ఇతర ఛాట్ మెసేజింగ్ యాప్స్‌కు పోటీగా సరికొత్త ఫీచర్స్‌ను తీసుకొస్తూ యూజర్స్‌ని ఆకట్టుకునే ప్రయత్నం చేస్తోంది టెలిగ్రాం యాప్. తాజాగా ఈ యాప్ యూజర్స్ కోసం మరికొన్ని కొత్త ఫీచర్స్‌ని తీసుకొచ్చింది. యూజర్స్ ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న గ్రూప్ వీడియో కాల్స్ ఫీచర్‌తో పాటు యానిమేటెడ్ బ్యాక్‌గ్రౌండ్స్, మెసేజ్ యానిమేషన్స్ వంటి మరికొన్ని కొత్త ఫీచర్స్‌ను తాజా అప్‌డేట్‌లో పరిచయం చేసింది.
గ్రూప్ వీడియో కాల్స్
ఈ ఫీచర్ సాయంతో యూజర్స్ తమ గ్రూప్ వాయిస్ ఛాట్‌లను వీడియో కాన్ఫరెన్స్ కాల్స్‌గా మార్చుకోవచ్చు. అలానే టెలిగ్రాం వెబ్, యాప్‌లలో ఫుల్‌స్క్రీన్ మోడ్‌లో ఒకేసారి 30 మందితో వీడియో కాల్ మాట్లాడుకునే సదుపాయం ఉంది. జూమ్, గూగుల్ మీట్ యాప్‌ల తరహాలోనే టెలిగ్రాం గ్రూప్ వీడియో కాలింగ్‌లో కూడా మెరుగైన ఆడియో అనుభూతి కోసం నాయిస్ సప్రెషన్ ఫీచర్‌ను పరిచయం చేశారు. గ్రూప్ వీడియో కాలింగ్‌లో పాల్గొనేవారి సంఖ్య ఆధారంగా ట్యాబ్ యూజర్స్ కోసం స్ల్పిట్-స్క్రీన్ వ్యూ, సైడ్ ప్యానెల్ వ్యూ వంటి ఫీచర్స్ ఉన్నాయి. డెస్క్‌టాప్ వెర్షన్‌లో సెలెక్టివ్ స్క్రీన్‌షేరింగ్ ఫీచర్‌తో వీడియో కాల్ విండోతోపాటు మీకు నచ్చిన కార్యక్రమాన్ని మరో విండోలో షేర్ చెయ్యొచ్చు. ఈ ఫీచర్ తక్కువ సంఖ్యలో గ్రూప్ వీడియో కాలింగ్ చేసుకునే వారికి మరింత ఉపయోగకరంగా ఉంటుందని టెలిగ్రాం తెలిపింది.
బ్యాక్‌గ్రౌండ్ యానిమేషన్
యూఐ(యూజర్ ఇంటర్‌ఫేస్)లో కూడా టెలిగ్రాం కొన్ని మార్పులు చేసింది. యూజర్‌కి ఇతరుల నుంచి వచ్చే మెసేజ్‌లు, తాము ఇతరులకు పంపే మెసేజ్‌లకు వివిధ రంగులతో యూఐ బ్యాక్‌గ్రౌండ్ మార్చుకోవచ్చు. అలానే టెక్ట్స్ మెసేజ్, స్టిక్కర్స్, ఎమోజీలకు యానిమేషన్ జోడించుకునేలా టెలిగ్రాంలో మార్పులు చేశారు. ఈ ఫీచర్స్ వల్ల ఛాట్ బ్యాక్‌గ్రౌండ్, ఛాటింగ్ మరింత ఆకర్షణీయంగా, ఆసక్తికరంగా మారుతాయని టెలిగ్రాం పేర్కొంది. యానిమేటెడ్ బ్యాక్‌గ్రౌండ్ కోసం ఆండ్రాయిడ్ యూజర్స్ టెలిగ్రాం సెట్టింగ్స్‌లోకి వెళ్లి ఛేంజ్ ఛాట్ బ్యాక్‌గ్రౌండ్‌పై క్లిక్ చేయాలి. ఐఓఎస్ యూజర్స్ అయితే అప్పియరెన్స్ ఆప్షన్‌పై క్లిక్ చేసి ఛాట్ బ్యాక్‌గ్రౌండ్ ఎంపిక చేసుకోవాలి. దాంతోపాటు యూజర్స్ తమకు నచ్చిన రంగులతో యానిమేటెడ్ బ్యాక్‌గ్రౌండ్స్ డిజైన్ చేసుకుని నచ్చిన వారితో షేర్ చేసుకోవచ్చని టెలిగ్రాం తెలిపింది.
ఇదీ చూడండి: టెలిగ్రాంలో వాట్సాప్ తరహా ఫీచర్లు!
ఇదీ చూడండి: 'వాట్సాప్‌కు బై- టెలిగ్రామ్, సిగ్నల్‌కు జై!'