టీకాను ఉత్పత్తి చేయడం అనేది ప్రత్యేక విధానమని అన్నారు సీరం ఇన్స్టిట్యూట్ అధినేత అదర్ పునావాలా. రాత్రికి రాత్రే పెద్దమొత్తంలో వ్యాక్సిన్ను ఉత్పత్తి చేయడం కుదరదని తెలిపారు. భారత్లో 18 ఏళ్లు పైబడిన వారు చాలా ఎక్కువ మంది ఉన్నారన్న ఆయన.. వారందరికీ తగినన్ని మోతాదులను సరఫరా చేయడం అంత సులభమైన పని కాదని వివరించారు.
తాను లండన్ పర్యటనలో ఉన్నప్పటికీ.. భారత్లో కరోనా రెండో దశను ఎదుర్కోవడానికి సంస్థ సకల ప్రయత్నాలు చేస్తోందని తెలిపారు. రాబోయే కొన్ని నెలల్లో 11 కోట్ల టీకాలను ప్రభుత్వానికి సరఫరా చేయనున్నట్లు వివరించారు. ఎన్నో అభివృద్ధి చెందిన దేశాలు, కంపెనీలు తక్కువ జనాభా ఉన్న వారికి కూడా పూర్తిస్థాయిలో అందించలేకపోతున్న విషయాన్ని పూనావాలా గుర్తుచేశారు.
టీకా సరఫరా విషయంలో తనకు బెదిరింపులు వచ్చాయన్న పూనావాలా సర్వత్రా చర్చనీయాంశమైన నేపథ్యంలో ఆయన ఈమేరకు ట్వీట్ చేశారు.
"నేను చేసిన వ్యాఖ్యలను తప్పుదోవ పట్టించారు. వాటికి వివరణ ఇవ్వాల్సిన సమయమిది. గతేడాది ఏప్రిల్ నుంచి మా సంస్థ ప్రభుత్వం కోసమే పని చేస్తోంది. వ్యాక్సిన్ ఉత్పత్తి చేయడం అనేది ప్రత్యేక విధానం. రాత్రికి రాత్రే ఉత్పత్తిని పెంచడం సాధ్యంకాదు. భారత్లో ఉండే 18 ప్లస్ వారందరికీ టీకా అందించడం అంత సులభమైన విషయం కాదు."
-అదర్ పూనావాలా, సీరం అధిపతి
ఇవీ చూడండి: