కరోనా రోగులపై 'నాఫమోస్టాట్ మెసిలేట్' అనే ఔషధంతో క్లినికల్ ట్రయల్స్ నిర్వహించేందుకు భారత ఔషధ నియంత్రణ సంస్థ (డీసీజీఐ) అనుమతి ఇచ్చిందని ప్రముఖ ఔషధ తయారీ సంస్థ సన్‌ఫార్మా తెలిపింది.
జపాన్ ప్రభుత్వం... ప్యాంక్రియాటైటిస్ (క్లోమ గ్రంథుల వాపు), రక్త నాళాల్లో రక్తం గడ్డకట్టడం (డీఐసీ) లాంటి వ్యాధుల చికిత్సల్లో 'నాఫమోస్టాట్ మెసిలేట్' ఔషధం ఉపయోగించేందుకు ఆమోదం తెలిపింది. తాజాగా ఈ ఔషధం కరోనాను సమర్థవంతంగా నియంత్రిస్తున్నట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు.
"సార్స్-కోవి-2 వైరస్‌ను నాఫమోస్టాట్ మెసిలేట్ సమర్థవంతంగా నియంత్రిస్తున్నట్లు... ఐరోపా, జపాన్, దక్షిణ కొరియాల్లోని మూడు వేర్వేరు స్వతంత్ర శాస్త్రవేత్తల సమూహాలు చేసిన ప్రయోగాల్లో తేలింది."
- దిలీప్ సంఘ్వీ, సన్‌ఫార్మాస్యూటికల్ ఇండస్ట్రీస్ ఎండీ
క్లినికల్ ట్రయల్స్+ ఉత్పత్తి
త్వరలోనే నాఫమోస్టాట్ మెసిలేట్ క్లినికల్ ట్రయల్స్ నిర్వహించనున్నట్లు సన్‌ఫార్మా వెల్లడించింది. అలాగే పోలా ఫార్మా జపాన్ అనే సంస్థ నుంచి అందిన సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి... భారత్‌లోనే నాఫమోస్టాట్ మెసిలేట్, ఏపీఐ ఔషధాల ఉత్పత్తిని కూడా ప్రారంభించనున్నట్లు స్పష్టం చేసింది.
ఆ ప్రొటీన్‌ను అణచివేస్తోంది..!
జపాన్‌లోని టోక్యో విశ్వవిద్యాలయం, జర్మనీలోని లీబ్నిజ్ ఇన్స్టిట్యూట్ ఫర్ ప్రైమేట్ రీసెర్చ్‌కు చెందిన శాస్త్రవేత్తలు నాఫమోస్టాట్పై ప్రయోగాలు చేశారు. ఈ ఔషధం.. కొవిడ్-19 వైరస్ మానవ శరీరంలోకి ప్రవేశించేందుకు అవకాశం కల్పిస్తున్న ప్రొటీన్ (టీఎంపీఆర్ఎస్ఎస్2)ని అణచివేస్తున్నట్లు గుర్తించారు.
ప్రస్తుతానికి జపాన్, దక్షిణ కొరియా, ఇటలీ-స్విట్జర్లాండ్ల్లో... నాఫమోస్టాట్పై క్లీనికల్ ట్రయల్స్ జరుగుతున్నాయి.
ఇదీ చూడండి: కరోనాపై పోరులో స్వచ్ఛందంగా 38వేల మంది వైద్యులు