వచ్చే ఆర్థిక సంవత్సరంలో భారత మీడియా, వినోద(ఎమ్ అండ్ ఈ) రంగ ఆదాయాలు బాగుంటాయని రేటింగ్ ఏజెన్సీ క్రిసిల్ అంచనా వేస్తోంది. ఈ ఏడాదిలో 26 శాతం మేర క్షీణించిన ఈ రంగం 2021-22లో 27 శాతం మేర వృద్ధి చెంది రూ.1.37 లక్షల కోట్ల ఆదాయాన్ని రాబట్టుకుంటుందని అంచనా వేసింది.
'టీవీలు' వేగంగా పుంజుకున్నాయ్
- డిజిటల్ మీడియా, టీవీ విభాగాలు కరోనా ముందు స్థాయిలకు చాలా తక్కువ సమయంలో చేరగా.. ప్రింట్, సినిమాలు, అవుట్‌డోర్, రేడియో వంటి వాటి వృద్ధికి సమయం పట్టొచ్చు.
- వ్యాపార ప్రకటనలు, వినియోగదారు చందా ఆదాయాలు మొత్తం ఎమ్ అండ్ ఈ రంగ ఆదాయంలో సమాన వాటా అందిస్తున్నాయి. వీటిపై కరోనా బాగా ప్రభావం చూపింది. ఆర్థిక వ్యవస్థ పుంజుకుంటున్న నేపథ్యంలో వచ్చే ఏడాది వ్యాపార ప్రకటనల ఆదాయం 31%; చందా ఆదాయం 24 శాతం మేర వృద్ధి చెందవచ్చు.
- ఈ రంగ ఆదాయాల్లో సగం వాటా అందిస్తున్న టీవీ విభాగం పూర్తిగా రికవరీ అయింది. దీంతో 2021-22లో మంచి వృద్ధి నమోదు చేస్తుంది. తొలుత ప్రకటనల ఆదాయం తగ్గినా.. కొత్త కంటెంట్, ఐపీఎల్, పండుగల వంటి వాటి కారణంగా వేగంగానే పుంజుకుంది.
- చందాల విషయానికొస్తే కరోనా సమయంలోనూ చాలా మంది ఇంటికే పరిమితం కావడంతో టీవీ ఆదాయానికి ఢోకాలేకుండా పోయింది.
'ప్రింట్' వ్యూహాలు పనిచేశాయి
- ఎమ్ అండ్ ఈ రంగంలో అయిదో వంతు ఆదాయ వాటా ఉన్న ముద్రణ (ప్రింట్) విభాగం నెమ్మదిగా పుంజుకుంటోంది. 2021-22 చివరికి పూర్తి స్థాయిలో కోలుకోవచ్చు. డిజిటల్ విభాగానికి ఇది తన ఆదాయాన్ని కోల్పోతోంది. సంచికల (సర్క్యులేషన్) విషయానికొస్తే.. ముఖ్యంగా ఆంగ్ల భాషకు చెందిన ప్రింట్ విభాగం 8-10 శాతం మేర ఆదాయం కోల్పోయింది. మెట్రోల్లో ఇ-పేపర్లకు ఆదరణ లభించడం ఇందుకు నేపథ్యం. అయితే ప్రింట్ మీడియా కంపెనీలు తమ వ్యయాలను పునఃపరిశీలనతో చక్కదిద్దుకోవడంతో పాటు.. డిజిటల్ ఎడిషన్లు తేవడంతో మనగలిగాయి. వాటి వ్యూహాలు పనిచేశాయి.
ఓటీటీల వేగం పెరిగింది
కరోనా కారణంగా ఇంట్లోనే వినోదాన్ని అందించే ఓవర్ ద టాప్(ఓటీటీ) ప్లాట్‌ఫామ్‌లకు ఆదరణ పెరిగింది. ఆన్‌లైన్ గేమింగ్, ఇ-కామర్స్, ఇ-లెర్నింగ్, ఇ-పేపర్లు, ఆన్‌లైన్ వార్తా ప్లాట్‌ఫామ్స్‌లు కూడా రాణిస్తున్నాయి. మధ్యకాలానికి డిజిటల్ ఆదాయాలు ఏటా 14-16 శాతం మేర పెరగవచ్చని అంచనా. 2024 కల్లా మొత్తం ఎమ్ అండ్ ఈ రంగంలో వీటి ఆదాయాలు రెట్టింపై 20 శాతానికి చేరే అవకాశం ఉంది.
పెద్ద మీడియా కంపెనీలు నిలబడ్డాయ్
భారీ స్థాయి మీడియా కంపెనీల రుణ ప్రొఫైళ్లకు ఎటువంటి ఇబ్బందీ కలగలేదు. వాటి బలమైన బ్యాలెన్స్ షీట్లు, నగదు నిల్వలు, ఆదాయాలు పుంజుకున్నాయి. మద్య స్థాయి నుంచి చిన్న స్థాయి కంపెనీలు మాత్రం ఒత్తిడిని ఎదుర్కొన్నాయి.
సినిమాపై 2022లోనూ ప్రభావం
ఎమ్ అండ్ ఈ రంగ ఆదాయాల్లో ఆరో వంతు వాటా ఉన్న సినిమా విభాగంపై బాగా ప్రభావం పడింది. ఇపుడిపుడే థియేటర్లలో ఆక్యుపెన్సీ పెరుగుతుండడం, బలమైన కంటెంట్ తదితర కారణాల వల్ల సినిమా విభాగం పుంజుకుంటోంది. టీకాల రావడం కలిసొచ్చింది. కరోనా భయాల కారణంగా 2021-22లోనూ సినిమా రంగ ఆదాయాలపై ప్రభావం కొనసాగొచ్చు. రేడియో, అవుట్‌డోర్ వంటి విభాగాలు కోలుకోవడానికి చాలా సమయం పట్టొచ్చు. ఈ విభాగాలకు కీలకమైన స్థూల, చిన్న, మధ్య స్థాయి కంపెనీల వ్యాపార బడ్జెట్‌లు పరిమితంగా ఉండొచ్చన్న అంచనాలు ఇందుకు నేపథ్యం.
ఇదీ చదవండి: వంటింట్లో మంటలు- సలసల కాగుతున్న నూనె ధరలు