లాక్‌డౌన్ కారణంగా విమాన టికెట్లు రద్దు చేసుకున్న వారి నుంచి ఎటువంటి ఛార్జీలు వసూలు చేయకుండా ప్రయాణీకులు చెల్లించిన మొత్తాన్ని వెనక్కి ఇవ్వాలని విమానయాన సంస్థలకు కేంద్రం ఆదేశాలు జారీ చేసింది.
మూడు వారాల్లో..
కరోనా వ్యాప్తిని నియంత్రించేందుకు గాను తప్పని పరిస్థితుల్లో లాక్‌డౌన్ విధించాల్సి వచ్చిందని కేంద్రం వెల్లడించింది. ఈ నేపథ్యంలో తొలి దశ (మార్చి 25 నుంచి ఏప్రిల్ 14 వరకు), రెండో విడత (ఏప్రిల్ 15 నుంచి మే 3 వరకు) లాక్‌డౌన్ సమయంలో బుక్ చేసుకున్న టికెట్లను క్యాన్సిల్ చేసుకున్న రోజు నుంచి మూడు వారాల లోపు చెల్లించాలని ఆదేశాలు జారీ చేసింది.
ఎలాంటి ఛార్జీలు లేకుండా..
క్యాన్సిలేషన్ ఛార్జీలను ఎటువంటి ప్రయాణికుల నుంచి వసూలు చేయవద్దని ఆదేశిస్తూ.. కేంద్ర పౌర విమానయాన శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. గత రెండు రోజులుగా.. ప్రైవేటు విమానయాన సంస్థల ఉన్నతాధికారులతో సంప్రదింపులు జరిపిన పౌర విమానయాన శాఖ అధికారులు ఈ మార్గదర్శకాలు విడుదల చేశారు.
వారి డిమాండ్‌తోనే..
'తొలి దశ లాక్‌డౌన్ ఏప్రిల్ 14తో ముగుస్తుందనే ఉద్దేశ్యంతో తాము ఉన్న ప్రదేశాల నుంచి వెళ్లేందుకు చాలా మంది ఏప్రిల్ 15 నుంచి టికెట్లు బుక్ చేసుకున్నారు. ఇప్పుడు ఆ టికెట్లు కూడా రద్దు చేసుకుంటున్నారు. అందువల్ల జాతీయ, అంతర్జాతీయ టికెట్లు ఏవైనా... పూర్తిగా చెల్లించాల్సిందేనని' విమానయాన మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది.
ఇదీ చూడండి: పిజ్జా డెలివరీ బాయ్‌కు కరోనా- 72 కుటుంబాలు నిర్బంధం