TCS Brand Value: అంతర్జాతీయంగా అత్యంత విలువైన ఐటీ బ్రాండ్ల జాబితాలో తొలి మూడు స్థానాల్లో రెండు భారత్‌కు చెందినవే కావడం విశేషం. అమెరికాకు చెందిన అత్యంత ప్రతిష్ఠాత్మక కంపెనీ ఐబీఎంను సైతం మన దిగ్గజాలు వెనక్కి నెట్టాయి. టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్, ఇన్ఫోసిస్ వరుసగా రెండు, మూడు స్థానాల్లో నిలిచాయి. ఏటా కంపెనీల బ్రాండ్ విలువ ను అంచనా వేసే ‘బ్రాండ్ ఫైనాన్స్’ నివేదిక బుధవారం వెలువడింది. వరుసగా నాలుగో ఏడాది ప్రపంచంలోనే అత్యంత విలువైన, పటిష్ఠమైన ఐటీ సేవల సంస్థగా యాక్సెంచర్ తన తొలిస్థానాన్ని పదిలం చేసుకుంది.
కంపెనీ మొత్తం బ్రాండ్ విలువతో పాటు.. ఈ విషయంలో కంపెనీల మధ్య అంతరాన్ని బ్రాండ్ ఫైనాన్స్ అంచనా వేస్తుంది. మార్కెటింగ్ కోసం పెట్టుబడులు, వినియోగదారుల సంతృప్తి, సిబ్బంది సంతృప్తి, కార్పొరేట్ వర్గాల్లో కీర్తి, భవిష్యత్తు రెవెన్యూ అంచనాలు, బ్రాండ్ పటిష్ఠత వంటి అంశాలను పరిగణనలోకి తీసుకొని కంపెనీల బ్రాండ్ విలువను గణిస్తారు. అగ్రశ్రేణి-25 బ్రాండ్ల జాబితాలో విప్రో (7వ), హెచ్‌సీఎల్ (8వ), టెక్ మహీంద్రా (15వ), ఎల్‌టీఐ (22వ) కూడా ఉన్నాయి. ఇవన్నీ ప్రపంచంలో అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న ఐటీ కంపెనీల టాప్-10 జాబితాలో ఉండడం విశేషం. బ్రాండ్ ఫైనాన్స్ విడుదల చేసిన ‘గ్లోబల్ 500-2022’ నివేదిక ప్రకారం..
- ప్రపంచవ్యాప్తంగా అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న ఐటీ బ్రాండ్‌గా విప్రో నిలిచింది. అన్ని రంగాల్లో కలిపి అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న 25 కంపెనీల జాబితాలోనూ విప్రో చోటు దక్కించుకుంది.
- ఇన్ఫోసిస్ బ్రాండ్ విలువలో వార్షిక ప్రాతిపదికన 52 శాతం వృద్ధి నమోదైంది. ఈ కంపెనీ ర్యాంకు ఏకంగా 56 స్థానాలు ఎగబాకడం విశేషం. ‘‘వినియోగదారుల హితాన్ని కోరుతూ పరిస్థితులకనుగుణంగా మారేందుకు తాము తీసుకుంటున్న దృఢమైన నిర్ణయాలు, చేస్తున్న కృషి ఫలితమే బ్రాండ్ విలువలో వృద్ధి’’ అని కంపెనీ ఓ ప్రకటనలో పేర్కొంది.
- టాటా సన్స్ ఛైర్మన్ ఎన్.చంద్రశేఖరన్‌కు భారత ప్రభుత్వం పద్మ భూషణ్‌ను ప్రకటించిన మరుసటి రోజే కంపెనీ ఘనతల్లో ‘రెండో అత్యంత విలువైన బ్రాండ్’ గుర్తింపు కూడా చేరడం విశేషం.
- భారత్‌లో టాప్ సీఈఓగా చంద్రశేఖరన్ నిలిచినట్లు బ్రాండ్ ఫైనాన్స్ ‘బ్రాండ్ గార్జియన్‌షిప్ ఇండెక్స్ 2022’ వెల్లడించింది. ప్రపంచవ్యాప్తంగా 250 టాప్ సీఈఓల్లో మన చంద్రశేఖరన్ స్థానం 25 కావడం విశేషం.
- గత ఏడాది టీసీఎస్ బ్రాండ్ విలువను 16.8 బిలియన్ డాలర్లుగా అంచనా వేశారు. ఈసారి అది 12.5 శాతం అంటే 1.844 బిలియన్ డాలర్లు ఎగబాకింది.
- ప్రపంచవ్యాప్తంగా అత్యంత గుర్తింపు పొందిన భారత బ్రాండ్‌గా కూడా టీసీఎస్ నిలిచింది. న్యూయార్క్ సిటీ మారథాన్, లండన్ మారథాన్, టొరంటో మారథాన్, జాగ్వార్ టీసీఎస్ రేసింగ్ టీం వంటి ప్రతిష్ఠాత్మక క్రీడా కార్యక్రమాలకు స్పాన్సర్‌గా ఉండడం ద్వారా ఈ ఘనత సాధించింది.
- దక్షిణాసియా ప్రాంతంలో అత్యంత విలువైన తొలి 100 బ్రాండ్లలో ఒక్క టాటా గ్రూప్ మాత్రమే స్థానం దక్కించుకుంది. 2021లో కంపెనీ అంచనాలకు మించి రాణించింది. టాటా గ్రూప్ ఆధ్వర్యంలోని నమోదిత 20 సంస్థల మార్కెట్ విలువ.. 70 నమోదిత ప్రభుత్వ రంగ సంస్థల విలువ కంటే ఎక్కువ.
- అన్ని రంగాల్లో కలిపి చూస్తే ప్రపంచంలోనే అత్యంత విలువైన కంపెనీ యాపిల్. దీని బ్రాండ్ విలువ 355 బిలియన్ డాలర్లు
- ప్రపంచంలో అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న బ్రాండ్ టిక్‌టాక్. దీని విలువ ఏడాది వ్యవధిలో 215 శాతం ఎగబాకింది.
- రంగాలవారీగా చూస్తే టెక్నాలజీ రంగం అత్యంత విలువైంది. తర్వాతి స్థానంలో రిటైల్ నిలిచింది. వ్యాక్సిన్ల తయారీ, కొవిడ్ ఔషధాల తయారీ నేపథ్యంలో అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న రంగంగా ఫార్మా నిలిచింది. మహమ్మారి సంక్షోభం నేపథ్యంలో పర్యాటక రంగం విలువ కొవిడ్ మునుపటి స్థాయి కంటే దిగజారింది.
- బ్రాండ్ విలువ పరంగా ఇచ్చిన ర్యాంకింగ్‌లలో 2/3వ వంతు కంపెనీలు అమెరికా, చైనాకు చెందినవే. ఈ విషయంలో భారత్ అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న దేశంగా నిలిచింది.
- వీచాట్ ప్రపంచంలోనే అత్యంత దృఢమైన బ్రాండ్‌గా నిలిచింది. ఈ కంపెనీ వరుసగా రెండో ఏడాది ఈ ఘనత సాధించింది.
- ప్రపంచ టాప్ 250 సీఈఓల్లో మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్యనాదెళ్ల తొలిస్థానంలో నిలిచారు.
- ఫార్మా రంగంలో అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న బ్రాండ్‌గా ఆస్ట్రాజెనెకా నిలిచింది. తర్వాతి స్థానంలో ఫైజర్ ఉంది.
ఇదీ చూడండి: బడ్జెట్ 2022-23: నిర్మల 'పద్దు' ఆరోగ్య రంగానికి బూస్టర్ అవుతుందా?