జీడీపీ వృద్ధి భయాలతో నిన్న స్వల్పంగా నష్టపోయిన దేశీయ స్టాక్‌మార్కెట్లు.. ఇవాళ మళ్లీ లాభాలబాట పట్టాయి. అంతర్జాతీయ సానుకూల పవనాలు, నిరంతర విదేశీ పెట్టుబడుల ప్రవాహం, మహారాష్ట్రలో సంకీర్ణ ప్రభుత్వ ఏర్పాటుకు మార్గం సుగమం అవ్వడమే ఇందుకు కారణం.
బొంబాయి స్టాక్ ఎక్స్ఛేంజి సూచి సెన్సెక్స్ 165 పాయింట్లు లాభపడి 40 వేల 990 వద్ద కొనసాగుతోంది. జాతీయ స్టాక్ ఎక్స్ఛేంజి సూచీ నిఫ్టీ 50 పాయింట్లు వృద్ధిచెంది 12 వేల 90 వద్ద ట్రేడవుతోంది.
లాభాల్లో
ఎస్ బ్యాంకు, టాటా మోటార్స్, ఎమ్ అండ్ ఎమ్, హెచ్డీఎఫ్సీ, హెచ్డీఎఫ్సీ బ్యాంకు, మారుతీ సుజుకీ, ఇండస్ఇండ్ బ్యాంకు, వేదాంత, టీసీఎస్ రాణిస్తున్నాయి.
నష్టాల్లో
జీ ఎంటర్టైన్మెంట్, ఐసీఐసీఐ బ్యాంకు, ఎల్ అండ్ టీ, ఐటీసీ, సిప్లా, భారతీ ఇన్ఫ్రాటెల్, టెక్ మహీంద్రా, టాటా స్టీల్ నష్టాల బాటలో పయనిస్తున్నాయి.
ఆసియా మార్కెట్లు
అమెరికా-చైనా వాణిజ్య ఒప్పందంపై ఆశలతో..ఆసియా మార్కెట్లు నిక్కీ, హాంగ్‌సెంగ్, కోస్పీ, షాంగై కాంపోజిట్ లాభాల్లో కొనసాగుతున్నాయి. వాల్‌స్ట్రీట్ నిన్న లాభాలతో ముగిసింది.
రూపాయి విలువ
ప్రస్తుతం రూపాయి విలువ 6 పైసలు పెరిగి ఒక డాలరుకు రూ.71.43గా ఉంది.
ముడిచమురు
అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు ధర 0.24 శాతం తగ్గింది. ప్రస్తుతం బ్యారెల్ ధర 63.06 డాలర్లుగా ఉంది.