కరోనా ధాటికి కొంత మంది ఉపాధి కోల్పోగా, మరికొందరి వేతనాల్లో భారీ కోత పడింది. ఈ ఆర్థిక కష్టాల నుంచి బయటపడేందుకు వారు... రుణాల మార్గం వైపు చూస్తున్నారు. వీరి ముందు రెండు ఆప్షన్స్ ఉన్నాయి. ఒకటి బంగారు రుణాలు, రెండోది వ్యక్తిగత రుణాలు. అయితే ఎవరికి ఏ రుణం ఉయోగపడుతుంది? దేనిని తీసుకోవడం సులభం? ఆర్థిక నిపుణులు ఏమంటున్నారో చూద్దాం!
తనఖా…
బంగారం రుణంలో బంగారాన్ని… నగలు, బిస్కెట్లు, నాణేల రూపంలో బ్యాంకుకు అందించవచ్చు. బంగారం విలువలో 75 శాతం వరకు బ్యాంకులు రుణాలు అందిస్తాయి. రుణం, బంగారం విలువ మధ్య నిష్పత్తి ఎంత ఎక్కువ ఉన్నట్లయితే... అంత ఎక్కువ వడ్డీ రేటు ఉంటుంది.
వ్యక్తిగత రుణంలో ఎలాంటి సెక్యూరిటీ సమర్పించాల్సిన అవసరం లేదు. ఆదాయం, తిరిగి చెల్లించే సామర్థాన్ని అనుసరించి రుణం విలువ నిర్ణయమవుతుంది.
ఆదాయం ఉండి, బంగారం లేనట్లయితే వ్యక్తిగత రుణమే మార్గం. వ్యక్తిగత రుణం రూ.50 వేలు నుంచి రూ.20 లక్షల వరకు తీసుకోవచ్చు.
వడ్డీ రేట్లు
బంగారంపై రుణాలు సెక్యూర్డ్ లోన్స్. వ్యక్తిగత రుణాలు అన్‌సెక్యూర్డ్. ప్రస్తుతం బంగారు రుణాలపై వడ్డీ రేట్లు 7.25 - 29 శాతం మధ్య ఉన్నాయి. వ్యక్తిగత రుణాల్లో వడ్డీ రేట్లు 8.45-26 శాతం వరకు ఉన్నాయి. తీసుకున్న కాలపరిమితి, తిరిగి చెల్లించే పద్ధతి, తీసుకున్న రుణాన్ని అనుసరించి వడ్డీ రేట్లు నిర్ణయమవుతాయి.
మంచి క్రెడిట్ హిస్టరీ ఉన్న వారికి రెండు రకాల రుణాల వడ్డీ రేట్లలో పెద్దగా తేడా ఉండదని నిపుణులు చెబుతున్నారు. లేని వారికి బంగారంపై రుణం తీసుకోవటం మంచి ఆప్షన్ అని వారు అంటున్నారు.
కాలపరిమితి
రుణాన్ని ఒకటి లేదా రెండు సంవత్సరాల్లో తిరిగి చెల్లించాలనుకుంటే బంగారంపై రుణం తీసుకోవటం ఉత్తమమని నిపుణులు చెబుతున్నారు. ఇన్‌స్టాల్‌మెంట్లలో మూడు నుంచి ఐదు సంవత్సరాలు చెల్లించాలనుకుంటే వ్యక్తిగత రుణం తీసుకోవచ్చు.
సాధారణంగా బంగారంపై రుణం 7 రోజుల నుంచి 3 సంవత్సరాల వరకు తీసుకోవచ్చు. దాని అనంతరం రెన్యువల్ చేసుకోవచ్చు. ఎక్కువ కాలపరిమితి ఉన్న రుణాలపై ఎక్కువ వడ్డీ ఉంటుంది.
తిరిగి చెల్లించటం
బంగారు రుణాల్లో తిరిగి చెల్లించేందుకు ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది. దీనికి సంబంధించి ఈఎంఐ ఆప్షన్ లేదా ఒకేసారి తిరిగి చెల్లించటం తదితర ఆప్షన్లను తీసుకోవచ్చు. కొద్ది మొత్తంలో కూడా తిరిగి చెల్లించవచ్చు.
వ్యక్తిగత రుణాల్లో కేవలం ఈఎంఐ ఆప్షన్ మాత్రమే తీసుకోవాలి. వ్యక్తిగత రుణాల్లో కొన్ని బ్యాంకులు పార్ట్ పేమెంట్ సదుపాయాన్ని అందిస్తున్నాయి. స్వల్ప కాలంలో ఆదాయాలపై ప్రభావం పడిన వారు ఈఎంఐ యేతర ఆప్షన్ తీసుకోవచ్చని పర్సనల్ ఫైనాన్స్ నిపుణులు సూచిస్తున్నారు.
క్రెడిట్ స్కోరు
పర్సనల్ రుణాలు కావాలంటే క్రెడిట్ స్కోరు 750, అంతకంటే ఎక్కువ ఉండాలి. కొన్ని బ్యాంకులు 700 నుంచి 750 క్రెడిట్ స్కోరు ఉన్నప్పటికీ రుణాలు అందిస్తున్నాయి. కానీ దీనిపై ఎక్కువ వడ్డీ రేటు ఉంటుంది. బంగారంపై రుణం తీసుకోవటానికి క్రెడిట్ హిస్టరీ అవసరం లేదు. కానీ మంచి క్రెడిట్ హిస్టరీ ఉన్నట్లైతే… బంగారంపై రుణాన్ని తక్కువ వడ్డీ రేట్లకు పొందవచ్చని ఆ రంగంలోని నిపుణులు చెబుతున్నారు.
ప్రాసెసింగ్ సమయం
బంగారు రుణానికి గుర్తింపు కార్డు, చిరునామాకు సంబంధించిన ఆధార పత్రాలు కావాలి. వ్యక్తిగత రుణానికి దీనితో పాటు ఆదాయానికి సంబంధించిన ఆధార పత్రాలు కూడా అందించాలి. వ్యక్తిగత రుణంలో ఆదాయానికి సంబంధించిన పత్రాలను పరిశీలించేందుకు సాధారణంగా 2-7 రోజులు ప్రాసెసింగ్ సమయం పడుతుంది. ప్రాసెసింగ్ ఛార్జీలు వ్యక్తిగత రుణాల్లో 3 శాతం వరకు ఉన్నాయి. గోల్డ్ లోన్ విషయంలో రూ.10 నుంచి మొదలుకొని రుణం మొత్తంలో 2 శాతం వరకు ఉన్నాయి. రుణం తీసుకునేటప్పుడు వీటిని పరిగణనలోకి తీసుకోవాలని పర్సనల్ ఫైనాన్స్ నిపుణులు చెబుతున్నారు.
ఇదీ చూడండి: డిజిటల్ విప్లవానికి కొత్త ఊపిరి