భారతీయులకు బంగారం అంటే ఎనలేని ఇష్టం. ప్రతి ఇంట కొంత మొత్తంలోనైనా బంగారం ఉంటుంది. ఆపత్కాలంలో ఆదుకునే ఆపద్బంధువుగా ఉపయోగపడుతుంది. కేవలం దేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ప్రాచీన కాలం నుంచి బంగారం సంపదకు చిహ్నంగా ఉంది. ప్రస్తుత కాలంలో బంగారాన్ని పెట్టుబడిపరంగానూ చాలా మంచి సాధనంగా పరిగణనలోకి తీసుకోవచ్చు.
ఒకప్పుడు బంగారం కొనుగోలు చేయాలనుకుంటే భౌతికంగా కొనుగోలు చేయటమే ఏకైక మార్గంగా ఉండేది. అయితే ఇప్పుడు బంగారం కొనుగోలు చేసేందుకు వివిధ మార్గాలు ఉన్నాయి. వీటి ద్వారా భౌతికంగా బంగారం ఇంటికి రాకున్నా... దాన్ని ప్రతిబింబించేలా పెట్టుబడులు పెట్టి అదే విలువ పొందవచ్చు. ధర అనుగుణంగా పెట్టుబడిలో హెచ్చు తగ్గులుంటాయి. భౌతిక బంగారంతో పాటు మొత్తంగా దీనిపై పెట్టుబడికి ఉన్న మార్గాలు ఏంటి? వాటి పెట్టుబడి మార్గం, కనీస పెట్టుబడి తదితర విషయాలను తెలుసుకుందాం.
భౌతిక బంగారం, కాయిన్స్..
బంగారంపై పెట్టుబడి పెట్టేందుకు ఎప్పటినుంచో అనుసరిస్తున్న మార్గం ఇది. బంగారం దుకాణానికి వెళ్లి.. ఆ రోజు ఉన్న ధరకు అనుగుణంగా భౌతికంగా బంగారం పొందవచ్చు. వీటిని చాలా మంది నగల రూపంలో చేయించుకుంటారు. అయితే నగల తయారీలో తరుగు వచ్చే ఆస్కారం ఉంటుంది. బంగారాన్ని కాయిన్ల రూపంలో కూడా కొనుగోలు చేయవచ్చు. దేశంలో బంగారం కాయిన్లు 0.5 గ్రాముల నుంచి 50 గ్రాముల భారంతో లభిస్తాయి. భౌతికంగా బంగారాన్ని జాగ్రత్తగా దాచిపెట్టుకోవాల్సి ఉంటుంది. వీటి భద్రతను సరిగ్గా చూసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ బ్యాంకులో పెట్టినట్లయితే లాకర్ ఛార్జీలు చెల్లించాల్సి ఉంటుంది. నిరూపయోగంగా ఉన్న బంగారాన్ని గోల్డ్ మానిటైజేషన్ స్కీమ్ లో పొదుపు చేయవచ్చు. వీటిని కేంద్ర ప్రభుత్వం తరఫున బ్యాంకులు స్వీకరిస్తాయి. లాకర్ ఛార్జీలు లేకపోగా దీని వల్ల వడ్డీ కూడా లభిస్తుంది. ప్రస్తుతం 5 నుంచి 7 సంవత్సరాల గోల్డ్ మానిటైజేషన్ స్కీమ్ పై 2.25 శాతం వడ్డీ లభిస్తోంది.
గోల్డ్ ఈటీఎఫ్...
ఈటీఎఫ్ అంటే ఎక్ఛేంజీ ట్రేడెడ్ ఫండ్. అదే బంగారం ఆధారంగా ఉంటే అది గోల్డ్ ఈటీఎఫ్. ఎస్‌జీబీ అంటే గోల్డ్ సావరిన్ బాండ్లు. వీటిని ప్రభుత్వం తరఫున ఆర్బీఐ జారీ చేస్తుంది. ఈటీఎఫ్‌లను ఖచ్చితమైన ధరలకు కొనుగోలు చేయొచ్చు. ఎక్స్పెన్స్ నిష్పత్తి చాలా తక్కువగా ఉంటుంది. ఇందులో బ్రోకరేజీ ఛార్జీలు, డీమ్యాట్ ఛార్జీలు ఉంటాయి. మనం పెట్టే పెట్టుబడికి, పొందే విలువకు మధ్య తేడానే ఎక్స్పెన్స్ నిష్పత్తి. గోల్డ్ ఈటీఎఫ్‌లలో తక్కువ డబ్బుతో పెట్టుబడి పెట్టే అవకాశం ఉంటుంది. కనీసం ఒక ఈటీఎఫ్ కొనుగోలు చేయాల్సి ఉంటుంది. మనకు కావాల్సినప్పుడు వీటిని అమ్మి డబ్బులు పొందవచ్చు.
ఇవి కొనుగోలు చేయాలంటే డీమ్యాట్ ఖాతా ఉండాలి. సాధారణంగా స్టాక్ మార్కెట్లలో లాభాలపై లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్, షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ ఉంటాయి. ఇవి గోల్డ్ ఈటీఎఫ్‌లకు కూడా వర్తిస్తాయి. నెలవారీగా చిన్న మొత్తాల్లో పెట్టుబడి పెట్టటం వల్ల దీర్ఘకాలంలో కొంత మొత్తంలో బంగారం పోగుచేసుకోవచ్చు.
గోల్డ్ మ్యూచువల్ ఫండ్లు..
ఈ మ్యూచువల్ ఫండ్లు వివిధ రకాల గోల్డ్ ఈటీఎఫ్‌లలో పెట్టుబడులు పెడతాయి. సాధారణ మ్యూచువల్ ఫండ్లలో పెట్టుబడి పెట్టినట్లే వీటిలో కూడా పెట్టుబడి పెట్టుకోవచ్చు. ఇది మౌలికంగా చూసుకుంటే ఫండ్ ఆఫ్ ఫండ్స్ విభాగంలోకి వస్తాయి. గోల్డ్ ఈటీఎఫ్‌లతో పోల్చితే వీటిలో ఎక్స్పెన్స్ రేషియో కొంత ఎక్కువగా ఉంటుంది. దీర్ఘకాలంలో బంగారం కొనుగోలు చేసుకోవాలనుకుంటే నెలవారీగా సిప్ రూపంలో ఇందులో మదుపు చేసుకోవటం ఉత్తమం.
ఎన్జీబీ...
దేశీయంగా బంగారం కొనుగోలుపై వెచ్చించే మొత్తాన్ని మళ్లించేందుకు ఎస్జీబీలను 2015లో ప్రవేశపెట్టారు. ఇది కూడా బంగారంపై పెట్టుబడికి ఒక అనువైన మార్గం. ఆర్బీఐ సాధారణంగా ఒకటి రెండు నెలలకోసారి వీటిని విడుదల చేస్తుంది. వీటిలో వార్షికంగా 2.5 శాతం రాబడి అర్జించవచ్చు. వడ్డీని ఆరు నెలలకు ఒక సారి బ్యాంక్ ఖాతాల ద్వారా చెల్లిస్తారు. ఈ బాండ్లకు ఎనిమిది సంవత్సరాల మెచ్యూరిటీ పీరియడ్ ఉంటుంది. ఐదు సంవత్సరాల అనంతరం పెట్టుబడిని ఉపసంహరించుకునే(ఎగ్జిట్ ఆప్షన్) అవకాశం ఉంటుంది. పెట్టుబడి వెనక్కి తీసుకోవటం లేదా మెచ్యూరిటీ పీరియడ్‌లో ఉన్న బంగారం ధర ప్రకారమే అప్పటి ధర నిర్ణీతమౌతుంది.
జాతీయ బ్యాంకులు, షెడ్యూల్డ్ ప్రైవేట్ బ్యాంకులు, పోస్టాఫీసులు, స్టాక్ ఎక్సైంజీ తదితరాలు వీటిని ఆర్బీఐ నిబంధనలకు అనుగుణంగా విక్రయిస్తాయి. వీటి కొనుగోలుకు ఎలాంటి ఛార్జీలు ఉండవు. కనీసం ఒక గ్రాము కొనుగోలు చేయాల్సి ఉంటుంది. అంటే దాదాపు రూ.5వేలు కనీస పెట్టుబడి అనుకోవచ్చు.
డిజిటల్ గోల్డ్..
ఇటీవల కాలంలో పేమెంట్స్ యాప్స్ అన్నీ ఈ సదుపాయాన్ని అందిస్తున్నాయి. బంగారాన్ని భౌతికంగా పొందకుండా డిజిటల్ రూపంలో పొందటమే డిజిటల్ గోల్డ్. వివిధ యాప్‌ల ద్వారా వీటిని కొనుగోలు చేయవచ్చు. రూపాయితో కూడా దీనిద్వారా పెట్టుబడి పెట్టవచ్చు. అయితే దీనిపై జీఎస్టీ 3 శాతం వర్తిస్తుంది.
గోల్డ్ డిపాజిట్ స్కీమ్..
కొన్ని జ్యువెల్లర్స్ గోల్డ్ డిపాజిట్ సేవింగ్ స్కీమ్‌ను నడిపిస్తున్నాయి. ఇవి రికరింగ్ డిపాజిట్ లాంటివే. వీటిలో నెలవారీగా కొంత మొత్తం పొదుపు చేయాల్సి ఉంటుంది. నిర్ణీత నెలల చెల్లించిన అనంతరం బంగారాన్ని అందిస్తాయి జ్యువెల్లర్స్. అయితే ఇందులో మెజారిటీ జ్యువెల్లర్స్ ఎలాంటి వడ్డీ అందించరు. అయితే చివరి వాయిదాపై డిస్కౌంట్ లాంటివి అందించవచ్చు.
ఇదీ చూడండి: తక్కువ సమయంలో ఎక్కువ రాబడికి బెస్ట్ ఫండ్స్ ఇవే..