ఆన్లైన్ షాపింగ్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ సరికొత్త సదుపాయాన్ని యూజర్లకు అందుబాటులోకి తెచ్చింది. ప్రీమియం స్మార్ట్ఫోన్ల (Premium Smartphones in India) కోసం కొత్త రిటర్న్ పాలసీని (Flipkart Return Policy) ప్రవేశపెట్టింది. కొన్న స్మార్ట్‌ఫోన్ నచ్చకపోతే.. పూర్తి రీఫండ్ చేసే విధానాన్ని తీసుకొచ్చింది. 'లవ్ ఇట్ ఆర్ రిటర్న్ ఇట్' పేరుతో తీసుకొచ్చిన ఈ ఫీచర్‌ను ఉపయోగించుకోవాలంటే.. కొన్న స్మార్ట్‌ఫోన్‌ను 15 రోజుల్లోగా రిటర్న్ చేయాల్సి ఉంటుంది. ఈ ఫీచర్ కోసం శాంసంగ్‌తో జట్టుకట్టింది ఫ్లిప్‌కార్ట్. ప్రస్తుతానికి శాంసంగ్ గెలాక్సీ జడ్ ఫోల్డ్ 3, గెలాక్సీ జడ్ ఫ్లిప్ 3 ప్రీమియం స్మార్ట్ఫోన్లకు మాత్రమే ఈ ఫీచర్ వర్తిస్తుంది.
కొన్న తర్వాత 15 రోజుల్లో స్మార్ట్‌ఫోన్ నచ్చకపోతే.. ఫ్లిప్‌కార్ట్ యాప్ ద్వారా రిటర్న్ రిక్వెస్ట్ పంపించాలి. ఫోన్ ఐఎంఈఐ నెంబర్‌ను సమర్పించాలి. క్వాలిటీ చెక్ అనంతరం ఫోన్ పికప్ డేట్‌ను ఎంచుకోవాలి. ఫోన్‌ను పరీక్షించిన తర్వాత పూర్తి రీఫండ్‌ను బ్యాంకు ఖాతాలో జమ చేస్తారు. బెంగళూరు, హైదరాబాద్, పుణె, దిల్లీ, ముంబయి, గురుగ్రామ్, అహ్మదాబాద్, కోల్‌కతా, చెన్నై, వడోదరా నగరాల్లోని యూజర్లకు ఇప్పటికే ఈ ఫీచర్ అందుబాటులో ఉంది.
శాంసంగ్‌కు మాత్రమే...
ప్రస్తుతానికైతే శాంసంగ్ ఫోన్లకు మాత్రమే 'లవ్ ఇట్ ఆర్ రిటర్న్ ఇట్' అందుబాటులో ఉంది. ఆన్లైన్ యూజర్లు స్మార్ట్ఫోన్లను ధైర్యంగా కొనుగోలు చేసేలా ప్రోత్సహించేందుకే ఈ ఫీచర్ తీసుకొచ్చింది ఫ్లిప్‌కార్ట్. త్వరలో మరిన్ని కంపెనీలతోనూ జట్టుకట్టే అవకాశం ఉంది!
ఇదీ చదవండి: 'టెస్లా స్టాక్ అమ్మాలనుకుంటున్నా!- మీరేమంటారు?'