Home Loan EMI: సామాన్యులు సైతం సొంతింటి కలను సాకారం చేసుకుంటున్నారంటే దానికి ప్రధాన కారణం తక్కువ వడ్డీ రేట్లకే సులభంగా గృహ రుణాలు లభించడం. గృహ విలువలో 80 నుంచి 90 శాతం వరకు రుణంగా అందించేందుకు రుణ దాతలు ముందుకు రావడం, నెలవారీ వాయిదాల పద్ధతిలో తిరిగి చెల్లింపులకు అవకాశం కల్పించడంతో ఎక్కువ మంది గృహ రుణాలు తీసుకునేందుకు ఆసక్తి చూపుతున్నారు. గృహ రుణం తీసుకున్నప్పుడు నెలవారీ ఈఎంఐ చెల్లింపులను సక్రమంగా చెల్లించినంత వరకూ ఎలాంటి ఇబ్బందీ ఉండదు. కానీ దీర్ఘకాలంలో ఏదో ఒక సమయంలో ఆర్థిక ఇబ్బందులు ఎదురుకావచ్చు. ఇలాంటి సమయంలో ఒకటి రెండు నెలలు ఈఎంఐ చెల్లింపులు చేయలేకపోయినా, ఆలస్యం అయినా ఎలాంటి ఇబ్బందులు ఎదురవుతాయో ఇప్పుడు చూద్దాం..
ఆలస్య రుసుములు: ఒకటి, రెండు నెలలు ఈఎంఐని సమయానికి చెల్లించడంలో విఫలమైతే ఆలస్య రుసుములు కింద జరిమానాలు విధించే అవకాశం ఉంది. ఈ రుసుములు సాధారణంగా చెల్లించాల్సిన ఈఎంఐపై ఒక శాతం నుంచి రెండు శాతం వరకు విధించే అవకాశం ఉంది. అయితే, పరిస్థితిని బట్టి కొన్ని సందర్భాల్లో మొత్తం డిఫాల్ట్ కాలానికి బకాయి ఉన్న మొత్తంపై వడ్డీ చెల్లించాల్సి ఉంటుంది. బ్యాంకులు వసూలు చేసే సాధారణ ఆలస్య రుసుములకు ఇది అదనంగా ఉంటుంది.
క్రెడిట్‌స్కోర్‌పై ప్రభావం: ఒక్క ఈఎంఐ వాయిదా చెల్లించడంలో ఆలస్యం జరిగినా అది మీ క్రెడిట్ స్కోరులో నమోదు అవుతుంది. క్రెడిట్ స్కోర్ 50-70 పాయింట్లు తగ్గొచ్చు. దీని ప్రభావం మీ భవిష్యత్ రుణాలపై చూపిస్తుంది. అయితే మీరు చెల్లించకుండా మిస్ చేసిన ఈఎంఐలను 90 రోజుల్లోగా ఆలస్య రుసుములతో కలిపి చెల్లించడం మంచిది. ఇలా సకాలంలో దిద్దుబాటు చర్యలు తీసుకుంటే క్రెడిట్ స్కోరు ఎక్కువ ప్రభావితం కాకుండా చూసుకోవచ్చు. మిస్ చేసిన ఈఎంఐని చెల్లించడంతో పాటు, తదుపరి ఈఎంఐలను సకాలంలో చెల్లించేలా జాగ్రత్త పడాల్సి ఉంటుంది.
ఇంటిని వేలం వేయొచ్చు: 90 రోజుల తర్వాత కూడా మీ బకాయిలను తిరిగి చెల్లించలేకపోతే వాటిని మొండి బకాయిల (ఎన్‌పీఏ) కింద చేర్చి.. బకాయిలను రాబట్టుకునేందుకు బ్యాంకులు మీ ఇంటిని వేలం వేయొచ్చని గుర్తుంచుకోవాలి. ఇలాంటి పరిస్థితి రాకుండా రుణదాతను సంప్రదించి, సమస్యను పరిష్కరించేందుకు ప్రయత్నించండి.
ఎలా పరిష్కరించాలి..?: గృహ రుణ డిఫాల్ట్‌ను నివారించేందుకు ఈఎంఐను తగ్గించాలని రుణదాతను అభ్యర్థించవచ్చు. ఒకవేళ ఉద్యోగం కోల్పోవడం, వ్యాపార కార్యకాలాపాలు తాత్కాలికంగా నిలిచిపోవడం వల్ల ఆదాయం ఆగిపోతే కొద్దికాలం పాటు ఈఎంఐలు చెల్లించకుండా ఈఎంఐ రహిత కాలవ్యవధిని కోరవచ్చు. ఇలాంటి సందర్భాల్లో మూడు నుంచి ఆరు నెలల పాటు ఈఎంఐలు చెల్లించకుండా బ్రేక్ ఇచ్చేందుకు బ్యాంకులు అనుమతి ఇచ్చే అవకాశం ఉంది. అయితే ఈ కాలానికి సంబంధించి బకాయి ఉన్న లోన్ మొత్తంపై వడ్డీని వసూలు చేస్తాయి.
- ఈఎంఐ భారాన్ని తగ్గించుకోవడానికి పాక్షిక చెల్లింపులు చేయడం మరొక ఎంపిక. ఇది హోమ్ లోన్ ఓవర్‌డ్రాఫ్ట్ సదుపాయాన్ని ఉపయోగించి చేయవచ్చు. మీకు మిగులు నిధులు అందుబాటులో ఉన్నప్పుడల్లా ఈఎంఐకి అదనంగా కొంత మొత్తం ఖాతాలో అదనంగా జమ చేస్తే, ఆర్థిక ఇబ్బందులు వచ్చినప్పుడు కొంత వరకు ఆర్థిక భారాన్ని తగ్గించుకోవచ్చు.
ఇవీ చూడండి: