వంటనూనె వినియోగదారులకు ఆ పరిశ్రమ సమాఖ్య 'సాల్వెంట్ ఎక్సట్రాక్టర్స్ అసోసిషియేషన్ ఆఫ్ ఇండియా (ఎస్ఈఏ)' కాస్త ఊరటనిచ్చే వార్త చెప్పింది. వంటనూనె ధరను కిలోకు (Edible Oil Price News) రూ. 3 నుంచి రూ. 5 వరకు తగ్గిస్తున్నట్లు పేర్కొంది. ఈ ధరలు హోల్‌సేల్ రేట్లపై వర్తించే విధంగా నిర్ణయం తీసుకున్నట్లు చెప్పింది. దీంతో ఈ పండగ సీజన్లో వినియోగదారలకు కొంతమేర ఉపశమనం కలగనుందని స్పష్టం చేసింది.
ఇటీవల కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో పామాయిల్ రిటైల్ ధరలు (Palm Oil News) 21.59 శాతం తగ్గాయి. అక్టోబర్ 1న రూ. 169.60 గా ఉన్న కిలో నూనె ధర.. మాసాంతానికి రూ. 132.98కు చేరుకుంది. ఇదే సమయంలో సోయా ఆయిల్ ధర (Soya Oil News) కూడా కిలోకు రూ. 2.65 మేర తగ్గి.. రూ. 153కు చేరింది. వేరుశనగ, ఆవనూనె, సన్ఫ్లవర్ నూనెలు వరుసగా రూ. 181.97, రూ. 184.99, రూ. 168 ఉన్నట్లు ప్రభుత్వం గణాంకాలు చెబుతున్నాయి. అయితే పండగ నేపథ్యంలో వినియోగదారులకు ఉపశమనం కలిగించేలా.. వంటనూనెలపై టన్నుకు రూ. 3వేల నుంచి రూ.5వేల వరకు తగ్గిస్తున్నట్లు సాల్వెంట్ ఎక్సట్రాక్టర్స్ అసోసిషియేషన్ ఆఫ్ ఇండియా తెలిపింది.
అంతర్జాతీయంగా వంటనూనె ధరలు గణనీయంగా పెరిగినప్పటికీ.. ఇటీవల ప్రభుత్వం తీసుకున్న పన్ను తగ్గింపు నిర్ణయంతో ఆ ప్రభావం వినియోగదారులపై చూపిందని ఎస్ఈఐ పేర్కొంది. పరిశ్రమ వర్గాలు తీసుకున్న తాజా నిర్ణయంతో ధరల మరోసారి 7 నుంచి 11 శాతం మేర తగ్గనున్నట్లు వివరించింది.
ఇదీ చూడండి: గుడ్‌న్యూస్.. తగ్గనున్న వంటనూనె ధరలు