గత ఏడాది భారీగా పెరిగిన బంగారం ధర ఇప్పుడు తగ్గుతోంది. ప్రస్తుతం 8 నెలల కనిష్ఠంగా బంగారం ధర ఉంది. హైదరాబాద్లో 10 గ్రాముల పుత్తడి ధర శుక్రవారం రూ.47,570గా ఉంది. గతేడాది ఆగస్టులో బంగారం ధర రూ. 57వేల జీవన కాల గరిష్ఠాన్ని తాకింది.
2020లో కరోనా వల్ల ఆర్థిక వ్యవస్థ మందగించటం వల్ల సురక్షిత పెట్టుబడి అయిన బంగారం ధరలు పెరిగాయి. ఈక్విటీ మార్కెట్లు కూడా పడిపోతుండటం వల్ల పసిడికి పెట్టుబడులు మళ్లాయి. ప్రస్తుతం ఆర్థిక వ్యవస్థ మళ్లీ కోలుకుంటున్నందున ధరలు తగ్గుతున్నాయి.
సుంకాలు తగ్గటం…
ఇటీవల ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్లో బంగారంపై కస్టమ్స్ సుంకాలను ప్రభుత్వం తగ్గించింది. ప్రస్తుతం పసిడి ధరలు తగ్గటానికి ఇది ప్రధాన కారణమని విశ్లేషకులు భావిస్తున్నారు. అమెరికా డాలరుతో పోల్చితే రూపాయల బలపడటం కూడా బంగారం ధరలు తగ్గేందుకు ఉపయోగపడుతున్నయని వారు చెబుతున్నారు. అమెరికా ప్రభుత్వం 1.9 లక్షల కోట్ల డాలర్ల ప్యాకేజీ ఊహగానాలు కూడా బంగారంపై ప్రభావం చూపెడుతున్నాయని వారు అంటున్నారు.
"అమెరికాలో కేంద్ర బ్యాంకు తీసుకున్న చర్యలతో బాండ్ల రాబడి పెరుగుతోంది. కరోనా మహమ్మారి నియంత్రణలో ఉంది, అంతేకాకుండా కస్టమ్స్ డ్యూటీ తగ్గించింది. రూపాయి కూడా బలపడుతోంది. వీటన్నింటి వల్ల బంగారం ధర తగ్గుతోంది."
- సతీష్ అగర్వాల్, ఎండీ, కుందన్ జ్యువెల్లర్స్
కొవిడ్ మహమ్మారి తదనంతర లాక్డౌన్ల వల్ల బంగారం ధరలు పెరిగాయి. ఇప్పుడు కరోనా కేసులు తగ్గుముఖం పడుతుండటం, వ్యాక్సినేషన్ ఊపందుకోవటం, ఆర్థిక వ్యవస్థ రికవరీ అవుతుండటం వల్ల బంగారంపై పెట్టుబడులు మళ్లాయి.
పెట్టుబడికి సరైన సమయం..
బంగారం ధర మరింత తగ్గే అవకాశాలు కష్టమేనని నిపుణులు అంటున్నారు. ధర తగ్గినందున బంగారం కొనుగోలు చేయాలనుకునే వారికి, అదే విధంగా పెట్టుబడి పెట్టాలనుకునే వారికి ఇది సరైన సమయమని వారు చెబుతున్నారు.
"దీర్ఘకాలంలో బంగారం ధరలు పెరుగుతాయని అనుకుంటున్నాం. స్వల్ప కాలంలో ఇంకా ధర తగ్గే అవకాశాలు తక్కువే. ప్రస్తుతం ఉన్న ధరల దృష్ట్యా ఇప్పుడు కొనుగోలు చేయటం, పెట్టుబడి పెట్టవచ్చు.
- సతీష్ అగర్వాల్, ఎండీ, కుందన్ జ్యువెల్లర్స్.
ఇప్పుడు పసిడి ధరలు తగ్గినప్పటికీ రానున్న రోజుల్లో పెరిగే అవకాశాలు ఉన్నట్లుగా తెలుస్తోంది.
ఇదీ చదవండి:కరోనాకు పతంజలి 'కొరొనిల్ టాబ్లెట్'