Train Hostess In Indian Railways: రైలు ప్రయాణికులకు మెరుగైన సేవలు అందించే దిశగా భారతీయ రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది. విమానాల్లో ప్యాసెంజర్లకు సేవలందించేందుకు ఉండే ఎయిర్‌హోస్టెస్ తరహాలోనే.. ప్రీమియం రైళ్లలో ట్రైన్ హోస్టెస్‌ను ప్రవేశపెట్టనుంది. వందే భారత్, గతిమాన్, తేజస్ ఎక్స్‌ప్రెస్ లాంటి రైళ్లలో ముందుగా వీరి సేవలను వినియోగించుకోనున్నట్లు రైల్వేశాఖ ప్రకటించింది. ఇదిలా ఉంటే సుదూర గమ్యాలకు ప్రయాణం చేసే ట్రైన్స్ అయిన రాజధాని ఎక్స్‌ప్రెస్, డొరెంటోఎక్స్‌ప్రెస్ వంటి వాటిలో ట్రైన్ హోస్టెస్‌ను ప్రవేశపెట్టే విషయంపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని అధికారులు స్పష్టం చేశారు.
అయితే ఈ ట్రైన్ హోస్టెస్లుగా మహిళలను మాత్రమే కాకుండా పురుషులను కూడా తీసుకుంటున్నట్లు అధికారులు తెలిపారు. ప్రయాణికుల అవసరాలను తీర్చే ప్రీమియం రైళ్లలో కొంతమంది పురుష అటెండర్లను కూడా ఈ బృందంలో చేర్చుకోనున్నట్లు పేర్కొన్నారు.
ట్రైన్ హోస్టెస్‌లు.. ప్రయాణికులు రైళ్లు ఎక్కేటప్పుడు వారిని పలకరించడం, ఆహారం అందించడం, ఫిర్యాదులు ఏమైనా ఉంటే నమోదు చేయడం లాంటివి చేయనున్నట్లు అధికారులు తెలిపారు. వీరి సేవలు కేవలం పగటి పూట మాత్రమే అందుబాటులో ఉంటాయని స్పష్టం చేశారు. రాత్రి పూట కూడా వారి సేవలను ఉపయోగించుకోవడంపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని చెప్పారు. ఇందుకు తగినట్లుగానే ఛార్జీలు ఉంటాయన్నారు.
రైల్వే అటెండర్ల డ్రస్ కోడ్‌లో ఎలాంటి మార్పు లేదని రైల్వేశాఖ తెలిపింది. అయితే మహిళలను మాత్రం ఆతిథ్యరంగంలో శిక్షణ పొందిన వారినే ఎంపిక చేయనున్నట్లు పేర్కొంది.
భారతీయ రైల్వే సుమారు 25కు పైగా ప్రీమియం రైళ్లను దేశ వ్యాప్తంగా నడుపుతుంది. వాటిలో 12 శతాబ్ది, ఒకటి గతిమాన్, రెండు వందే భారత్, ఒక తేజస్ ఎక్స్‌ప్రెస్ ఉన్నాయి.
ఇదీ చూడండి: Health insurance policy: మన ఆరోగ్యమే మనకు రాయితీగా