కొవిడ్ మహమ్మారి వల్ల చాలా మందికి ఆదాయాలు తగ్గిపోయాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఎక్కువ మంది రుణాలను తీసుకుంటుంటారు. ఇందుకు చాలా మార్గాలున్నాయి. వీటిలో ఓవర్ డ్రాఫ్ట్ సదుపాయం కూడా ఒకటి. సులభంగా ఉండే ఈ సదుపాయం గురించి చాలా తక్కువ అవగాహన ఉంటుంది.
ఓవర్ డ్రాఫ్ట్ ద్వారా ఖాతాలో ఉన్న దానికంటే ఎక్కువ మొత్తాన్ని తీసుకునే వీలుంటుంది. ఉదాహరణకు ఖాతాలో లక్ష రూపాయలు ఉన్నాయనుకోండి.. ఓవర్ డ్రాఫ్ట్ సదుపాయం రూ.50వేలు ఉంటే మొత్తం రూ.1.5 లక్షలు నగదు తీసుకోవచ్చు.
సాధారణంగా వ్యక్తిగత రుణం తీసుకున్నట్లయితే మొదటి రోజు నుంచి వడ్డీ లెక్కవుతుంది. ఈఎమ్‌ఐ రూపంలో వడ్డీ చెల్లించాల్సి ఉంటుంది. మొదటి నెల రూ.20వేలు, రెండో నెల రూ.30వేలు, తరువాతి నెల రూ. 50వేల అవసరం ఉన్నట్లయితే వ్యక్తిగత రుణంలో రూ.లక్ష ఒకేసారి తీసుకోవాల్సి ఉంటుంది. ఉపయోగించిన కాలంతో సంబంధం లేకుండా మొదటి రోజు నుంచి వడ్డీ చెల్లించాల్సి ఉంటుంది.
తీసుకున్న వరకే వడ్డీ..
ఓవర్ డ్రాఫ్ట్ దీనికి కొంచెం భిన్నమైనది. ఇందులో ఎప్పుడైనా ఉపసంహరణ, జమ చేసుకోవచ్చు. అనుమతించిన లిమిట్ వరకు డబ్బులు తీసుకోవచ్చు. తక్కువ అవసరం ఉంటే అంతవరకే తీసుకొని ఆ మొత్తానికే వడ్డీ చెల్లించాలి. రూ. లక్ష పరిమితి ఉన్న వారు రూ.20 వేలు తీసుకున్నట్లయితే దానిపైనే వడ్డీ కట్టాల్సి ఉంటుంది. ఇంకా రూ.80 వేలు తరువాత వాడుకోవచ్చు. తిరిగి 20 వేలు చెల్లించినట్లయితే ఓవర్ డ్రాఫ్ట్ లిమిట్ లక్ష రూపాయలకు చేరుకుంటుంది. మళ్లీ అవసరం ఉన్నప్పుడు లక్ష రూపాయల వరకు తీసుకోవచ్చు.
ఏది మంచిది?
పైన వ్యక్తిగత రుణంలో తీసుకున్న ఉదాహరణను ఓవర్ డ్రాఫ్ట్ విషయంలో పరిగణిద్దాం. అందులో మొత్తం రూ. లక్ష వడ్డీతో సహా 5 నెలల అనంతరం చెల్లించినట్లయితే రూ.20 వేలకు ఐదు నెలలు, రూ.30 వేలకు నాలుగు నెలలు, రూ.50వేలకు మూడు నెలలు వడ్డీ చెల్లించాల్సి ఉంటుంది. ఓవర్ డ్రాఫ్ట్‌పై వడ్డీ రోజు వారీగా లెక్కవుతుంది.
సెక్యూరిటీతో ఓవర్ డ్రాఫ్ట్...
బ్యాంకులు ఫిక్స్‌డ్ డిపాజిట్లు, లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీ, ఆస్తులను సెక్యూరిటీగా ఉంచుకొని ఓవర్ డ్రాఫ్ట్ సదుపాయాన్ని ఇస్తాయి. గృహ రుణాలపై టాప్ అప్ లోన్ రూపంలో కూడా దీన్ని పొందవచ్చు.
బ్యాంకులో ఫిక్స్‌డ్ డిపాజిట్ ఉన్న వారికి డబ్బులు అవసరం ఉన్నట్లయితే దానిపైన ఓవర్ డ్రాఫ్ట్ తీసుకోవచ్చు. ఇలాంటి సందర్భాల్లో వడ్డీ రేట్లు ఆ ఫిక్స్‌డ్ డిపాజిట్ వడ్డీ రేటు కంటే 1 నుంచి 2 శాతం ఎక్కువుంటుందని నిపుణులు చెబుతున్నారు.
గృహ రుణం ఉన్నట్లయితే ఓవర్ డ్రాఫ్ట్ ఉన్న టాప్ అప్ లోన్ తీసుకోవచ్చు. అయితే టాప్ అప్ లోన్‌పై వడ్డీ ఆ గృహ రుణం కంటే ఎక్కువ ఉంటుంది. మిగతా ఓవర్ డ్రాఫ్ట్ కంటే దీనిలో ఎక్కువ కాలానికి పొందవచ్చు.
శాలరీ ఖాతాలపైనా..
ఉద్యోగులకు వేతన అకౌంట్లపై బ్యాంకులు ఓవర్ డ్రాఫ్ట్ సదుపాయాన్ని అందిస్తున్నాయి. పలు బ్యాంకులు కరోనా దృష్టిలో ఉంచుకొని ఓవర్ డ్రాఫ్ట్ సదుపాయాన్ని ప్రవేశపెట్టాయి. బ్యాంకులను బట్టి కనీస వేతనం రూ.15వేల నుంచి రూ. 25వేల అర్హతగా ఉంది. వీరికి ఎలాంటి తనఖా లేకుండానే బ్యాంకులు ఓవర్ డ్రాఫ్ట్ సదుపాయాన్ని ఇస్తున్నాయి. పలు బ్యాంకులు పొదుపు ఖాతాలపై కూడా ఓవర్ డ్రాఫ్ట్‌ను అందిస్తున్నాయి.
ఇదీ చూడండి: 5 నెలలు ఫ్రీ డేటా- జియో టు జియో ఫ్రీ కాల్స్!