'ఫ్రీ... ఫ్రీ' అంటూ ఒకప్పుడు వినియోగదారులను ఆకర్షించిన టెలికాం సంస్థలు.. ఇక నుంచి ఛార్జీల మోత మోగించడానికి సిద్ధపడుతున్నాయి. పోటీపడి మరీ అతి తక్కువ ధరలకే ఫోన్ కాల్స్, ఇంటర్నెట్ ప్లాన్లను అందించిన దిగ్గజ సంస్థలు.. కస్టమర్లపై ఛార్జీల భారాన్ని మోపనున్నాయి. ఈ జాబితాలో ఇప్పటికే జియో చేరింది. వినియోగదారుల నుంచి వసూళ్లు రాబడుతోంది. తాజాగా.. జియో రూట్లోనే ప్రయాణించడానికి ఎయిర్‌టెల్, వొడాఫోన్-ఐడియా నిర్ణయించుకున్నాయి.
జియో నుంచి మొదలు...
ఇన్‌కమింగ్, అవుట్‌గోయింగ్ కాల్స్‌ను ఉచితంగా అందిస్తూ కేవలం డేటాకు మాత్రమే ఛార్జ్ చేస్తున్న రిలయన్స్ జియో.. గత నెలలో ఓ కీలక నిర్ణయం తీసుకుంది. ఇతర నెట్‌వర్క్‌లకు చేసే అవుట్‌గోయింగ్ కాల్స్‌కు ఛార్జ్ చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు రిలయెన్స్ జియో నుంచి ఎయిర్‌టెల్, వోడాఫోన్-ఐడియాకు కాల్ చేస్తే నిమిషానికి 6 పైసలు వసూలు చేస్తోంది రిలయెన్స్ జియో. అయితే ఆ మొత్తానికి సమానమైన ఉచిత డేటాను వినియోగదారులకు అందించనుంది జియో.
తాజాగా... వొడాఫోన్-ఐడియా కూడా తమ వినియోగదారులకు గట్టి షాక్ ఇచ్చింది. డిసెంబర్ 1 నుంచి మొబైల్ సేవల ఛార్జీలను పెంచుతున్నట్లు ప్రకటించింది. ఈ సంస్థ ఛార్జీలు పెంచడం గత మూడేళ్లలో ఇదే తొలిసారి.
వొడాఫోన్-ఐడియా ప్రకటన వెలువడిన కొద్ది నిమిషాలకే ఎయిర్‌టెల్ కూడా ఇంచుమించూ ఇదే తరహాలో ఓ ప్రకటన విడుదల చేసింది. మొబైల్ ఛార్జీలు పెంచుతున్నట్లు తెలిపింది. పెంచిన ధరలు డిసెంబర్ నుంచి అమల్లో వస్తాయని తెలిపింది.
ప్రతిపాదిత ఛార్జీల పెంపు ఏ స్థాయిలో ఉంటుంది, ఎంత మేరకు పెంచుతున్నారు వంటి విషయాలను ఈ సంస్థలు వెల్లడించలేదు.
రివర్స్ గేర్ ఎందుకు?
ట్రాయ్ నిబంధనలతో ప్రత్యర్థి నెట్‌వర్క్‌లకు జియో సుమారు రూ.13,500 కోట్లు చెల్లించాల్సి వచ్చింది. ఈ నష్టాన్ని భరించేందుకే ఇతర నెట్‌వర్క్‌లకు చేసే కాల్స్‌పై 6 పైసలు వసూలు చేస్తోంది జియో.
టెలికాం విభాగానికి బకాయిలు చెల్లించాల్సిందేనని భారత టెలికాం సంస్థలను గత అక్టోబర్‌లో ఆదేశించింది సుప్రీం కోర్టు. ఈ నేపథ్యంలో రెండో త్రైమాసిక ఫలితాల్లో భారీ నష్టాలను మూట గట్టుకుంది వొడాఫోన్-ఐడియా. సుమారు 50,921 కోట్ల నష్టాలను ప్రకటించింది. రెండో త్రైమాసిక ఫలితాల్లో ఏ భారతీయ కార్పొరేట్ సంస్థ ఇత మేర నష్టాన్ని ప్రకటించిన దాఖలాలు లేవు. దీని వల్ల అప్పుల ఊబిలో కూరుకుపోయిన వోడాఫోన్-ఐడియా.. వినియోగదారులపై ఛార్జీల పెంపు నిర్ణయం తీసుకుంది. ఎయిర్‌టెల్ కుడా 23,045 కోట్ల రూపాయలను నష్టపోయింది. ఆ సంస్థకు ఇదే అతిపెద్ద నష్టాల రికార్డు.