వరుసగా రెండు రోజుల నష్టాల నుంచి తేరుకుని గురువారం సరికొత్త రికార్డు స్థాయి వద్ద స్థిరపడ్డాయి స్టాక్ మార్కెట్లు. బీఎస్ఈ-సెన్సెక్స్ 222 పాయింట్ల వృద్ధితో జీవనకాల గరిష్ఠమైన 51,531 వద్దకు చేరింది. ఎన్ఎస్ఈ-నిఫ్టీ 67 పాయింట్లు బలపడి నూతన రికార్డు స్థాయి అయిన 15,173 వద్దకు చేరింది.
హెవీ వెయిట్ షేర్ల దన్ను, అంతర్జాతీయ మార్కెట్ల సానుకూలతలు లాభాలకు ప్రధాన కారణంగా తెలుస్తోంది. జనవరిలో వాహన విక్రయాలు పెరిగినట్లు సియామ్ నివేదికలో వెల్లడైన నేపథ్యంలో ఆటో షేర్లు సానుకూలంగా స్పందించాయి.
ఇంట్రాడే సాగిందిలా..
సెన్సెక్స్ 51,554 అత్యధిక స్థాయిని తాకింది. ప్రారంభంలో నమోదైన నష్టాలతో 51,157 పాయింట్ల అత్యల్ప స్థాయినీ నమోదు చేసింది.
నిఫ్టీ 15,188 పాయింట్ల గరిష్ఠ స్థాయి, 15,065 పాయింట్ల కనిష్ఠ స్థాయిల మధ్య కదలాడింది.
లాభనష్టాల్లోనివి ఇవే..
రిలయన్స్ ఇండస్ట్రీస్ (4 శాతం పైనే), సన్‌ఫార్మా, పవర్‌గ్రిడ్, బజాజ్ ఆటో, నెస్లే, హెచ్‌సీఎల్‌టెక్ షేర్లు లాభాల్లో ప్రధానంగా ఉన్నాయి.
టైటాన్, ఎల్&టీ, ఓఎన్జీసీ, హెచ్డీఎఫ్సీ, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఐటీసీ షేర్లు నష్టపోయాయి.
ఇతర మార్కెట్లు
ఆసియాలో ఇతర ప్రధాన మార్కెట్లలో.. హాంకాంగ్ సూచీ లాభాలను గడించింది. షాంఘై, టోక్యో, సియోల్ మార్కెట్లకు సెలవు.
ఇదీ చదవండి:కొత్త ఏడాదిలో జోరుగా వాహన విక్రయాలు