Sun Flower farming: ప్రపంచ దేశాలకు పొద్దుతిరుగుడు పువ్వు (సన్‌ఫ్లవర్) నూనె సరఫరా చేసే దేశాల్లో ఉక్రెయిన్ కీలకం. అక్కడ ఏటా కోటి టన్నుల సన్‌ఫ్లవర్ పండుతుంటే, వాటి నుంచి 40 లక్షల టన్నుల నూనె ఉత్పత్తి అవుతోంది. అందులో అక్కడి ప్రజలు వాడేది 6 లక్షల టన్నులే. మిగిలింది విదేశాలకు ఎగుమతి చేస్తున్నారు. ఉక్రెయిన్ ఉత్పత్తిలో 27 శాతం నూనె మనదేశానికే చేరుతోంది.
మన దేశంలో చూస్తే నెలకు 18 లక్షల టన్నుల వంట నూనెల వినియోగం జరుగుతోందని అంచనా. ఇందులో సన్‌ఫ్లవర్ నూనె వాటా 1.5-2 లక్షల టన్నులుంటుంది. 2021లో మనదేశం 1.89 మిలియన్ టన్నుల పొద్దుతిరుగుడు పువ్వు నూనెను దిగుమతి చేసుకుంది. అందులో 70 శాతం ఉక్రెయిన్, 20 శాతం రష్యా నుంచే వచ్చింది. మరో 10 శాతం అర్జెంటీనా నుంచి వచ్చింది. ఏటా మనదేశంలోని పంటతో 60 వేల టన్నుల సన్‌ఫ్లవర్ నూనె మాత్రమే ఉత్పత్తి అవుతున్న నేపథ్యంలో, ఈ నూనె కోసం దిగుమతులపైనే అధికంగా ఆధారపడాల్సిన పరిస్థితి. మొత్తం వంటనూనెల్లోనూ 60 శాతం అవసరాలను దిగుమతులే తీరుస్తుండటం గమనార్హం. ఉక్రెయిన్‌పై రష్యా 14 రోజులుగా దాడులు చేస్తుండటంతో అక్కడి నుంచి నూనె ఎగుమతులకు ఆటంకాలు ఏర్పడుతున్నాయి. ఇదే అంశాన్ని కారణంగా చూపుతూ, ఇప్పటికే దేశీయంగా వంటనూనెల ధరలను భారీగా పెంచేశారు. అయితే 'సన్‌ఫ్లవర్ నూనెకు ఎటువంటి కొరత లేదు. మార్చి డెలివరీ కింద యుద్ధం ప్రారంభానికి ముందే, 1.5 లక్షల టన్నుల సన్‌ఫ్లవర్ నూనెతో ఉక్రెయిన్ నుంచి బయలుదేరిన నౌక మన దేశానికి చేరుతోంద'ని పరిశ్రమ వర్గాలు ఇటీవల వాణిజ్య మంత్రికి భరోసా ఇచ్చాయి. అయినా ధరలు పెరగడం ఆగలేదు.
ఉక్రెయిన్‌లో సాగు ఇలా
ఉక్రెయిన్‌లో ఏటా 3 కోట్ల ఎకరాల్లో పంటలు పండిస్తుంటే అందులో 60 లక్షల ఎకరాలు పొద్దుతిరుగుడు పువ్వు పంట ఉంటుందని అంచనా. ఇప్పుడు రష్యా దాడులు చేస్తున్న ఉక్రెయిన్‌లోని ఖర్కివ్, కైరోవోగ్రాడ్ వంటి ప్రాంతాల్లో ఈ పంట ఎక్కువగా సాగవుతుండటం గమనార్హం. హెక్టారుకు 18 నుంచి 20 క్వింటాళ్ల దిగుబడి అక్కడ వస్తోంది.
తెలుగు రాష్ట్రాల్లో అవకాశాలు
తెలుగు రాష్ట్రాల్లో వానాకాలం, యాసంగి కలిపి 3 కోట్ల ఎకరాలకు పైగా పంటలు సాగవుతున్నాయి. నూనెగింజల సాగును రెండు సీజన్లలో అరకోటి ఎకరాల్లో చేపట్టవచ్చని ఆయిల్‌ఫెడ్ ఎండీ సురేందర్ 'ఈనాడు'కు చెప్పారు. ఇందువల్ల మనదేశం ఏటా దిగుమతి చేసుకుంటున్న 25 లక్షల టన్నుల సన్‌ఫ్లవర్ నూనెను ఇక్కడే ఉత్పత్తి చేయవచ్చని తెలిపారు. పొద్దుతిరుగుడు పువ్వు సాధారణ విస్తీర్ణం 801 ఎకరాలైతే, తెలంగాణలో గత వానాకాలంలో 282 ఎకరాల్లోనే సాగు చేశారు. నూనెగింజల సాగు సాధారణ విస్తీర్ణం 3.70 లక్షల ఎకరాలైతే ప్రస్తుత యాసంగిలో 35,940 ఎకరాల్లోనే చేస్తున్నారు.
పడిపోయిన పంట దిగుబడి
గిట్టుబాటు కావడం లేదంటూ మనదేశంలో పొద్దుతిరుగుడు పువ్వు సాగును రైతులు బాగా తగ్గించేశారు. దేశీయంగా హెక్టారుకు సగటున 7 క్వింటాళ్లలోపే ఈ పంట దిగుబడి వస్తోంది. 2007-08లో మనదేశంలో 14.63 లక్షల టన్నుల పొద్దుతిరుగుడు పువ్వు పంట దిగుబడి రాగా ఈ ఏడాది(2021-22)లో కేవలం 2.66 లక్షల టన్నులే వస్తుందని కేంద్ర వ్యవసాయశాఖ అంచనా వేసింది. వినియోగం పెరిగింది కనుక పొద్దుతిరుగుడు పువ్వు పంట సాగుచేస్తే మన రైతులకూ ఆదాయం బాగుంటుందని పరిశ్రమ వర్గాలు పేర్కొంటున్నాయి.
ప్రత్యామ్నాయాల అన్వేషణ
దక్షిణ అమెరికా, ఆగ్నేయాసియా దేశాల నుంచి దిగుమతులకూ ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. ఆవాల కొత్త పంట 11 లక్షల టన్నుల మేర అందుబాటులోకి వచ్చినందున, ఆ నూనె ధర తగ్గుతుందని పేర్కొంటోంది.
ఇదీ చదవండి: LIC IPO: ఎల్‌ఐసీ ఐపీఓకు సెబీ ఆమోదం