బ్రిటన్‌లో తలదాచుకుంటున్న భారతీయ వ్యాపారవేత్త విజయ్ మాల్యా ఎప్పటికీ భారత్‌కు రాకుండా తప్పించుకునేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. బ్రిటన్‌ను ఆయన శరణు కోరినట్లు వస్తున్న ఊహాగానాలకు తాజాగా మరింత బలం చేకూరింది.
మరోమార్గంలో..
దివాలా వ్యవహారానికి సంబంధించిన ఓ కేసులో ఆయన తరఫు న్యాయవాది ఫిలిప్ మార్షల్ శుక్రవారం లండన్ హైకోర్టులో విచారణకు హాజరయ్యారు. 'మరో మార్గం' ద్వారా బ్రిటన్‌లోనే ఉండేలా హోం మంత్రి ప్రీతీ పటేల్‌కు మాల్యా దరఖాస్తు చేసుకున్నట్లు మార్షల్ ధ్రువీకరించారు. భారత్‌కు తనను అప్పగించొద్దని విన్నవిస్తూ మాల్యా దాఖలు చేసిన పిటిషన్‌ను బ్రిటన్ సుప్రీం కోర్టు గత ఏడాదే కొట్టివేసింది. అయితే ఆ దేశ హోంశాఖ నుంచి అనుమతుల మంజూరు ప్రక్రియ ఇంకా పూర్తికాకపోవడంతో అప్పగింత వ్యవహారం ఇంకా పెండింగ్‌లోనే ఉంది.
మాల్యాకు సంబంధించి రహస్య న్యాయ ప్రక్రియ కొనసాగుతోందంటూ ఇటీవల హోంశాఖ పేర్కొనడంతో.. ఆయన శరణార్థిగా ఉండేందుకు దరఖాస్తు చేసుకున్నట్లు ఊహాగానాలు వెలువడ్డాయి.
ఇదీ చదవండి: నీరవ్ మోదీ కేసులో ఫిబ్రవరి 25న తుది తీర్పు