వరుసగా ఏడో సెషన్లోనూ స్టాక్ మార్కెట్లు లాభాలతో ముగిశాయి. సెన్సెక్స్ 268 పాయింట్ల లాభంతో 38వేల 218 వద్ద ముగియగా, నిఫ్టీ 70 పాయింట్ల వృద్ధితో 11,543 వద్ద ముగిసింది.
ట్రేడింగ్ సాగిందిలా:
స్వల్ప లాభాలతో ప్రారంభమైన దేశీయ సూచీలు... అమెరికా ఫెడ్ రిజర్వ్ కమిటీ సమావేశ ప్రభావంతో కొంత మేర మందగించాయి. తరువాత కోలుకుని లాభాలతో ముగిశాయి.
లాభాలకు కారణాలివే:
⦁ సార్వత్రిక ఎన్నికల అనంతరం స్థిరమైన ప్రభుత్వం ఏర్పడుతుందనే ఊహాగానాలు.
⦁ స్థిరాస్తి రంగానికి చేయూతగా నిర్మాణంలో ఉన్న ఇళ్లపై జీఎస్టీ రేట్లు తగ్గించడానికి జీఎస్టీ మండలి ఆమోద ముద్ర వేసింది.
⦁ ఆసియా మార్కెట్ల లాభాలు సైతం దేశీయ సూచీలపై ప్రభావం చూపాయి.
⦁ ఆరు నెలల గరిష్టానికి వడ్డీ రేట్లు పెంచుతూ ఫెడరల్ రిజర్వ్ కమిటీ ఈ వారం నిర్ణయం తీసుకుంటుందనే అంచనాలు.
ఈ కారణాలతో పెట్టుబడి దారులు కొనుగోళ్లు జరిపారు.
సంవత్సరం పాటు ఇదే జోరు:
మరో సంవత్సరం పాటు మార్కెట్లు లాభాల జోరునే కొనసాగిస్తాయని ప్రఖ్యాత బ్రోకరేజ్ సంస్థ గోల్డ్ మ్యాన్ శాక్స్ అంచనా వేసింది. సార్వత్రిక ఎన్నికలు, ఆ తర్వాత స్థిరమైన ప్రభుత్వం ఏర్పడుతుందనే ఊహాగానాలే దీనికి కారణమని పేర్కొంది. విదేశీ నిధుల ప్రవాహం అధికంగా ఉండే అవకాశముందని తెలిపింది. 1996 నుంచి ఎన్నికలు జరుగుతున్న ప్రతిసారి మార్కెట్లు లాభాల్లో ట్రేడవుతున్న విషయాన్ని గుర్తు చేసింది గోల్డ్ మ్యాన్ శాక్స్.