అంతర్జాతీయంగా పలు దేశ ప్రభుత్వాలు భారత డిజిటల్ వసతులపై ఆసక్తి చూపుతున్నాయని ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు నందన్ నీలేకని పేర్కొన్నారు. మంగళవారమిక్కడ జరిగిన నాస్‌కామ్ తొలి క్లౌడ్ సదస్సులో ఆయన మాట్లాడుతూ 'కరోనా తర్వాత పలు దేశాలు తాము ఏం నేర్చుకోగలమనే ఆసక్తితో భారత్‌కు వస్తున్నాయి. మనం ఏం చేసినా, దేశ జనాభా అవసరాలను దృష్టిలో పెట్టుకుని సమర్థంగా, తక్కువ ధరతో, అధిక పరిమాణంతో చేయడమే ఇందుకు కారణమ'న్నారు.
రూ.52.5 లక్షల కోట్ల అవకాశాలు:
2030 కల్లా ఓపెన్ డిజిటల్ వ్యవస్థల కారణంగా 700 బిలియన్ డాలర్ల(దాదాపు రూ.52.5 లక్షల కోట్లు) విలువైన అవకాశాలు భారత్‌కు రావొచ్చని నాస్‌కామ్ విడుదల చేసిన 'డిజిటల్ ఇండియా: ద ప్లాట్‌ఫామైజేషన్ ప్లే' నివేదిక చెబుతోంది. ఆరోగ్యసంరక్షణ, నైపుణ్యం, వ్యవసాయం, సూక్ష్మ, చిన్న, మధ్య స్థాయి కంపెనీలు, విద్య, పట్టణ పాలన, రవాణా, ఇ-ల్యాండ్ రికార్డులు వంటి రంగాల్లో ఈ అవకాశాలుంటాయని తెలిపింది.
కొవిన్ కోసం 50 దేశాలు:
నేషనల్ హెల్త్ అథారిటీ సీఈఓ ఆర్.ఎస్ శర్మ మాట్లాడుతూ 'భారత్‌లో రూపొందిన ఆధార్, యూపీఐ, కొవిన్‌లు ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజా డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లుగా మారాయి. ఆధార్‌కు 130 కోట్ల రిజిస్ట్రేషన్లుండగా.. మైగవ్ కరోనా హెల్ప్‌డెస్క్‌కు 3 కోట్ల వినియోగదార్లున్నారు. కొవిన్ ద్వారా 58 కోట్లకు పైగా టీకా డోసులు ఇచ్చాం. భీమ్ యూపీఐ ద్వారా జులై 2021లో 320 కోట్ల లావాదేవీలు జరిగాయి. దాదాపు 50 దేశాలు కొవిన్‌పై ఆసక్తిని ప్రదర్శించాయ'ని అన్నారు.
మొబైల్ ఫోన్ల ఎగుమతులు మూడింతలు
మన దేశం నుంచి జూన్ త్రైమాసికంలో రూ.4,300 కోట్ల విలువైన సెల్‌ఫోన్లు ఎగుమతి అయ్యాయని ఇండియా సెల్యులార్ అండ్ ఎలక్ట్రానిక్స్ అసోసియేషన్ (ఐసీఈఏ) తెలిపింది. ఏడాదిక్రితం ఇదే సమయంలో ఎగుమతుల విలువ రూ.1,300 కోట్లతో పోలిస్తే, ఈసారి మూడు రెట్ల కంటే అధికంగా జరిగాయి. జూన్ త్రైమాసికంలో ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల ఎగుమతులు ఏడాది క్రితంతో పోలిస్తే 100 శాతం మేర పెరిగి రూ.20,000 కోట్ల మైలురాయిని చేరాయి.
ఇదే కాలంలో మొబైల్ ఫోన్ల దిగుమతులు రూ.3,100 కోట్ల నుంచి గణనీయంగా తగ్గి రూ.600 కోట్లకు పరిమితమయ్యాయి. అయితే ల్యాప్‌టాప్‌లు, ట్యాబ్లెట్ల దిగుమతులు రూ.6,000 కోట్ల నుంచి 50 శాతం పెరిగి రూ.10,000 కోట్లకు చేరాయని వెల్లడించారు.
- ఐఫోన్ల కాంట్రాక్టు తయారీ సంస్థ విస్ట్రాన్‌తో వ్యూహాత్మక భాగస్వామ్యం కుదుర్చుకున్నట్లు ఎలక్ట్రానిక్స్ తయారీ సేవల కంపెనీ ఆప్టిమస్ ఎలక్ట్రానిక్స్ ప్రకటించింది. వచ్చే 3-5 ఏళ్లలో రూ.1350 కోట్ల పెట్టుబడులు పెట్టనున్నట్లు ఆప్టిమస్ ఎలక్ట్రానిక్స్ ఎండీ గురురాజ్ తెలిపారు.
ఇదీ చదవండి: చదువు అంతంతే.. సంపద మాత్రం రూ.లక్షల కోట్లు!