కారు ప్రయాణాలను మరింత సురక్షితంగా మార్చేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకొనే అవకాశం ఉంది. గతేడాది జులైలో డ్రైవర్‌కు ఎయిర్‌బ్యాగ్‌ను తప్పనిసరి చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. తాజాగా డ్రైవర్ పక్కసీటులో ఉండే ప్రయాణికుడి వైపు కూడా ఎయిర్‌బ్యాగ్‌ను తప్పనిసరి చేస్తూ ఆదేశాలు జారీ చేసే అవకాశం ఉంది. ఈ మేరకు ఆంగ్ల వార్తా పత్రిక టైమ్స్ ఆఫ్ ఇండియా కథనం ప్రచురించింది.
ఇప్పటికే రోడ్ ట్రాన్స్‌పోర్టు, హైవే శాఖ ఆటోమొబైల్ సంస్థలకు డ్రాఫ్ట్ నోటిఫికేషన్ జారీ చేసింది. దీనిలో ఆటోమోటీవ్ ఇండస్ట్రీ ప్రమాణాల్లో సవరణలకు అవసరమైన ప్రతిపాదనలు ఉన్నాయి. ఈ ప్రతిపాదనలకు అత్యుత్తమ సాంకేతిక కమిటీ ఆమోద ముద్ర వేసినట్లు సమాచారం. ప్రపంచ వ్యాప్తంగా మోటార్ వాహనాల్లో ప్రయాణించే వారిని ప్రమాద సమయాల్లో ఎలా కాపాడాలనే దానిపై తీవ్ర ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో భారత్ కూడా ప్రయాణికుల భద్రతా విషయాల్లో ఎట్టి పరిస్థితుల్లో రాజీ పడదని ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి.
ఈ నిబంధనలు అమల్లోకి వచ్చాక ఎంత గడువు ఇవ్వాలనే అంశంపై ప్రభుత్వం ఇప్పుడు చర్చలు జరుపుతున్నట్ల సమాచారం. నిబంధనలు అమలుకు ఏడాది గడువు సరిపోతుందని నిపుణులు చెబుతున్నారు. నాలుగు చక్రాల వాహనాలకు ప్రస్తుత నిబంధనల ప్రకారం డ్రైవర్ వైపు ఎయిర్‌బ్యాగ్ తప్పనిసరి. దీంతో ప్రమాద సమయంలో డ్రైవర్ తప్పించుకొన్నా.. సహ ప్రయాణికుడి ప్రాణాలు ప్రమాదంలో ఉంటాయి.
ఇదీ చదవండి : జనవరిలో హోండా కార్ల ధరలు పెంపు