వినియోగదారులకు అందుబాటు ధరల్లో చిన్న పాటి(షాషే సైజ్) ఆరోగ్య బీమా పథకాలు కొనుగోలు చేసేందుకు వీలు కల్పించనున్నట్లు వాట్సప్ పేర్కొంది. భారత్‌లోని వినియోగదార్లకు ఆర్థిక సొల్యూషన్లు అందించడంలో భాగంగా ఈ ఏడాది చివరి కల్లా ఈ సదుపాయాన్ని కల్పించనుంది.
నాలుగు బ్యాంకులతో..
దేశవ్యాప్తంగా 2 కోట్ల మంది వినియోగదార్లకు చెల్లింపుల ఫీచర్‌ను ఇప్పటికే అందుబాటులోకి తీసుకొచ్చిందీ సంస్థ. ప్రస్తుతానికి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్‌బీఐ), హెచ్‌డీఎఫ్‌సీ, ఐసీఐసీఐ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్ ఖాతాదార్లకు ఈ ఫీచర్ పనిచేస్తోంది. మొత్తం 40 కోట్ల మందికి పైగా వాట్సప్ చందాదార్లకుఈ సేవలు అందజేయడం కోసం ఇతర ఆర్థిక సంస్థలతోనూ కలిసి పనిచేయనుంది. సూక్ష్మ-పింఛను, సూక్ష్మ-బీమా, ఎడ్యు-టెక్, అగ్రి-టెక్ వంటి ఫీచర్లను ప్రయోగాత్మకంగా నిర్వహిస్తోంది.
ఈ ఏడాది చివరి కల్లా ఎస్‌బీఐ జనరల్ నుంచి వాట్సప్‌లో అందుబాటు ధరలో చిన్నపాటి ఆరోగ్య బీమా కొనుగోలు చేసేందుకు వీలు కల్పించనున్నట్లు వాట్సప్ స్పష్టం చేసింది. హెచ్‌డీఎఫ్‌సీ పెన్షన్స్, పిన్‌బాక్స్ సొల్యూషన్లనూ అందజేయాలని భావిస్తోంది.
మరోవైపు, భారత్‌లో చిన్నవ్యాపారుల వ్యవస్థను సైతం డిజిటలీకరణ చేయాలని వాట్సప్ భావిస్తోంది. తమ చందాదార్లు తమకు నచ్చిన వ్యాపారుల నుంచి కొనుగోళ్లు జరిపేందుకు వీలుకల్పించాలని భావిస్తున్నట్లు ఫేస్‌బుక్ ఫ్యూయల్ ఫర్ ఇండియా 2020 సదస్సులో వాట్సప్‌ఇండియా అధిపతి అభిజిత్ బోస్ పేర్కొన్నారు.