ఒకప్పుడు బైక్ అంటే కేవలం పెట్రోల్‌తో నడిచేది మాత్రమే. కానీ ఇప్పుడు ఈ-బైక్‌లను కూడా చాలా మంది పరిగణనలోకి తీసుకుంటున్నారు. ఈ బైక్‌లకు క్రమంగా డిమాండ్ పెరుగుతోంది. పర్యావరణంపై పెరిగిన స్రృహ కూడా ఈ-బైక్ విక్రయాలు ఊపందుకోవడానికి ఒక కారణమైతే.. ఈ మధ్యకాలంలో రోడ్లపై ఎలక్ట్రిక్ బైక్‌ల దర్శనంతో ట్రెండ్ మరింత పెరుగుతోంది.
దేశంలో అంతకంతకూ పెరుగుతోన్న ఇంధన ధరల వల్ల రోజువారీ ఖర్చు పెట్రోల్ బైక్‌ల విషయంలో ఎక్కువగానే ఉంటుంది. కానీ ఈ-బైక్‌ల విషయంలో మాత్రం రోజువారీ ఇంధనం అవసరం ఉండదు. కేవలం ఛార్జింగ్ పెట్టుకుంటే సరిపోతుంది. పెట్రోల్‌పై అయ్యే ఖర్చుతో పోల్చితే విద్యుత్ బిల్లు తక్కువగానే ఉంటుంది. దీని వల్ల ఖర్చూ తగ్గుతుంది. గత కొన్ని సంవత్సరాలుగా ఈ-బైక్‌లపై పెరిగిన పరిశోధనలతో.. వీటి నాణ్యతా క్రమంగా పెరుగుతోంది.
ఖర్చు సగానికి..
పెట్రోల్ వాహనాల్లో కార్బోరేటర్, గేర్, క్లచ్, ఇంజిన్, ఇంధన ట్యాంక్ అంటూ విడిభాగాలు ఎక్కువగా ఉంటాయి. వీటితో పోల్చితే ఈ-బైక్ లో విడిభాగాలు తక్కువ.. కాబట్టి నిర్వహణ ఖర్చూ తక్కువే. అంతేకాకుండా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎలక్ట్రిక్ బైక్‌ల విషయంలో సబ్సిడీలు, రాయితీలను ఇస్తున్నాయి.
వేటిని పరిగణనలోకి తీసుకోవాలో చూద్దాం..
- వేగం
ఎలక్ట్రిక్ బైక్‌లో వేగం అనేది చాలా ముఖ్యం. తక్కువ వేగం ఉండే బైక్ తీసుకున్నట్లయితే.. దూర ప్రయాణాలకు ఇబ్బందిగా ఉండే అవకాశం ఉంది. కాబట్టి గరిష్ఠ వేగం, పిక్ అప్ లాంటివి ముందే తెలుసుకోవాలి. సాధారణంగా తక్కువ వేగం ఉండే బైక్‌లు గరిష్ఠంగా 50-60 కిలోమీటర్ల వేగంతో నడిస్తే.. ఎక్కువ వేగం ఉండేవి 100 కంటే ఎక్కువ వేగంతో(గరిష్ఠంగా) నడుస్తాయి.
- రైడింగ్ పరిధి
ఒక్కసారి ఛార్జ్ చేస్తే ఎంత దూరం ప్రయాణిస్తాం అనే విషయం రైడింగ్ రేంజ్ ద్వారా తెలుస్తుంది. ప్రస్తుతం అందుబాటులో ఉన్న ఎలక్ట్రిక్ బైక్‌లపై కొంత సమాచారం తెలుసుకోవటం ద్వారా మంచి రైడింగ్ రేంజ్ ఉన్న బైక్‌ను ఎంచుకోవచ్చు. తక్కువ స్పీడ్ ఉన్న ఎలక్ట్రిక్ స్కూటర్లు.. ఒక్క ఛార్జ్‌తో తక్కువ దూరం ప్రయాణిస్తాయి. ఎక్కువ స్పీడ్, సామర్థ్యం ఉన్న బైక్‌లు ఎక్కువ దూరం ప్రయాణిస్తాయి. అత్యాధునిక బ్యాటరీలతో వస్తున్న బైక్‌లు ఇంకా ఎక్కువ దూరం వెళ్లే వీలుంది.
ఇదీ చదవండి: భారత రోడ్లపై త్వరలోనే విద్యుత్ కార్ల జోరు!
- బ్యాటరీ జీవితకాలం
ఎలక్ట్రిక్ బైక్‌లలో అత్యంత ఖర్చుతో కూడుకున్న భాగం బ్యాటరీ. బైక్ విలువ దీనిపైనే ఎక్కువగా ఆధారపడి ఉంటుంది. ఇక కొత్త బ్యాటరీ మార్చుకోవడమూ చాలా ఖర్చుతో కూడుకున్న పనే. కాబట్టి వాహనం కొనుగోలు చేసే ముందు బ్యాటరీ సామర్థ్యం, జీవిత కాలం తప్పకుండా తెలుసుకోవాలి. లెడ్, నికెల్ బ్యాటరీలతో పోల్చితే లిథియం-అయాన్ బ్యాటరీల జీవనకాలం ఎక్కువగా ఉంటున్నట్లు నిపుణులు తెలుపుతున్నారు. ఇక ఒక్క పూర్తి ఛార్జ్ చేయటానికి ఎంత సమయం పడుతుందన్న అంశం చాలా ముఖ్యమైనదే. ఫాస్ట్ ఛార్జింగ్ సదుపాయం ఉందా లేదా అన్నది చెక్ చేసుకోవాలి.
ఇదీ చదవండి: 2030 నాటికి ఈవీల అమ్మకాలు గణనీయం..!
- మోటార్ పవర్
వాహనం వేగానికి మోటార్ సామర్థ్యం కీలకం. మార్కెట్లో చాలా రకాల ఎలక్ట్రిక్ మోటార్లు అందుబాటులో ఉన్నాయి. అవసరాలకు సరిపడే అవుట్ పుట్ గల మోటార్ వాహనాన్ని ఎంచుకోవటం ఉత్తమం. తక్కువ సామర్థ్యం ఉన్న వాహనం తీసుకోవటం వల్ల రైడింగ్ అనుభూతి చెడిపోతుంది.
- ఛార్జింగ్ సంబంధింత అంశాలు.
ఎలక్ట్రిక్ బైక్ తీసుకున్నప్పుడు ఇంట్లో ఛార్జింగ్ పెట్టుకునేందుకు వ్యవస్థను కంపెనీలు అందిస్తాయి. అయితే ఇంటి వద్ద ఛార్జింగ్ సదుపాయం మాత్రమే సరిపోదు. బైక్‌తో బయట తిరుగుతుంటాం కాబట్టి పబ్లిక్ ఛార్జింగ్ సదుపాయాలు చాలా ముఖ్యం. ఎలక్ట్రిక్ బైక్ కంపెనీకి సరిపడా పబ్లిక్ ఛార్జింగ్ స్టేషన్లు ఉన్నాయా? లేవా? తెలుసుకోవాలి. ఆఫీసు, ఇతర పని ప్రదేశాల్లో ఛార్జింగ్ సదుపాయాలనూ పరిగణనలోకి తీసుకోవచ్చు.
ఇదీ చదవండి: 2636 ఛార్జింగ్ కేంద్రాల ఏర్పాటుకు కేంద్రం గ్రీన్‌సిగ్నల్
- వారంటీ
ఏ వస్తువైనా కొనే ముందు వారంటీ అనేది కీలకమైన అంశం. బైక్ మొత్తం విలువలో బ్యాటరీ విలువ దాదాపు 3/4 వంతు ఉంటుంది. బ్యాటరీపై 2 నుంచి 3 సంవత్సరాల వారంటీని సాధారణంగా కంపెనీలు అందిస్తుంటాయి. ఏఏ సందర్భాల్లో వారంటీ వర్తించదు? షరతుల కోసం వారంటీ నిబంధనలను క్షుణ్నంగా తెలుసుకోవాలి.
- గరిష్ఠ లోడ్
సంప్రదాయ బైక్‌లలో మాదిరిగా ఎక్కువ భాగాలు ఈ-బైక్‌లలో ఉండవు. కాబట్టి ఇవి ఎక్కువ బరువు ఉండవు. దీనితో ఇవి తీసుకెళ్లే లోడ్ పై ప్రభావం పడుతుంది. మీ అవసరానికి సరిపోతుందా? లేదా? తెలుసుకునేందుకు గరిష్ఠ లోడ్ కెపాసిటీని తెలుసుకోవాలి.
- కొనుగోలు అనంతర సపోర్టు(ఆఫ్టర్ సేల్స్ సపోర్టు)
కొనుగోలు చేసిన అనంతరం కంపెనీ నుంచి సపోర్టు ఏ విధంగా ఉంటుందనేది చాలా ముఖ్యం. సర్వీస్ సెంటర్లు ఎన్ని ఉన్నాయి? అందుబాటులో ఉన్నాయా? అనే విషయాలను చూసుకోవాలి. ఎలక్ట్రిక్ వాహనాలను సాధారణంగా అందరు మెకానిక్‌లు రిపేరు చేయలేరు. ఒక వేళ చేసినా ఏదైనా తప్పు జరిగితే ఎక్కువ మొత్తంలో ఖర్చు అవుతుందన్న విషయాన్ని దృష్టిలో ఉంచుకోవాలి.
ఇదీ చదవండి: 2021లో హవా అంతా ఎలక్ట్రిక్ కార్లదే!
నిర్వహణ ఖర్చు, రోజువారీ ఖర్చు
సంప్రదాయ బైక్‌లతో పోల్చితే వీటిలో నిర్వహణ ఖర్చు చాలా తక్కువగా ఉంటుంది. సర్వీసింగ్ ఖర్చు కూడా చాలా తక్కువగా ఉంది. ఇంజిన్ లేకపోవటం వల్ల నిర్వహణ ఖర్చు చాలా వరకు తగ్గిపోతుంది. కాబట్టి ఈ విషయాన్ని ఎక్కువగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. రన్నింగ్ ఛార్జీలూ వీటిలో తక్కువగానే ఉంటాయి.
- ఇతర అంశాలు..
ఎలక్ట్రిక్ బైక్ ధర ఎక్కువ కాబట్టి బీమా ప్రీమియం కూడా ఎక్కువగా ఉంటుందని అనుకుంటారు. కానీ ప్రీమియం సంప్రదాయ వాహనాలతో పోల్చితే తక్కువగా ఉంటుంది. ఎలక్ట్రిక్ బైక్‌లు తక్కువ దూరం ప్రయాణిస్తాయి అందుకే రిస్కు కూడా తక్కువగా ఉంటుంది.
ఇదీ చదవండి: ఎలక్ట్రిక్ కార్ల తయారీలోకి షియోమి!