దేశీయ స్టాక్ మార్కెట్లు ఈ వారం కొంత విక్రయాల ఒత్తిళ్లను ఎదుర్కోవచ్చని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలకు ముందు ట్రేడర్లు, మనీ మేనేజర్లు తమ పోర్ట్‌ఫోలియోలో రిస్క్ ఉన్న పొజిషన్లను వదిలించుకునే అవకాశం ఉండడం ఇందుకు నేపథ్యంగా చెబుతున్నారు. కార్పొరేట్ ఫలితాలకు తోడు డెరివేటివ్ గడువు కూడా ప్రభావం చూపొచ్చని అంటున్నారు. ప్రపంచ మార్కెట్లలో కనిపిస్తున్న ఈ పరిస్థితి తుపానుకు ముందు ప్రశాంతతగా భావించాలని అంతర్జాతీయ నిపుణులు అంటున్నారు.
ఎన్నికలు పూర్తయ్యే వరకు 12 వేలకు దిగువనే?
అమెరికా ఎన్నికల అనిశ్చితికి తోడు ఫలితాలు తేదీ(నవంబర్ 3)కి ముందు ఉద్దీపన ప్యాకేజీపై ఆశలు సన్నగిల్లుతున్నాయని డీలర్లు అంటున్నారు. ఎన్నికలు పూర్తయ్యేవరకు నిఫ్టీ-50 సూచీ 12,000 పాయింట్లను అధిగమించకపోవచ్చని.. 11,6500-11,750 మధ్య మద్దతు లభించవచ్చని నిపుణులు చెబుతున్నారు.
వివిధ రంగాలపై విశ్లేషకుల అంచనాలు ఇలా..
- ప్రభుత్వ రంగ చమురు కంపెనీల షేర్లు స్థిరీకరణకు లోనయ్యే అవకాశం ఉంది. అయితే అంతర్లీనంగా సానుకూలతలు కనిపించవచ్చు. అప్‌స్ట్రీమ్ కంపెనీలతో పోలిస్తే రిఫైనరీ షేర్లు ఎక్కువ సానుకూలంగా కదలాడే అవకాశం ఉంది. అంతర్జాతీయ చమురు ధరల ఆధారంగా చమురు కంపెనీల షేర్లు చలించవచ్చు.
- లోహ, గనుల కంపెనీల షేర్లు స్తబ్దుగా చలించవచ్చు. గత వారం ర్యాలీ నేపథ్యంలో.. ఈ వారం కొంత లాభా స్వీకరణవైపు మదుపరులు మొగ్గు చూపవచ్చ. శనివారం మధ్యంతర డివిడెండు (రూ.9.50) ప్రకటించిన నేపథ్యంలో వేదాంతా షేర్లు వెలుగులోకి రావొచ్చు. అక్టోబర్ 30న ఫలితాలు ప్రకటించనున్న నేపథ్యంలో జిందాల్ స్టీల్‌పై మదుపరుల దృష్టి సారించొచ్చు.
- గిరాకీ రికవరీ అంచనాల మధ్య ఎఫ్ఎంసీజీ షేర్లు సానుకూలంగా చలించే అవకాశం ఉంది. హిందుస్థాన్ యునిలీవర్ కంపెనీ రికవరీపై ఆశావాహంగా ఉన్నప్పటికీ.. జాగ్రత్త వహించనున్నట్లు పేర్కొంది. అయితే అధ్వాన పరిస్థితులు తొలగినట్లేనని చెప్పింది. మారికో బుధవారం వెలువరిచే ఫలితాలపై మదుపరుల దృష్టి పడొచ్చు.
- వాహన కంపెనీల షేర్లు చాలా వరకు తక్కువ శ్రేణిలో కదలాడవచ్చు. బుధవారం ప్రకటితమయ్యే హీరో మోటోకార్ప్ జులై-సెప్టెంబర్ ఫలితాలు కీలకం కానున్నాయి. మంగళవారం వెల్లడయ్యే టాటా మోటార్స్ ఫలితాలను ట్రేడర్లు గమనించే వీలుంది.
- ఐటీ కంపెనీల షేర్లు రాణించవచ్చు. గత రెండు వారాలుగా స్తబ్తుగా చలించడం ఇందుకు నేపథ్యం. టెక్ మహీంద్రా మెరుగైన ఫలితాలను ప్రకటించడానికి తోడు.. రికార్డు స్థాయి ఒప్పందాలను కుదుర్చుకున్న నేపథ్యంలో ఈ కంపెనీ షేర్లు వెలుగులోకి రావొచ్చు.
- ఎంపిక చేసిన టెలికాం కంపెనీల షేర్లలో కదలికలు కనిపించవచ్చు. భారతీ ఎయిర్టెల్, జులై-సెప్టెంబర్ ఫలితాల నుంచి మదుపరులు సంకేతాలు అందిపుచ్చుకోవచ్చు. వొడాఫోన్-ఐడియా షేర్లు స్తబ్దుగా చలించొచ్చు.
- ఎటువంటి వార్తలు లేకపోవడం ప్రధాన రంగలపై అంచనాలు బలహీనంగ ఉన్న నేపథ్యంలో యంత్రపరికరాల షేర్లు డీలా పడే అవకాశం ఉంది. కీలక సూచీల నుంచి ఈ రంగ షేర్లు సంకేతాలు పొందొచ్చు.
- అక్టోబర్ డెలివేటివ్ కాంట్రాక్టులకు ముందు జరిగే షార్ట్ కవరింగ్ నేపథ్యంలో బ్యాంకింగ్ షేర్లు లాభాలను కొనసాగించే అవకాశం ఉంది. కోటక్ మహీంద్రా బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, ఆర్బీఎల్ బ్యాంక్, ఏయూ స్మాల్ ఫినాన్స్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా, కెనరా బ్యాంక్, కరూర్ వైశ్యా బ్యాంక్ ఫలితాలు కీలకం కానున్నాయి.
- ఎసీసీ, అల్టాటెక్ సిమెంట్, అంబుజా సిమెంట్ వంటి దిగ్గజ కంపనీల ఫలితాలు రాణించిన నేపథ్యంలో సిమెంటు కంపెనీల షేర్లు రాణించే వీలుందని విశ్లేషకులు అంటున్నారు. గిరాకీ పెరుగుతున్నందున ధరలు కూడా పెరిగే అవకాశం ఉంది. సాంకేతికంగా చూస్తే శ్రీ సిమెంట్ షేర్లలో ఎంపిక చేసిన చలనాలు కనిపించవచ్చు.
- ఫార్మా షేర్ల నష్టాలు కొనసాగవచ్చు. విలువల విషయంల ఆందోళనతో ఇటీవల చోటు చేసుకున్న లాభాల స్వీకరణ, ఇతర రంగాలకు నిధుల రొటేషన్ ఇందుకు కారణాలుగా నిలవవచ్చు. నియంత్రణపరమైన చిక్కులు మళ్లీ కనిపించకపోవడం కూడా ప్రతికూలంగా పని చేయవచ్చు.
ఇదీ చూడండి:వరద నష్టానికి బీమా క్లెయిమ్ చేయాలా?