టెలికాం కంపెనీల ఏజీఆర్ వివాదానికి సంబంధించి సుప్రీం కోర్టు మంగళవారం కీలక తీర్పు ఇవ్వనుంది. సవరించిన స్థూల ఆదాయం (ఏజీఆర్) చెల్లించే కాలపరిమితి సహా, దివాలా సమయంలో టెల్కోలకు స్పెక్ట్రమ్ విక్రయించాలా? వద్దా? అనే విషయంపై స్పష్టత వచ్చే అవకాశముంది. దివాలా సమయంలో టెలికాం కంపెనీల నుంచి ఏజీఆర్ బకాయిలు ఎలా తిరిగి రాబట్టాలనే విషయంపైనా సుప్రీం కీలక సూచనలు చేయొచ్చు.
అధికారిక లెక్కల ప్రకారం.. టెలికాం సంస్థలు మొత్తం రూ.1.6 లక్షల ఏజీఆర్ బకాయిలు చెల్లించాలి.
అంత సమయం అసాధ్యం..
ఈ బకాయిలు చెల్లించేందుకు టెలికాం సంస్థలకు 20 సంవత్సరాల గడువు ఇవ్వాలని సుప్రీంకోర్టును కేంద్రం గతంలో అభ్యర్థించింది. అయితే 15-20 సంవత్సరాలు గడువు ఇవ్వడం సహేతుకం కాదని, తగిన టైంటేబుల్తో టెలికాం సంస్థలే ముందుకు రావాలని ధర్మాసనం ఇది వరకే స్పష్టం చేసింది.
అయితే ఏజీఆర్ బకాయిలను మళ్లీ లెక్కించాలని చేసిన టెల్కోల విన్నపంపై అత్యున్నత న్యాయస్థానం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆ విషయంలో ఒక్క సెకను కూడా వాదనలు వినమని జస్టిస్ అరుణ్ మిశ్రా నేతృత్వంలోని ధర్మాసనం తేల్చి చెప్పింది. దీనితో పాటు టెలికాం కంపెనీలు గత 10 సంవత్సరాల ఖాతాలను సమర్పించాలని ఆదేశించింది.
దివాలా ప్రక్రియలో ఉన్న కంపెనీలకు స్పెక్ట్రమ్ విక్రయం అంశంలో టెలికాం శాఖ, కార్పొరేట్ వ్యవహారాల శాఖ మధ్య నెలకొన్న అభిప్రాయభేదాలకు మంగళవారం తెరపడే అవకాశముంది.
ఇదీ చూడండి:'వాట్సాప్' భద్రతకు సప్త సూత్రాలు