari News) పేర్కొన్నారు. దీనికి సంబంధించి వచ్చే మూడు, నాలుగు నెలల్లో ఆదేశాలు జారీ చేయనున్నట్లు స్పష్టం చేశారు. ఇథనాల్ ఆధారిత వాహనాలతో పెట్రోల్, డీజిల్ బాధలుండవని ఆశాభావం వ్యక్తం చేశారు. పుణెలో ఓ ఫ్లై ఓవర్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి హాజరైన గడ్కరీ ఈ వ్యాఖ్యలు చేశారు.
"వచ్చే మూడు లేదా నాలుగు నెలల్లో కేంద్రం పలు ఆదేశాలు జారీ చేయనుంది. బీఎండబ్ల్యూ, మెర్సిడెజ్, టాటా, మహీంద్రా మొదలైన ఆటోమొబైల్ సంస్థలను కూడా ఫ్లెక్స్ ఇంజిన్లతో కూడిన వాహనాలు అందుబాటులోకి తీసుకురావాలని కోరనున్నాం."
--నితిన్ గడ్కరీ, కేంద్ర మంత్రి.
ఇప్పటికే ఫ్లెక్స్ ఇంజిన్ వాహనాలను(Flex-fuel Vehicles) తయారు చేయమని బజాజ్, టీవీఎస్ సంస్థలను కోరినట్లు నితన్ గడ్కరీ వెల్లడించారు. ఆ వాహనాలు అభివృద్ధి చేశాక తనను సంప్రదించాలని కోరిన నేపథ్యంలో.. రెండు సంస్థలు ఇథనాల్ ఫ్లెక్స్ ఇంజిన్లతో(Ethanol Vehicles in India) ముందుకొచ్చాయని తెలిపారు. దేశంలో పెట్రోల్, డీజిల్ వినియోగం పూర్తి స్థాయిలో ఆగిపోవడమే తన లక్ష్యమని గడ్కరీ స్పష్టం చేశారు.
పవార్ ఆధ్వర్యంలో..
పుణెలో మూడు ఇథనాల్ పంపుల ఏర్పాటుకు ప్రధాని నరేంద్ర మోదీ శ్రీకారం చుట్టారని గడ్కరీ అన్నారు. ఈ ప్రాంతంలో మరిన్ని ఇథనాల్ పంపుల ఏర్పాటుకు అజిత్ పవార్ కృషి చేయాలని విజ్ఞప్తి చేశారు. దీనివల్ల రైతులకు, చెరుకు సంస్థలకు లాభం జరుగుతుందని పేర్కొన్నారు.
ఫ్లెక్స్ ఫ్యూయల్ లేదా ఫ్లెక్సిబుల్ ఫ్యూయల్ అనేది పెట్రోల్, డీజిల్‌కు ప్రత్యామ్నాయ ఇంధనం. గ్యాసోలిన్, మిథనాల్ లేదా ఇథనాల్ కాంబినేషన్లో ఈ ఫ్యూయల్ తయారు చేస్తారు.
ఇదీ చదవండి: