జాతీయ భద్రతా చట్టం అమల్లోకి వచ్చిన కొన్ని రోజుల్లోనే హాంకాంగ్ మార్కెట్‌ను వీడి బయటకు పోవాలని ప్రముఖ సోషల్ మీడియా యాప్ టిక్‌టాక్ నిర్ణయించింది. ఈ విషయాన్ని సంస్థ ప్రతినిధి వెల్లడించారు. చాలా టెక్నాలజీ కంపెనీలు ఇప్పటికే హాంకాంగ్‌ను వీడి బయటకు వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నాయి. వీటిల్లో ఫేస్‌బుక్ కూడా ఉంది. ఆ ప్రాంతంలో ఫేస్‌బుక్ వినియోగదారుల డేటాను ప్రభుత్వానికి ఇచ్చే అంశాన్ని ఫేస్‌బుక్ పక్కనబెట్టింది.
"ఇటీవల చోటు చేసుకొన్న పరిణామాలతో మేము హాంకాంగ్‌లో మా యాప్ కార్యకలాపాలు నిలిపివేయాలని నిర్ణయించాము" అని బైట్‌డ్యాన్స్ ప్రతినిధి ఓ ఆంగ్ల వార్తా సంస్థకు వెల్లడించారు. కంపెనీ ప్రతినిధి కెవిన్ మేయర్ మాట్లాడుతూ వినియోగదారుల డేటాను గతంలో కూడా చైనాలో నిల్వ చేయలేదని పేర్కొన్నారు.
హాంకాంగ్ నుంచి టిక్‌టాక్ వైదొలగడం వల్ల కంపెనీకి పెద్దనష్టం ఉండదు. అక్కడ 1,50,000 వినియోగదారులు మాత్రమే ఉన్నారు. ఈ ఏడాది మొదటి వరకు టిక్‌టాక్‌కు ప్రపంచవ్యాప్తంగా 200 కోట్ల మంది వినియోగదారులు ఉన్నారు. చైనాలో బైట్‌డ్యాన్స్‌కు డోయిన్ అనే యాప్ ఉంది. ఇది కూడా టిక్‌టాక్ వలే పనిచేస్తుంది. ప్రపంచవ్యాప్తంగా వినియోగించేందుకు టిక్‌టాక్‌ను తయారు చేసింది. కానీ, దీనిలో డేటా చైనాకు వెళుతోందనే ఆరోపణలు రావడం వల్ల భారత్ బ్యాన్ చేసిన విషయం తెలిసిందే.
ఇదీ చూడండి:'మాకు హడావుడి లేదు.. ఏడాది చివరి నాటికే వ్యాక్సిన్'