వ్యవసాయంలో యువత, మహిళలను పెద్ద ఎత్తున భాగస్వామ్యం చేయడానికి సంకల్పించినట్లు ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. సంప్రదాయ, ఆర్గానిక్ ఫర్టిలైజర్ల సమతౌల్య ఉపయోగానికి ప్రభుత్వం చర్యలు చేపడుతోందని చెప్పారు. రసాయన ఫర్టిలైజర్ల అధిక ఉపయోగానికి ఇచ్చే రాయితీలను తగ్గించేందుకు అవసరమైన చర్యలు చేపడుతున్నట్లు స్పష్టం చేశారు.
ధాన్యలక్ష్మీ
మహిళల స్వయం సహాయక సంఘాల ద్వారా 'ధాన్యలక్ష్మీ పథకం' అమలు చేయనున్నట్లు తెలిపారు. వ్యవసాయ కోల్డ్ స్టోరేజీల నిర్మాణానికి ప్రణాళికలు రచిస్తున్నట్లు స్పష్టం చేశారు. రాష్ట్రాల సాయంతో తాలూకాల స్థాయిల్లో ఈ స్టోరేజీ కేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు.
బ్లూ ఎకానమీ..
తీర ప్రాంతాల్లోని గ్రామీణ యువతను చేపల పెంపకంలో ప్రోత్సహించనున్నట్లు తెలిపారు.
"రైతులు తమ పంట ఉత్పత్తులు నిల్వ చేసుకొని, వ్యయాలను తగ్గించుకునేందుకు... గ్రామ స్టోరేజ్ స్కీమ్‌ను ప్రవేశపెట్టనున్నాం. ముద్ర, నాబార్డ్ రుణాల ద్వారా గ్రామ స్థాయిలో మహిళా స్వయం సహాయక సంఘాలు వీటిని నిర్వహించవచ్చు. తద్వారా మహిళలు తమ ధాన్యలక్ష్మీ హోదాను నిలబెట్టుకుంటారు. సముద్ర వేట అభివృద్ధి, నిర్వహణకు ప్రభుత్వం కార్యచరణ సిద్ధం చేసింది. తీర ప్రాంతాల్లోని యువకులు దీని ద్వారా లబ్ది పొందనున్నారు. 2022-23 నాటికి 200 లక్షల టన్నుల చేపల ఉత్పత్తిని లక్ష్యంగా పెట్టుకున్నాం. 3,477 సాగర్‌మిత్ర, 500 చేపల ఉత్పత్తి వ్యవసాయదారుల ఆర్గనైజేషన్ల ఏర్పాటు ద్వారా చేపల ఉత్పత్తిలో యువకులను భాగస్వామ్యం చేయనున్నాం. తీర ప్రాంతాల్లోని యువకులు సాగర్ మిత్ర ఆధ్వర్యంలో పనిచేస్తారు."-నిర్మలా సీతారామన్, కేంద్ర ఆర్థిక మంత్రి