చైనా టెక్ దిగ్గజం హువావేపై అమెరికా కొత్త ఆంక్షలు ప్రవేశపెట్టింది. విదేశాల్లో తయారు చేసే సెమీకండక్టర్ ఉత్పత్తుల తయారీలో అమెరికా సాంకేతికత వినియోగంపై పరిమితులు విధించింది. ప్రభుత్వం అనుమతి లేకుండా హువావేకు విదేశీ సంస్థలు పరికరాలు విక్రయించకూడదని స్పష్టం చేసింది.
ప్రస్తుతం కొనసాగుతున్న ఆంక్షలను హువావే ఉల్లంఘించకుండా నియంత్రించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు అమెరికా వాణిజ్య మంత్రి విల్బర్ రాస్ స్పష్టం చేశారు.
"విధానాల్లో చాలా లొసుగులను ఉపయోగించి హువావే అమెరికా సాంకేతికతను ఉపయోగించుకుంది. ఇక అలాంటి మార్గాలు ఉండాలని కోరుకోవటం లేదు."
- విల్బర్ రాస్, అమెరికా వాణిజ్య మంత్రి
ప్రపంచవ్యాప్తంగా ఉన్న సెమీకండక్టర్ ఆధారిత పరిశ్రమల్లో దాదాపు అమెరికా తయారుచేసిన చిప్ డిజైన్, తయారీ పరికరాలనే ఉపయోగిస్తారు. ఈ నేపథ్యంలో హువావేతో పాటు దాని అనుబంధ సంస్థ హైసిలికాన్కు విక్రయాలు జరిపే విదేశీ ఉత్పత్తిదారులే లక్ష్యంగా తాజా నిర్ణయం తీసుకుంది అమెరికా.
కొత్త నిబంధనల ప్రకారం.. అమెరికా సాంకేతికతతో చేసిన హువావే పరికరాలు సరఫరా చేయడానికి విదేశీ సెమీకండక్టర్ తయారీదారులు అగ్రరాజ్యం నుంచి లైసెన్సు పొందాల్సి ఉంటుంది. హువావేకు తైవాన్‌కు చెందిన సంస్థ టీఎస్ఎంసీ సెమీకండక్టర్ పరికరాలను సరఫరా చేస్తుంది.
2019లో విధించిన ఆంక్షలు..
గతేడాది హువావే సాంకేతికతను అమెరికా సంస్థలు వినియోగించటాన్ని ట్రంప్ ప్రభుత్వం నిషేధించింది. అంతేకాకుండా అమెరికా సాంకేతికతను హువావేకు ప్రభుత్వ అనుమతి లేకుండా విక్రయించటంపై ఆంక్షలు విధించింది. జాతీయ భద్రతకు ప్రమాదం ఉందన్న కారణంతో ఈ నిర్ణయాలు తీసుకుంది.
అయితే ఇందులో కొన్ని మినహాయింపులు ఇచ్చింది. అమెరికా వైర్లెస్ ఉత్పత్తుల్లో వాడే హువావే పరికరాలకు స్వల్పంగా సడలింపు ఇచ్చింది. ఈ సంస్థలపై ప్రభావం పడకుండా పరిమిత సంఖ్యలో ఉపయోగించుకునేందుకు అనుమతి ఇచ్చింది.
లొసుగులను పూడ్చేందుకు..
అమెరికా ఆవల తయారైన చిప్‌లు హువావేకు సరఫరా అవుతున్న నేపథ్యంలో తాజా ఆంక్షల్లో వీటికి చోటు కల్పించలేదు. విదేశాల్లోని సంస్థల ద్వారా అమెరికా సాంకేతికతతో తయారైన సెమీకండక్టర్లను పొందుతున్న హువావేకు అన్ని దారులు మూసుకుపోయేలా ఈ నిర్ణయం తీసుకుంది వాణిజ్య శాఖ.
చైనా ఆగ్రహం..
తాజా ఆంక్షలపై హువావే సంస్థ ఇప్పటివరకు స్పందించలేదు. కానీ, చైనా ఆగ్రహం వ్యక్తం చేసింది. అమెరికా కంపెనీలపై ప్రతీకారం తీర్చుకుంటామని హెచ్చరించింది. క్వాల్కామ్, సిస్కో, యాపిల్ వంటి సంస్థలపై ఆంక్షలు విధిస్తామని ప్రకటించింది. బోయింగ్ విమానాల కొనుగోళ్లను నిలిపేస్తామని స్పష్టం చేసింది.
అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ మళ్లీ గెలిచే లక్ష్యంతోనే ఇటువంటి నిర్ణయాలు తీసుకుంటున్నారని చైనాకు చెందిన గ్లోబల్ టైమ్స్ పత్రిక పేర్కొంది. చైనా దిగ్గజ సంస్థల కృషిని చిన్నదిగా చేసేందుకు అమెరికా ప్రయత్నిస్తోందని ఆరోపించింది. చైనా అభివృద్ధికి అమెరికా అణచివేత ప్రధాన సవాలుగా మారిందని వ్యాఖ్యానించింది.