Tomato Price: అకాల వరదలు, ఎడతెరిపిలేని వానల ఫలితంగా దేశవ్యాప్తంగా కూరగాయల ధరలు భగ్గుమంటున్నాయి. ఈ క్రమంలోనే టమాటా ధరలు అంతకంతకూ పెరిగిపోతున్నాయి. ఈ ధరల పెంపు మరో రెండు నెలల పాటు కొనసాగుతుందని రేటింగ్ ఏజెన్సీ క్రిసిల్ శుక్రవారం విడుదల చేసిన తన నివేదిక (crisil research report) పేర్కొంది.
ఈ పంటను ఎక్కువగా పండించే రాష్ట్రమైన కర్ణాటకలో పరిస్థితులు మరింత అధ్వానంగా తయారైన నేపథ్యంలో మహారాష్ట్రలోని నాసిక్ నుంచి ఇతర ప్రాంతాలు దిగుమతి చేసుకుంటున్నట్లు పేర్కొంది.
టమాటా ధర పెరగడానికి ప్రధాన కారణం... అక్టోబరు-డిసెంబర్ మధ్యకాలంలో కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్రల నుంచి రావాల్సిన పంట అధిక వర్షాల కారణంగా నిలిచిపోవడం అని క్రిసిల్ రీసెర్చ్ (crisil research report on tomatoes) తెలిపింది. ఈ నేపథ్యంలో టమాటా ధర నవంబర్ 25 నాటికి 142 శాతం పెరిగినట్లు పేర్కొంది. మధ్యప్రదేశ్, రాజస్థాన్ల నుంచి పంట జనవరి నాటికి మార్కెట్‌కు చేరే అవకాశం ఉన్నందున మరో రెండు నెలల పాటు ధరల పెరుగుదల తప్పదని స్పష్టం చేసింది.
ఇదిలా ఉంటే దేశ రాజధాని దిల్లీలో కిలో టమాటా ధర రూ.75కు (tomato price today) చేరుకుంది. మార్కెట్లోకి కొత్త సరకు రాగానే ఇప్పుడు ఉన్న ధరలు సుమారు 30 శాతం మేర తగ్గే అవకాశం ఉందని క్రిసెల్ పేర్కొంది.
ఉల్లిపాయలు కూడా...
Onion Price: దేశంలో ఉల్లికి ప్రధాన సరఫరాదారుగా ఉన్న మహారాష్ట్రలో తగినంత వర్షాపాతం లేక నాట్లు వేయడం ఆలస్యమైంది. దీంతో అక్టోబర్‌లో మార్కెట్‌కు రావాల్సిన ఉల్లిపాయల సరఫరా నెమ్మదించింది. ఫలితంగా ఉల్లి ధర సెప్టెంబర్‌తో పోలిస్తే 65శాతం పెరిగాయని క్రిసిల్ నివేదిక పేర్కొంది. మరో రెండు వారాల్లో హరియాణా నుంచి ఉల్లి మార్కెట్‌కు చేరుకుంటుందని తెలిపిన రేటింగ్ సంస్థ.. ఆ సమయంలో ధరలు మరింత తగ్గే అవకాశం ఉందని అంచనా వేసింది.
రాష్ట్రాల్లో ఇలా..
నగరం | టమాట ధర |
దిల్లీ | రూ. 75 |
చెన్నై | రూ. 63 |
తిరువనంతపురం | రూ. 80 |
పుదుచ్చేరి | రూ. 45 |
బెంగళూరు | రూ. 88 |
పోర్టు బ్లెయిర్ | రూ. 143 |
ఇదీ చూడండి: ఆన్లైన్లో ఆటో బుకింగ్ ఇక భారం- జీఎస్టీనే కారణం