Union budget 2022: కొవిడ్ కల్లోలం నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న దేశ ఆర్థిక వ్యవస్థకు మరింత ఊతమిచ్చి, ప్రగతి రథాన్ని పరుగులు పెట్టించడమే లక్ష్యంగా రూ.39.45 లక్షల కోట్ల సార్వత్రిక బడ్జెట్ ప్రవేశపెట్టారు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్. వృద్ధికి ఊతమివ్వడం, ఉపాధి కల్పించడమే ప్రధానాంశాలుగా ఈ పద్దును తీసుకొచ్చినట్లు లోక్‌సభలో ఒక గంట 31 నిమిషాలపాటు సాగిన ప్రసంగం ద్వారా స్పష్టం చేశారామె.
మూలధన వ్యయాన్ని ఏకంగా 35శాతం వృద్ధితో రూ.7.5లక్షల కోట్లుగా అంచనా వేశారు నిర్మల. కస్టమ్స్ సుంకం విధానం హేతుబద్ధీకరణ, భారత్‌కు సొంత డిజిటల్ కరెన్సీ తీసుకురావడం, క్రిప్టో లావాదేవీల ద్వారా వచ్చే ఆదాయంపై పన్ను విధించడం వంటి నిర్ణయాలు తీసుకున్నట్లు వెల్లడించారు. రవాణా, బ్యాంకింగ్, ఫిన్‌టెక్, వ్యవసాయం, ఎలక్ట్రానిక్ వాహనాలు వంటి వేర్వేరు రంగాల బలోపేతానికి అమలుచేయనున్న ప్రణాళికలను బడ్జెట్ ద్వారా ఆవిష్కరించారు.
ఏడు ఇంజిన్లు..
రోడ్లు, రైల్వే, విమానాశ్రయాలు, నౌకాశ్రయాలు, ప్రజా రవాణా, జలమార్గాలు, లాజిస్టిక్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనే 'ఏడు ఇంజిన్ల' సాయంతో ప్రగతి రథాన్ని పరుగులు పెట్టించేలా ఈ బడ్జెట్‌ను రూపొందించినట్లు తెలిపారు నిర్మల. అందుకు తగినట్టే మౌలిక వసతుల రంగానికి భారీ స్థాయిలో కేటాయింపులు పెంచారు. 5జీ స్పెక్ట్రమ్ వేలం, 25వేల కిలోమీటర్ల మేర జాతీయ రహదారుల విస్తరణ, నదుల అనుసంధానం, 400 అధునాతన వందే భారత్ రైళ్ల తయారీ వంటివాటిపై ప్రత్యేక దృష్టిసారించనున్నట్లు వివరించారు. కరోనా సంక్షోభం తర్వాత వేగంగా కోలుకున్న భారత ఆర్థిక వ్యవస్థకు ఈ బడ్జెట్ మరింత ఊతమిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు నిర్మల.
Union budget tax slabs
ఐటీ స్లాబులు యథాతథం.. కానీ...
ఆదాయ పన్ను విషయంలో మాత్రం సగటు వేతన జీవులకు తీవ్ర నిరాశ మిగిల్చారు. పన్ను స్లాబుల్లో మార్పులపై కేంద్ర బడ్జెట్ ప్రసంగంలో ఎలాంటి ప్రకనటనా చేయలేదు స్టాండర్డ్ డిడక్షన్ విషయంలోనూ అంతే. అయితే.. కేంద్రప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా రాష్ట్రప్రభుత్వ ఉద్యోగులకు కూడా ఎన్పీఎస్(జాతీయ పెన్షన్ పథకం) డిడక్షన్ ఉంటుందని నిర్మల వెల్లడించారు. రాష్ట్రప్రభుత్వ ఉద్యోగులకూ ఎన్పీఎస్ మినహాయింపు 14శాతం వరకు పెంచుకునే అవకాశం కల్పిస్తున్నట్లు తెలిపారు.
క్రిప్టో కరెన్సీ లావాదేవీల ద్వారా వచ్చే ఆదాయంపై 30శాతం పన్ను విధించనున్నట్లు చెప్పారు. ఐటీ రిటర్ను దాఖలులో మరో వెసులుబాటు కల్పిస్తున్నట్లు నిర్మల తెలిపారు. ఐటీ రిటర్నులు సమర్పించిన తర్వాత రెండేళ్లలో సవరణలు చేసుకోవచ్చన్నారు.
కో-ఆపరేటివ్ సర్‌ఛార్జ్ 12శాతం నుంచి 7 శాతానికి తగ్గిస్తున్నట్లు తెలిపారు. కార్పొరేట్‌తో సమానంగా సహకార సంఘాలకు కనీస ప్రత్యామ్నాయ పన్నును 15 శాతానికి తగ్గించాలని పతిపాదిస్తున్నట్లు పేర్కొన్నారు.
ఇదీ చూడండి: వేతన జీవులకు మళ్లీ నిరాశ- ఐటీ స్లాబులు యథాతథం!
Union budget total
అంకెల్లో బడ్జెట్
- మొత్తం బడ్జెట్ రూ.39.45లక్షల కోట్లు.
- 2022-23 మూలధన వ్యయం అంచనా రూ.10.68 లక్షల కోట్లు. ఇది జీడీపీలో 4.1 శాతం.
- మొత్తం ఆదాయం(రుణాలు మినహాయించి) అంచనా రూ.22.84లక్షల కోట్లు.
- 2022-23 బడ్జెట్‌లో ద్రవ్య లోటు అంచనా 6.4 శాతం; 2021-22 ద్రవ్యలోటు 6.9.
- భారత దేశ వృద్ధిరేటు 9.2శాతం ఉంటుందని అంచనా. పెద్ద ఆర్థిక వ్యవస్థలు కలిగిన దేశాల్లో అదే అత్యధికం.
- 14 రంగాల్లో ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహక పథకం అమలు ద్వారా 60లక్షల కొత్త ఉద్యోగాలు సృష్టి!
రూపాయి రాక, పోక ఇలా..
రూ.39 లక్షల 44వేల 909 కోట్ల బడ్జెట్‌లో రాబడి పరంగా.. ప్రతి రూపాయికి 35 పైసలు రుణాలు, ఇతర మార్గాల్లో వస్తాయన్నారు నిర్మల. జీఎస్టీ కింద 16 పైసలు, కార్పొరేట్ పన్నుల కింద 15, ఆదాయపు పన్ను కింద మరో 15 పైసలు, కేంద్ర ఎక్సైజ్ సుంకాల కింద 7, కస్టమ్స్ సుంకాల కింద ఐదు పైసలు చొప్పున వస్తాయని వివరించారు. పన్నేతర రెవెన్యూ కింద 5 పైసలు, రుణేతర ములధన రాబడుల కింద రెండు పైసలు వస్తాయని చెప్పారు. వ్యయానికి సంబంధించి, ప్రతి రూపాయికి 20 పైసలు వడ్డీల చెల్లింపులకే వెళుతున్నట్లు తెలిపారు. 17 పైసలు పన్నుల్లో రాష్ట్రాల వాటా కింద చెల్లించనున్నట్లు తెలిపారు. 15పైసలు కేంద్ర ప్రాయోజిత పథకాలకు, 9 పైసలు కేంద్ర పథకాలకు ఖర్చుచేయనున్నట్లు మంత్రి వివరించారు. 10 పైసలు ఆర్థిక సంఘం నిధులు, ఇతర బదిలీలకు వాడనున్నట్లు పేర్కొన్నారు. రాయితీల కింద 8 పైసలు, రక్షణ రంగానికి మరో 8 వైసలు, పెన్షన్లకు 4 పైసలు, ఇతర వ్యయాలకు 9 పైసలు కేటాయించారు.
union budget allocations
బడ్జెట్‌లో రంగాలవారీగా కేటాయింపులు
- పెన్షన్స్ - రూ. 2,07,132 కోట్లు
- రక్షణ శాఖ - రూ. 3,85,370 కోట్లు
- సబ్సిడీ- ఎరువులు - రూ. 1,05,222 కోట్లు, ఆహారం - రూ. 2,06,831 కోట్లు, పెట్రోలియం - రూ. 5,813 కోట్లు
- వ్యవసాయ శాఖ - రూ. 1,51,521 కోట్లు
- వాణిజ్య, పరిశ్రమల శాఖ - రూ. 53,116 కోట్లు
- ఈశాన్య రాష్ట్రాల అభివృద్ది - రూ. 2,800 కోట్లు
- విద్యా శాఖ - రూ. 1,04,278 కోట్లు
- విద్యుత్తు శాఖ - రూ. 49,220 కోట్లు
- విదేశాంగ శాఖ - రూ. 17,250 కోట్లు
- ఫైనాన్స్ - రూ. 21,354 కోట్లు
- ఆరోగ్య శాఖ - రూ. 86,606 కోట్లు
- హోంశాఖ - రూ. 1,27,020 కోట్లు
- వడ్డీలకు - రూ. 9,40,651 కోట్లు
- ఐటీ, టెలికం శాఖ - రూ. 79,887
- ఇతరములు - 1,13,301
- ప్లానింగ్, స్టాటిస్టిక్స్ - రూ. 5,720
- గ్రామీణాభివృద్ధి - రూ. 2,06,293 కోట్లు.
- శాస్త్ర సాంకేతిక విభాగాలకు - రూ. 30,571 కోట్లు
- సామాజిక న్యాయ శాఖ - రూ. 51,780 కోట్లు.
- టాక్స్ అడ్మినిస్ట్రేషన్ - రూ. 1,71,677 కోట్లు
- జీఎస్టీ పరిహారం నిధి - రూ. 1,20,000 కోట్లు
- కేంద్ర పన్నుల్లో రాష్ట్రాల వాటా - రూ. 3,34,339 కోట్లు
- రవాణా శాఖ - రూ. 3,51,851 కోట్లు.
- కేంద్ర పాలిత ప్రాంతాలకు - రూ. 58,757 కోట్లు
- పట్టణాభివృద్ధి శాఖ - రూ. 76,549 కోట్లు
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోనిలో రిజిస్ట్రేషన్ ఉచితం!
ఇవీ చదవండి: జువెలరీ రంగానికి బూస్ట్.. దిగుమతి సుంకం తగ్గింపు