క్రెడిట్ స్కోరు(Credit Score) అనేది మూడెంకెల సంఖ్య. ఇది 300 నుంచి 900 మధ్య ఉంటుంది. 300 స్కోరు ఉన్నట్లయితే క్రెడిట్ స్కోరు మంచి స్థాయిలో లేనట్లు. అదే సమయంలో 900 అంటే క్రెడిట్ స్కోరు అత్యుత్తమంగా ఉన్నట్లు. రుణాలు, క్రెడిట్ కార్డులు ఇచ్చేందుకు బ్యాంకులు, ఫైనాన్స్ సంస్థలు 750 క్రెడిట్ స్కోరును పరిగణనలోకి తీసుకుంటాయి. క్రెడిట్ స్కోరు అనేది కొన్ని సార్లు తగ్గిపోతుంది. లోన్ తీసుకున్నప్పుడు, క్రెడిట్ కార్డు(Credit card) రద్దు చేసుకున్నప్పుడు, ఇతరత్ర సందర్భాల్లో ఇలా జరిగే ఆస్కారం ఉంటుంది. క్రెడిట్ స్కోరు ఎందుకు తగ్గుతుందో తెలుసుకుందాం.
తిరిగి చెల్లించే చరిత్ర(పేమెంట్ హిస్టరీ)
పేమెంట్ హిస్టరీ(payment history) అనేది క్రెడిట్ స్కోరుపై అత్యధికంగా ఆధారపడి ఉంటుంది. సిబిల్(CIBIL) ప్రకారం క్రెడిట్ స్కోరులో దీని వాటా 30 శాతం. మిగతా అంశాల కంటే దీనికి ఎక్కువ వేయిటేజీ ఉంది. ఆలస్యంగా ఈఎమ్ఐ(EMI), క్రెడిట్ కార్డు బిల్లు చెల్లించినట్లయితే క్రెడిట్ స్కోరు తగ్గే అవకాశం ఉంటుంది. కొన్ని రోజులు ఆలస్యంగా పేమెంట్ చేసినట్లయితే క్రెడిట్ రిపోర్టులో అది కనిపించదు. అదే 30 రోజులకు మించి ఆలస్యంగా చెల్లించినట్లయితే క్రెడిట్ రిపోర్టులో అది కనిపిస్తుంది. దీనితో క్రెడిట్ స్కోరు తగ్గిపోతుంది. ఇంకా ఆలస్యంగా చెల్లించినట్లయితే మరింత పడిపోయే ప్రమాదం ఉంటుంది.
ఒకటి కంటే ఎక్కువ క్రెడిట్ కార్డులు ఉన్నట్లయితే వాటికి సంబంధించి పేమెంట్స్ సరిగ్గా చేయాలి. వాటికోసం రిమైండర్ యాప్‌లను ఉపయోగించుకోవచ్చు.
క్రెడిట్ యుటిలైజేషన్ రేషియో
క్రెడిట్ యుటిలైజేషన్ రేషియో(Credit utilization ratio) ఎక్కువ ఉన్నట్లయితే క్రెడిట్ స్కోరు తగ్గిపోతూ ఉంటుంది. క్రెడిట్ స్కోరును క్రెడిట్ యుటిలైజేషన్ ఎక్కువ ప్రభావితం చేస్తుంది. క్రెడిట్ బ్యూరో సిబిల్ ప్రకారం క్రెడిట్ స్కోరులో దీని వాటా 25 శాతం. అన్ని కార్డుల్లో మొత్తం ఉన్న క్రెడిట్ లిమిట్(Credit limit)లో వాడుకున్న మొత్తాన్ని తెలియజేసేదే క్రెడిట్ యుటిలైజేషన్ రేషియో. ఎక్కువ క్రెడిట్ వాడుకున్నట్లయితే రుణ అవసరం ఎక్కువ ఉన్నట్లు ఆర్థిక సంస్థలు భావిస్తాయి. ఎక్కువ క్రెడిట్ ఉపయోగించుకున్నట్లయితే వాటికి రిస్కు కూడా ఎక్కువగానే ఉంటుంది.
క్రెడిట్ యుటిలైజేషన్ రేషియోను 30 శాతం లోపు ఉంచుకోవటం ఉత్తమం. 50 శాతం కంటే ఎక్కువ క్రెడిట్‌ను ఉపయోగించుకున్నట్లయితే క్రెడిట్ స్కోరుపై ప్రతికూల ప్రభావం పడుతుంది. క్రెడిట్ లిమిట్ తగ్గిన సమయంలో నెలవారీ ఖర్చు యథతథంగా ఉన్నట్లయితే కూడా క్రెడిట్ యుటిలైజేషన్ పెరిగే ప్రమాదం ఉంటుంది.
క్రెడిట్ స్వభావం, వాటి వయస్సు (క్రెడిట్ మిక్స్, డ్యూరేషన్)
సిబిల్ ప్రకారం క్రెడిట్ స్కోరులో వీటి వెయిటేజీ 25 శాతంగా ఉంది. సెక్యూర్డ్, అన్ సెక్యూర్డ్ రుణాలు తీసుకున్నట్లయితే క్రెడిట్ స్వభావం మంచిగా ఉన్నట్లు. ఎలాంటి తనఖా ఉండదు కాబట్టి పర్సనల్ లోన్, క్రెడిట్ కార్డులు అన్ సెక్యూర్డ్ రుణాల కిందకు వస్తాయి. అదే సమయంలో వాహన రుణం, గృహ రుణాలు సెక్యూర్డ్ రుణాలు జాబితాలోకి వస్తాయి.
క్రెడిట్ వయస్సు కూడా క్రెడిట్ స్కోరును ప్రభావితం చేస్తుంది. కార్డులు ఊరికే మార్చినట్లయితే క్రెడిట్ వయస్సు తగ్గిపోతుంది. పాత కార్డులను దీర్ఘకాలం కొనసాగించటం ద్వారా క్రెడిట్ వయస్సు పెరుగుతుంది. తద్వారా క్రెడిట్ స్కోరు కూడా పెరుగుతుంది.
పాత కార్డులను రద్దు(క్లోజ్) చేయటం వల్ల క్రెడిట్ వయస్సు తగ్గటమే కాకుండా హిస్టరీని కూడా కోల్పోవాల్సి ఉంటుంది. క్రెడిట్ కార్డులను ఎంత ఎక్కువ కాలం కొనసాగిస్తే అంత మంచిది. ఒకవేళ రద్దు చేసుకోవాల్సి వస్తే కొత్త వాటిని క్లోజ్ చేసుకోవటం ఉత్తమం. క్రెడిట్ స్వభావానికి తక్కువ వెయిటేజీ ఉంటుందన్నది గమనించాలి. స్కోరుకు సంబంధించి క్రెడిట్ వయస్సుకు మాత్రం మధ్యస్థ వెయిటేజీ ఉంటుంది. రుణ దరఖాస్తు తిరస్కరణకు గురైతే క్రెడిట్ స్కోరుపై ప్రతికూల ప్రభావం ఉండే ఆస్కారం ఉంటుంది.
క్రెడిట్ ఎంక్వైరీ, ఇతర అంశాలు
సిబిల్‌కు సంబంధించినట్లయితే క్రెడిట్ ఎంక్వైరీలతో పాటు ఇతర అంశాలకు మరో 20 శాతం వెయిటేజీ ఉంటుంది. ఇటీవలి కాలంలో తీసుకున్న రుణాలు, క్రెడిట్ కార్డుల గురించి ఇందులో ఉంటాయి. ఇటీవల కాలంలో ఎన్ని రుణ ఎంక్వైరీలు చేశారు అనేది క్రెడిట్ రిపోర్టులో ఉంటుంది.
బ్యాంకులు, కంపెనీలు దరఖాస్తుదారుడి గురించి తెలుసుకునేందుకు క్రెడిట్ స్కోరును తీసుకుంటాయి. వీటిని హార్డ్ ఎంక్వైరీ అంటారు. ఇవి ఎక్కువున్నట్లయితే క్రెడిట్ స్కోరు తగ్గుతుంది. అయితే వినియోగదారుడు స్వయంగా చేసే ఎంక్వైరీని సాఫ్ట్ ఎంక్వైరీ అంటారు. దీనివల్ల క్రెడిట్ స్కోరుపై ప్రభావం ఉండదు. ఒకేసారి ఎక్కువ రుణాలు, క్రెడిట్ కార్డులు తీసుకుంటే క్రెడిట్ ఎంక్వైరీలు పెరుగుతాయి. దీనివల్ల క్రెడిట్ స్కోరు తగ్గుతుంది.
రిపోర్టులో పొరపాట్లు
క్రెడిట్ రిపోర్టులో పొరపాట్లు ఉండే అవకాశం కూడా ఉంది. దీనివల్ల కూడా తక్కువ క్రెడిట్ స్కోరు వచ్చే ఆస్కారం ఉంటుంది. క్రెడిట్ రిపోర్టును తరచూ చెక్ చేసుకొని తప్పులు గమనించినట్లయితే వెంటనే వాటిని సరిదిద్దుకునేందుకు ప్రయత్నం చేయాలి.
మొత్తంగా చూసుకున్నట్లయితే పేమెంట్ హిస్టరీ, క్రెడిట్ యూటిలైజేషన్ అనేవి క్రెడిట్ స్కోరులో ఎక్కువ వాటాను కలిగి ఉన్నాయి. క్రెడిట్ వయస్సు అనేది మధ్యస్థ ప్రభావం కలిగి ఉంది. క్రెడిట్ ఎంక్వైరీలు తక్కువ ప్రభావం కలిగి ఉంటాయి. క్రెడిట్ మిక్స్ ప్రభావం కూడా తక్కువగానే ఉంటుంది.
ఇదీ చూడండి: లాక్డౌన్లో క్రెడిట్ స్కోరు తగ్గిందా?