సంక్షిప్త సందేశాల దిగ్గజం వాట్సాప్ మరో కొత్త ఫీచర్ అందుబాటులోకి తెచ్చేందుకు సిద్ధమైంది. ప్రస్తుతం ప్రపంచాన్ని కరోనా వైరస్ భయాందోళనలకు గురిచేస్తోంది. అయితే దీనిపై వాట్సాప్‌లో వచ్చే తప్పుడు సమాచారంతో మరిన్ని ఎక్కువ భయాలు నెలకొంటున్నాయి. ఇలా తమ ప్లాట్‌ఫామ్ ద్వారా ఫేక్ న్యూస్ ఫార్వర్డ్ కాకుండా అడ్డుకునేందుకు వాట్సాప్ కొత్త అప్‌డేట్‌ను తీసుకురానుంది.
వాట్సాప్‌లో వచ్చే ఫార్వర్డ్ సందేశాల విశ్వసనీయత, దాని మూలలను వెబ్‌లో నిర్ధరించుకునేందుకు ఈ ఫీచర్ ఉపయోగపడనుంది. ప్రస్తుతం టెస్టింగ్ దశలో ఉన్న ఈ ఫీచర్ త్వరలోనే అందుబాటులోకి వచ్చే అవకాశముంది.
కొత్త ఫీచర్ విశేషాలు..
వాట్సాప్ బీటా వెర్షన్ 2.20.94పై ప్రస్తుతం ఈ పీఛర్‌ను పరీక్షిస్తున్నారు. ఏదైనా ఫార్వర్డ్ సందేశం వాట్సాప్ యూజర్ అందుకుంటే దానిపక్కనే సెర్చ్ ఐకాన్ కనిపిస్తుంది. ఆ ఐకాన్‌పై క్లిక్ చేస్తే ఆ ఫార్వర్డ్ సందేశానికి సంబంధించి పూర్తి సమాచారం వెబ్‌లో అందుబాటులో ఉంటుంది. దీని ద్వారా ఫార్వర్డ్ సందేశాల్లో ఉన్న సమాచారం ఎంతవరకు నిజం అనే విషయం సులభంగా తెలుసుకోవచ్చు.
దీనితోపాటు ఇప్పటికే ప్రపంచ ఆరోగ్య సంస్థ బాట్‌నూ ఆందుబాటులోకి తెచ్చింది వాట్సాప్ సంస్థ. దీని ద్వారా వాట్సాప్ యూజర్లు ఎప్పటికప్పుడు కరోనా వైరస్‌పై కచ్చితమైన సమాచారం పొందొచ్చు. ఇప్పుడు రానున్న కొత్త ఫీచర్‌తో ఫార్వర్డ్ సందేశాల కచ్చితత్వాన్నీ తెలుసుకునే వీలు కలగనుంది.
ఇదీ చూడండి:కరోనా నుంచి త్వరగానే కోలుకుంటాం: నాదెళ్ల