తక్కువ ప్రీమియంతో ఎక్కువ రక్షణ కల్పించేవి టర్మ్ పాలసీలు. పాలసీదారుడికి అనుకోనిదేమైనా జరిగినప్పుడు నామినీకి పాలసీ విలువను ఇది అందిస్తుంది. ఆర్థిక ప్రణాళికలో ఎంతో ప్రాధాన్యమున్న ఈ పాలసీ ప్రీమియాన్ని పెంచాలని బీమా సంస్థలు నిర్ణయించాయి. వాస్తవానికి ఈ పెంపు ఏప్రిల్ 1 నుంచే అమల్లోకి రావాల్సి ఉంది. కానీ, కరోనా నేపథ్యంలో ఈ పెంపును ఏప్రిల్ 10 వరకూ వాయిదా వేసినట్లు బీమా సంస్థలు పేర్కొంటున్నాయి. అంటే.. మరో కొద్ది రోజులపాటు పాత ప్రీమియానికే టర్మ్ బీమా పాలసీలను తీసుకునే వెసులుబాటు ఉందన్నమాట.
సాధారణంగా ప్రతి ఐదేళ్లకోసారి భారతీయ జీవిత బీమా సంస్థ (ఎల్‌ఐసీ) పాలసీదారులకు సంబంధించిన మరణాల రేటును ప్రకటిస్తూ ఉంటుంది. దీన్ని ప్రామాణికంగా తీసుకుని బీమా సంస్థలు ప్రీమియాన్ని నిర్ణయిస్తుంటాయి. దీంతోపాటు బీమా సంస్థలు పెద్ద మొత్తంలో తీసుకున్న పాలసీలను రీ ఇన్సూరెన్స్ సంస్థల దగ్గర తిరిగి బీమా చేస్తాయి. ఈ రీ ఇన్సూరెన్స్ సంస్థలు కొన్నిసార్లు ప్రీమియాన్ని పెంచుతాయి. ఇలాంటప్పుడు బీమా సంస్థలు తమపై పడిన భారాన్ని పాలసీదారులకు బదలాయిస్తుంటాయి. ప్రస్తుతం ప్రీమియం పెంచే నిర్ణయానికి రీ ఇన్సూరెన్స్ సంస్థలు ప్రీమియం పెంచడమే కారణం. గత కొంతకాలంగా టర్మ్ పాలసీ క్లెయింల సంఖ్య పెరిగిందని, దీనివల్ల అధిక మొత్తంలో చెల్లింపులు చేయాల్సి వస్తోందని రీ ఇన్సూరెన్స్ సంస్థలు చెబుతున్నాయి. ఈ ఆర్థిక సంవత్సరం నుంచి దీనికి సంబంధించిన ప్రీమియం పెంచుతామని అవి ఇప్పటికే బీమా సంస్థలకు సమాచారం ఇచ్చాయి.
15-40శాతం వరకూ..
మూడేళ్ల క్రితం టర్మ్ బీమా ప్రీమియం 5-25 శాతం వరకూ పెరిగింది. అయితే.. బీమా సంస్థల మధ్య పోటీ నెలకొనడం కారణంగా అవి తక్కువ ధరకే అధిక మొత్తం పాలసీలను అందించేందుకు ముందుకురావడం ప్రారంభించాయి. నెలకు రూ.500 ఖర్చుతో 30 ఏళ్ల వ్యక్తికి రూ.కోటి విలువైన పాలసీలను ఆన్‌లైన్‌లో అందిస్తున్న సంస్థలూ ఉన్నాయి. కానీ.. ఇప్పుడు పాలసీల క్లెయిం రేటు పెరగడం వల్ల రీ ఇన్సూరెన్స్ సంస్థలు ప్రీమియం పెంచబోతున్నాయి. ఈ నేపథ్యంలో బీమా సంస్థలు 15-40 శాతం వరకూ బీమా ప్రీమియాలు పెరగనున్నాయి.
పాతవాటికి వర్తించదు
‘ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే.. ఇప్పటికే తీసుకున్న పాలసీలకు ఈ పెంపు వర్తించదు. పాత ప్రీమియమే కొనసాగుతుంది. కేవలం ఏప్రిల్ 10 నుంచి కొత్తగా తీసుకోబోయే టర్మ్ పాలసీలకే ఇది వర్తిస్తుంది. కాబట్టి, టర్మ్ పాలసీలు తీసుకోవాలని భావించే వారికి ఇప్పుడు మంచి అవకాశమే ఉందని’ అంటున్నారు పాలసీబజార్.కామ్ చీఫ్ బిజినెస్ ఆఫీసర్ సంతోష్ అగర్వాల్. ప్రీమియం లెక్కింపులో ప్రధానంగా చూసే మరణాల రేటు గతంతో పోలిస్తే ఇప్పుడు బాగా పెరిగింది. తక్కువ ప్రీమియానికి పాలసీలను అందించడం ఇప్పుడు బీమా సంస్థలకు సవాలుగా మారింది. కోవిడ్-19 నేపథ్యంలో పాలసీలు తీసుకోవాలనుకున్న వారికి వైద్య పరీక్షలనూ ఇంటి వద్దే చేసేందుకు పలు బీమా సంస్థలు ఏర్పాట్లు చేస్తున్నాయి.
థర్డ్ పార్టీ వాహన, ఆరోగ్య బీమా పాలసీల గడువు పెంపు
కరోనా లాక్‌డౌన్ కొనసాగుతున్న నేపథ్యంలో వాహన, ఆరోగ్య బీమా పాలసీదారులకు పెద్ద ఊరట లభించింది. సాధారణంగా ఈ పాలసీల నిర్ణీత గడువులోపు ప్రీమియం చెల్లించకపోతే.. అవి రద్దయినట్లే లెక్క. నిర్ణీత వ్యవధి లోపు ప్రీమియం చెల్లించేందుకు అనుమతించినా ఈ మధ్య కాలంలో పాలసీ క్లెయిం చేసుకోవడానికి ఉండదు. ప్రస్తుత పరిస్థితుల్లో ప్రీమియం చెల్లించడంలో ఇబ్బందులు ఎదురవుతున్న దృష్ట్యా కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ ఈ విషయంలో కాస్త వెసులుబాటును కల్పించింది. మార్చి 25 నుంచి ఏప్రిల్ 14, 2020 వరకూ ఆరోగ్య, థర్డ్ పార్టీ వాహన బీమా పాలసీలను పునరుద్ధరించుకోవాల్సిన వారికి అదనంగా కొంత గడువునివ్వాలని బీమా సంస్థలకు ఆదేశాలనిచ్చింది.
ఆరోగ్య బీమా పాలసీకి సాధారణంగా గడువు లోపు ప్రీమియం చెల్లించి, పునరుద్ధరించుకోవాలి. ఒక్క రోజు ఆలస్యం చేసినా.. ఆ మధ్యలో పాలసీదారుడు అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరితే పాలసీ ఎలాంటి పరిహారాన్నీ ఇవ్వదు. గడువు లోపు ప్రీమియం చెల్లించని వారికి బీమా సంస్థలు 15-30 రోజుల అదనపు వ్యవధిని ఇస్తుంటాయి. అప్పటికీ ప్రీమియం చెల్లించకపోతే పాలసీ రద్దవుతుంది. తర్వాత తీసుకున్నా కొత్త పాలసీగానే పరిగణిస్తారు. ఈ ఇబ్బందులు తలెత్తకుండా మార్చి 25-ఏప్రిల్ 14 మధ్య పునరుద్దరణకు ఉన్న ఆరోగ్య బీమా పాలసీలను ఏప్రిల్ 21 వరకూ ప్రీమియం చెల్లించే వీలు కల్పించారు.
ఇక మోటార్ వాహనాల థర్డ్ పార్టీ బీమా పాలసీకీ ఇదే వెసులుబాటు కల్పించారు. మార్చి 25-ఏప్రిల్ 14 మధ్య థర్డ్ పార్టీ పాలసీ ముగిసినా అది ఏప్రిల్ 21 వరకూ చెల్లుబాటు అవుతుందని ఆర్థిక శాఖ పేర్కొంది. ఈ వ్యవధిలో ఏదైనా క్లెయిం వచ్చినా దానికి పరిహారం ఇవ్వాలని తెలిపింది. పాలసీని ఏప్రిల్ 21 లోపు కచ్చితంగా పునరుద్ధరించుకోవాలి.
ఇదీ చూడండి:'కరోనాపై పోరుకు 160 బిలియన్ డాలర్ల అత్యవసర సహాయం'