పెద్దలకు సౌకర్యంగా...
వయోవృద్ధుల జీవితాలను మెరుగుపరచడం కోసమే ప్రత్యేకంగా నివాస గృహాలను దేశంలోనే తొలిసారిగా నిర్మిస్తున్నందుకుగానూ తారా సింగ్ వచానీ ఈ జాబితాలో చోటు దక్కించుకుంది. ఆమె మ్యాక్స్ గ్రూపు ఛైర్మన్ అనల్జిత్ సింగ్ కుమార్తె. సింగపూర్‌లో చదువుకుని 2010లో భారత్‌కు వచ్చిన తార తండ్రి వ్యాపారాల జోలికి వెళ్లకుండా... తానే స్వయంగా కొత్త సంస్థను ఏర్పాటు చేయాలనుకుంది. అందులో భాగంగా పిల్లలు విదేశాలకు వెళ్లడం, వృత్తిరీత్యా ఇంటికి దూరంగా ఉండటంతో ఒంటరైన పెద్దవాళ్లకోసం ప్రత్యేకంగా ‘అంతర లివింగ్ స్పేస్ ప్రయివేట్ లిమిటెడ్’ పేరుతో ఓ కమ్యూనిటీని ఏర్పాటు చేసింది.
మొదట డెహ్రాడూన్‌లోని 15 ఎకరాల టౌన్‌షిప్పులో 200 విల్లాలతో ఓ ప్రాజెక్టును నిర్మించింది. ఈ విల్లాలు కేవలం 55 ఏళ్లు పైబడిన వారికే. వీల్‌ఛెయిర్ ఫ్రెండ్లీగా ఉండే ఆ విల్లాల్లో నివసించే వారికి భోజన, వైద్య సౌకర్యాలతోపాటు జిమ్, ఈత కొలను, గ్రంథాలయం, సినిమా థియేటర్, బ్యాడ్మింటన్ కోర్టు, స్పా, వెల్‌నెస్ సెంటర్, అత్యవసర సహాయక కేంద్రం, షాపింగ్ కాంప్లెక్స్, హోటళ్లు, ప్లే గ్రౌండ్ వంటివన్నీ ఉంటాయి.
24 గంటలూ సహాయకులు కూడా అందుబాటులో ఉంటారు. అందుకుగానూ నెలకోసారి మెయింటెనెన్స్ చెల్లిస్తే చాలు. ఈ విల్లాను కొనుక్కొని శాశ్వతంగా ఉండొచ్చు. కొన్నాళ్లపాటు అద్దెకి కూడా తీసుకోవచ్చు. దాంతో పెద్దవాళ్లంతా కలిసి ఒకే చోట జీవిస్తారు. పిల్లల తోడు లేకపోయినా అన్ని వసతులతో హాయిగానూ ఉంటారు. అలాంటి సౌకర్యమైన, విలాసవంతమైన విల్లాలను నిర్మిస్తోన్న తార ప్రస్తుతం డెహ్రడూన్‌తోపాటు దిల్లీలోనూ వీటిని అందుబాటులోకి తెచ్చింది.
ప్రపంచంలోనే అతి పెద్ద ప్లాంటు
పర్యావరణానికి హాని కలిగించని రసాయనాలను ఉత్పత్తి చేయడంలో వినూత్న పద్ధతులను అవలంబిస్తున్నందుకుగానూ ఈ గౌరవాన్ని దక్కించుకుంది వినతి షరాఫ్ ముర్తేజా. పెన్సిల్వేనియాలో కెమికల్ ఇంజినీరింగ్ చదివిన వినతి 2006లో మనదేశానికి తిరిగొచ్చి తండ్రి నడిపిస్తున్న ‘వినతి ఆర్గానిక్స్ ప్రైవేట్ లిమిటెడ్(విఓఎల్)’బాధ్యతల్ని తన భుజాలపైన వేసుకుంది. ఆ సంస్థ సౌందర్యోత్పత్తుల తయారీ, టెక్స్‌టైల్స్, ఫెర్టిలైజర్స్, ఫార్మా తదితర రంగాల్లో అవసరమయ్యే రసాయనాలను తయారు చేస్తుంది.
వినతి సంస్థ పగ్గాలను అందుకునే సమయానికి విఓఎల్ టర్నోవరు రూ.66 కోట్లు. దాన్ని చాలా తక్కువ కాలంలోనే వెయ్యి కోట్ల టర్నోవరు సాధించే సంస్థగా తీర్చి దిద్దిన ఘనత వినతికే దక్కుతుంది. అందుకోసం రసాయన ఉత్పత్తిలో టెక్నాలజీని వాడటంతోపాటు, పర్యావరణానికి మేలు చేసే పాలిమర్స్‌ను తయారు చేయడానికే పెద్ద పీట వేసింది. దాంతోపాటు టెక్స్‌టైల్, వాటర్‌ప్లాంట్లు, ప్రయోగశాలలతోపాటు పలు చోట్ల వాడే ఆక్రీలమైడ్ టెర్షరీ బులైట్ సల్ఫోనిక్ యాసిడ్(ఎటీబీసీ)ని ఉత్తత్తి చేసే ప్లాంటును ఏర్పాటు చేసింది. అప్పటివరకూ పలు సంస్థలు చాలా తక్కువ మొత్తంలో ఈ పాలిమర్‌ను తయారు చేసేవి. అందుకోసం ఓ పెద్ద ప్లాంటును ఏర్పాటు చేసి ఈ పాలిమర్‌ను ప్రపంచ దేశాలకు ఉత్పత్తి చేసేలా ప్రణాళికలు రూపొందించింది. పైగా ఆ ప్లాంటే ప్రపంచంలో అతిపెద్ద ఎటీబీసీ ప్లాంటుగానూ గుర్తింపు దక్కించుకుంది. దాంతోపాటు మరికొన్ని ప్లాంట్లను పెట్టి పర్యావరణానికి హాని చేయని రసాయనాలను పెద్ద ఎత్తున ఉత్పత్తి చేస్తోంది.
పర్యావరణ పరిరక్షణకు...
దిల్లీకి చెందిన స్వప్న్ మెహ్రా ‘లోరా ఎకలాజికల్ సొల్యూషన్స్’ పేరుతో ఓ సంస్థను ఏర్పాటు చేసి మనదేశంలోని వాతావరణ, పర్యావరణ పరిరక్షణకు కృషి చేస్తున్నందుకుగానూ యంగ్ గ్లోబల్ లీడర్స్ జాబితాలో చోటు దక్కించుకున్నాడు. అటవీ నిర్వహణ, అందుకయ్యే ఖర్చు, ఉత్పత్తులకు సంబంధించి ఆదాయం, ప్రభుత్వం ఎంత నిధులు మంజూరు చేయొచ్చు వంటివన్నీ గ్రౌండ్ లెవెల్‌లో అధ్యయనం చేసి రిపోర్టు తయారు చేస్తుంది ‘లోరా’ సంస్థ. అలానే ప్రభుత్వ వృక్షాలకు జియో ట్యాగింగ్ చేసి మ్యాపులు తయారు చేయడం, ఫారెస్ట్ బయోడైవర్సిటీ, అంతరించిపోతున్న పంటలను గుర్తించి... వాటి పునరుద్ధరణకు కృషి చేయడం, వాతావరణం, భూసారం దృష్ట్యా రైతులతో వ్యవసాయం చేయించడం వంటివి చేయిస్తుంటుంది.
అందులో భాగంగా కర్ణాటక, అసోం, మధ్యప్రదేశ్, తెలుగురాష్ట్రాలతో కలిసి పనిచేస్తున్నాడు. స్వప్న్ మెహ్రా ఈ మధ్య కాలంలో దిల్లీలోని చెట్లకు జియో ట్యాగింగ్ చేసి ట్రీ మ్యాపును రూపొందించి గూగుల్‌లో పెట్టారు. అసోంలోని అందమైన దీవి మాజులీని కార్బన్ ఫ్రీ జిల్లాగానూ మార్చేసింది లోరా సంస్థ. అందుకుగానూ ఆ దీవిలోని ప్రభుత్వ కార్యాలయాలూ, గృహసముదాయాల్లో సోలార్ విద్యుత్ ఏర్పాట్లు, కార్లూ, బైకులనూ ఎలక్టిక్ వాహనాలుగానూ మార్చారు. ఇండియన్ రైల్వేస్‌తో కలిసి రైల్వే ట్రాకుల పక్కన మొక్కలు నాటి సంరక్షిస్తున్నాడు మెహ్రా.