సాంకేతిక రంగంతో పాటు ఆర్థిక రంగ షేర్లు ఇచ్చిన ఊతంతో స్టాక్ మార్కెట్లు నేడు భారీ లాభాలతో ముగిశాయి. ఉదయం స్వల్ప లాభాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్లు... మిడ్ సెషన్ నుంచి భారీగా పుంజుకున్నాయి.
బొంబాయి స్టాక్ ఎక్స్చేంజి సూచీ-సెన్సెక్స్ 412.84 పాయింట్లు బలపడి 38,545.72 పాయింట్ల వద్ద స్థిరపడింది.
జాతీయ స్టాక్ ఎక్స్చేంజి సూచీ-నిఫ్టీ 124.95 పాయింట్ల లాభంతో 11,570 పాయింట్ల వద్ద ముగిసింది.
ఇదీ కారణం
వచ్చే నెల మొదటి వారంలో ఆర్బీఐ బోర్డు సమావేశం జరగనుంది. ఇందులో కీలక వడ్డీ రేట్లు తగ్గిస్తుందనే అంచనాలతో మదుపరులు కొనుగోళ్ల వైపు మొగ్గు చూపారు. వీటికి తోడు వచ్చే నెల నుంచి కంపెనీలు ప్రకటించబోయే వార్షిక ఫలితాలపై అంచనాలు కూడా లాభాలకు మరో కారణం. రూపాయి బలహీన పడిన కారణంగా... మదుపరులు ఐటీ రంగంలో పెట్టుబడులపై ఆసక్తి చూపారు.
ఇంట్రాడే సాగిందిలా..
సూచీ | గరిష్ఠం | కనిష్ఠం |
సెన్సెక్స్ | 38,593.65 | 38,148.65 |
నిఫ్టీ | 11,588.50 | 11,452.45 |
లాభానష్టాల్లోనివివే...
సెన్సెక్స్‌లో నేడు అత్యధికంగా హెచ్‌సీఎల్‌టెక్ 3.84 శాతం లాభపడింది.ఎస్బీఐ 3.36 శాతం, యస్ బ్యాంకు 2.71 శాతం, యాక్సిస్ బ్యాంకు 2.64 శాతం, సన్‌ఫార్మా 2.49 శాతం, ఐటీసీ 2.39 శాతం మేర లాభాలను ఆర్జించాయి.
టాటా స్టీల్ అధికంగా 1.73 శాతం నష్టపోయింది. ఓఎన్జీసీ 1.65 శాతం, బజాజ్ ఆటో 1.53 శాతం, పవర్ గ్రిడ్ 1.20 శాతం, ఎన్టీపీసీ 0.80 శాతం, ఎం అండ్ ఎం 0.71 శాతం నష్టాలను నమోదుచేశాయి.
30 షేర్ల ఇండెక్స్‌లో 23 షేర్లు లాభాలను నమోదు చేయగా... 7 షేర్లు నష్టాల్లో ముగిశాయి.
రూపాయి
ఈ రోజు సెషన్లోనే 11 పైసలు కోల్పోయింది రూపాయి. డాలర్‌తో రూపాయి మారకం విలువ 68.99 గా ముగిసింది.