అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు మోడల్ టెనెన్సీ యాక్ట్ (Model Tenancy Act)ను అనుసరించేందుకు కేంద్ర కేబినెట్ ఇటీవల ఆమోద ముద్ర వేసింది. దేశంలో సుస్థిర, సమగ్రమైన అద్దె గృహ, రియల్టీ మార్కెట్ అభివృద్ధి చేయడమే లక్ష్యంగా తీసుకొచ్చిందే ఈ మోడల్ అద్దె చట్టం.
రాష్ట్రాలకు పూర్తి స్వేచ్ఛ..
భూ చట్టాలు రాష్ట్రాల పరిధిలోని అంశం. అందువల్ల కేంద్ర చట్టాలను పూర్తిగా పాటించాలా వద్దా అనేది రాష్ట్రాల నిర్ణయంపై ఆధారపడి ఉంటుంది. అలా కాకుండా సొంతంగా చట్టాన్ని మార్చుకునే వీలుంది. అయితే ఈ సవరణలన్నీ కేంద్రం మార్గదర్శకాలకు అనుగుణంగా మాత్రమే ఉండాలి.
కొత్త చట్టాలతో ఓనర్లకు కలిగే లాభాలు..
ప్రస్తుతం అద్దె తీసుకున్న వారితో ఒప్పంద గడువు ముగిసిన తర్వాత కూడా స్థలాన్ని (ఇల్లు, షాప్ లాంటివి) ఖాళీ చేయించేందుకు బలమైన చట్టాలు లేవు. దీనితో చాలా మంది ఓనర్లకు తమ ప్రాపర్టీపై హక్కులు కోల్పోతామని భయపడుతుంటారు.
కొత్త చట్టం అమలులోకి వస్తే.. ప్రాపర్టీ యజమానికి మరిన్ని హక్కులు లభించనున్నాయి. గడువు తర్వాత స్థలాన్ని ఖాళీ చేయకుంటే అద్దెకు ఉంటున్న వారి నుంచి పరిహారం డిమాండ్ చేసేందుకు వీలు కలగనుంది.
ఇంకా స్పష్టంగా చెప్పాలంటే.. అదనపు సమయానికి మొదటి నెలకు గానూ రెండింతలు..ఆ తర్వాతి నెల నుంచి నాలిగింతలు అధికంగా అద్దె వసూలు చేసుకోవచ్చు.
ఇల్లు ఖాళీ చేయించొచ్చు..
అద్దెకు ఉండే వ్యక్తులు వరుసగా రెండు నెలలు అద్దె చెల్లించకుంటే.. కోర్టును ఆశ్రయించే అధికారం యజమానికి ఉండనుంది. కోర్టు ద్వారా కిరాయిదారుని ఖాళీ చేయమని అభ్యర్థించే వీలుంది.
మారు అద్దెకు వీలు లేదు..
ఎవరైన వ్యక్తి తాను అద్దెకు తీసుకున్న స్థలం, ప్రాపర్టీని యజనీవు అనుమతి లేకుండా మరొకరికి అద్దెకు ఇచ్చేందుకు వీలు లేదు. అందుకు అనుమతినిచ్చినా.. కొత్తగా అద్దెకు వచ్చే వారి పూర్తి వివరాలు ఓనర్‌కు సమర్పించాల్సి ఉంటుంది.
అద్దె నిర్ణయం ఓనర్లదే..
ప్రాంతాన్ని బట్టి అద్దె మార్కెట్లో ప్రస్తుత డిమాండ్‌కు తగ్గట్లు అద్దెను నిర్ణయించే అధికారం ఓనర్లకు ఉంటుంది.
కొత్త చట్టం అమలైతే అద్దెకు ఉండే వారికి కలిగే లాభాలు..
అద్దె పెంపునకు ముందే నోటీసు..
ఓనర్లు అద్దె పెంచేందుకు కనీసం మూడు నెలల ముందే అందుకు సంబంధించిన నోటీసులను కిరాయిదారులకు ఇవ్వాల్సి ఉంటుంది. నోటీస్ పీరియడ్ సమయంలో అద్దె పెంచేందుకు వీలు లేదు.
అద్దె పెంపునకు అంగీకరించారా? లేదా? అనేది చెప్పాలి. అద్దెకు ఉండే వారు ఎలాంటి సమాచారం ఇవ్వకున్నా అంగీకారం తెలిపినట్లుగానే భావించొచ్చు.
రసీదు తప్పనిసరి..
అద్దె చెల్లింపునకు సంబంధించి భవిష్యత్‌లో ఎలాంటి వివాదాలు రాకుండా, పారదర్శకంగా బాడుగా వసూలు కోసం ఓనర్లు తప్పనిసరిగా రసీదు ఇవ్వాల్సి ఉంటుంది.
అడ్వాన్స్ సెక్యురిటీ డిపాజిట్..
కొత్త చట్టంతో నివాస గృహాలకైతే రెండు నెలలు, ఇతర స్థలాలకైతే (షాప్‌ల లాంటి వాటికి) ఒక నెల అద్దెను సెక్యూరిటీ డిపాజిట్‌గా చెల్లిస్తే సరిపోతుంది. ఈ వెసులుబాటుతో పలు మెట్రో నగరాల్లో ప్రస్తుతం సంవత్సరం అద్దెను డిపాజిట్‌గా తీసుకునే అవసరం ఉండదు.
వారసత్వ హక్కు..
ఏదైనా కారణం వల్ల యజమాని, అద్దెకున్న వ్యక్తి మరణిస్తే.. వారి తర్వాత వచ్చే వారికి.. గడువు ముగిసే వరకు అవే హక్కులు, అధికారాలు కొనసాగుతాయి.
తనిఖీకీ నోటీసులు
అద్దెకు ఇచ్చిన ఇల్లు లేదా ప్రాంగణాన్ని రిపేర్ చేయించడం లేదా ఇతర తనిఖీలకు 24 గంటల ముందే అద్దెకు ఉండే వారికి ఓనర్ నోటీసులు ఇవ్వాల్సి ఉంటుంది. ఉదయం 7 గంటల లోపు, రాత్రి 8 గంటల తర్వాత వారి తనిఖీకి అనుమతి లేదు.
ఇవీ చదవండి: