డిమాండ్‌కు తగ్గట్లు ముడిచమురు ఉత్పత్తి తగ్గించాలన్న ఒపెక్ దేశాల చర్చలు ఫలించలేదు. అతి పెద్ద చమురు ఉత్పత్తిదారు సౌదీ ఆరామ్కో మార్కెట్లకు భారీగా ముడిచమురును విడుదల చేయడం వల్ల క్రూడ్ ఆయిల్ ధరలు 30 శాతానికిపైగా తగ్గాయి. ఈ పరిణామాలన్నింటి నేపథ్యంలో బ్యారెల్ ముడిచమురు ధర 35 డాలర్లకు చేరింది.
ఈ ప్రభావంతో దేశీయంగా పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గాలి. అయితే మన దేశంలో ముడిచమురు ఉత్పత్తుల ధరలను 15 రోజుల పర్యవేక్షణ తర్వాత సవరిస్తున్నారు. ఈ కారణంగానే అంతర్జాతీయ మార్కెట్లో ధరలు తగ్గిన వెంటనే మనపై ఆ ప్రభావం ఉండటం లేదని ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ అధికారి ఒకరు తెలిపారు.
ఎంత తగ్గుతాయి?
పెట్రోల్, డీజీల్ ధరల్లో భారీ తగ్గుదల నమోదయ్యేందుకు మరో 10 రోజులు పట్టే అవకాశముంది. వచ్చే వారంలో పెట్రోల్, డీజిల్ ధరలు రూ.5 నుంచి రూ.6 వరకు తగ్గొచ్చు.
దేశ రాజధాని దిల్లీలో ప్రస్తుతం లీటర్ పెట్రోల్ ధర రూ.70.29, లీటర్ డీజల్ ధర రూ.63.01గా ఉంది.
ఇవీ ముఖ్యమే..
డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ వారంలో 4 శాతం వరకు క్షీణించింది. ముడిచమురు కొనుగోలుకు డాలర్లలోనే చెల్లించాలి. ఈ నేపథ్యంలో డాలర్ విలువకు తగ్గట్లు ఎక్కువ మొత్తంలో మన కరెన్సీని కేటాయించాల్సి ఉంటుంది. వీటికి తగ్గట్లు ధరల్లో సవరణ చేయనున్నాయి చమురు మార్కెటింగ్ సంస్థలు.
ప్రభుత్వాలు కూడా చమురు ధరలు తగ్గిన నేపథ్యంలో.. ఎక్సైజ్ సుంకాలు పెంచి తమ ఖజానా నింపుకునేందుకు ప్రయత్నించొచ్చు. ఒకవేళ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సుంకాలు పెంచకపోతే మాత్రం పెట్రోలియం ఉత్పత్తుల వినియోగదారులకు భారీగా లబ్ధి చేకూరే అవకాశముందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
ఇదీ చూడండి:ఎస్బీఐ ఖాతాదారులకు శుభవార్త- ఇక కనీస నిల్వ అక్కర్లేదు