Stock Buyback: కంపెనీ గతంలో జారీ చేసిన వాటాలను.. ఇప్పుడు తిరిగి తానే కొనుగోలు చేయడమే షేర్ల బైబ్యాక్. సెబీ సెక్యూరిటీస్ బైబ్యాక్ నిబంధనలు ఈ ప్రక్రియను నియంత్రిస్తాయి. ప్రస్తుత వాటాదారుల నుంచి నిర్ణీత కాలంలో నిర్దేశించిన ధరకు కంపెనీ వాటాలను కొనుగోలు చేస్తుంది. ఇది ఒక కార్పొరేట్ చర్యగా చెప్పుకోవచ్చు. సహజంగా మార్కెట్ ధరకంటే నిర్దేశించిన ధర ఎక్కువగా ఉంటుంది. 2021లో 42 కంపెనీలు బైబ్యాక్ నిమిత్తం సుమారు రూ.14,341 కోట్లు వెచ్చించాయి. 2022లో ఇప్పటివరకూ 9 కంపెనీలు షేర్ల బైబ్యాక్‌ను ప్రకటించి రూ.19,525 కోట్లను కేటాయించాయి. టాటా కన్సల్టెన్సీ (టీసీఎస్), మొయిల్, జీఈ షిప్పింగ్, అజంతా ఫార్మా ఇందులో ఉన్నాయి. కంపెనీల లాభాలు మరింత మెరుగయ్యే అంచనాల నేపథ్యంలో పలు కంపెనీలు రానున్న రోజుల్లో షేర్ల బైబ్యాక్ ద్వారా తమ వాటాదారులకు మరింత ప్రతిఫలాన్ని పంచే వీలుంది.
వ్యూహాత్మకంగా
- తమ కంపెనీ షేరు వాస్తవిక విలువకన్నా తక్కువకు మార్కెట్లో ఉందని కంపెనీలు భావించినప్పుడు, షేర్ ధరకు మద్దతు ఇవ్వడానికి ప్రయత్నిస్తుంటాయి. దీనికోసం కొన్ని కంపెనీలు షేర్ల బైబ్యాక్‌ను ప్రకటిస్తుంటాయి. దీనివల్ల మార్కెట్లో కంపెనీ షేర్ల సంఖ్య తగ్గి, ఉన్న షేర్ల ధరకు మద్దతు లభిస్తుందని చెప్పొచ్చు.
- కొన్ని కంపెనీలు తమ వద్ద నిరుపయోగంగా ఉన్న మిగులు మొత్తాల నుంచి వాటాదారులకు ప్రతిఫలం ఇచ్చేందుకు బైబ్యాక్ మార్గాన్ని ఎంచుకుంటాయి.
- యాజమాన్య నియంత్రణ వాటా పెంచుకోడానికీ... ఇతర వ్యక్తులు, సంస్థలు కంపెనీలో పైచేయి సాధించకుండా.. తదితర ఆలోచనలతోనూ యాజమాన్యాలు రక్షణాత్మకంగా బైబ్యాక్‌ను చేస్తుంటాయి.
- కంపెనీ ఆర్థిక ఆరోగ్యాన్ని, తమ వ్యాపారంపై ఉన్న నమ్మకాన్ని పెట్టుబడిదారులకు తెలియజేసేందుకూ దీన్ని ఉపయోగించుకుంటారు.
- బైబ్యాక్ ద్వారా మంచి రాబడిని అందుకోవడంతోపాటు, వాటాదార్లు మూలధన లాభంపై పన్ను మినహాయింపును పొందే వీలుంటుంది. కంపెనీలు మాత్రం బైబ్యాక్ ట్యాక్స్‌ను చెల్లించాలి.
రెండు విధానాల్లో
stock buyback rules: షేర్ల బైబ్యాక్ కోసం కంపెనీలు రెండు మార్గాలను ఎంచుకుంటాయి.
- టెండర్ ఆఫర్: కంపెనీ ఒక ధరను నిర్ణయించి గడువు తేదీని ప్రకటిస్తుంది. అర్హులైన వాటాదారులు బైబ్యాక్ నిష్పత్తి ప్రకారం తమ షేర్లను కంపెనీకి ఇవ్వడానికి బ్రోకర్ ద్వారా గడువు లోపు టెండర్ ఆఫర్ చేయొచ్చు. టెండర్ ఆఫర్ 10 పనిదినాల వరకూ తెరిచి ఉంటుంది.
- ఓపెన్ మార్కెట్: స్టాక్ ఎక్స్ఛేంజీ లేదా బుక్‌బిల్డింగ్ ఏదైనా ఒక పద్ధతిలో కంపెనీ దీనిని చేస్తుంది. ఓపెన్ మార్కెట్ మార్గంలో యాజమాన్యం పాల్గొనదు. కంపెనీ ప్రతిపాదించిన గరిష్ఠ ధర వరకూ నిర్దేశించుకున్న షేర్లను, నిర్ణీత గడువు లోపు స్టాక్ మార్కెట్ నుంచి కొనుగోళ్లు నిర్వహిస్తూ దీన్ని పూర్తి చేస్తారు. స్టాక్ ఎక్స్ఛేంజీల ద్వారా జరిగే బైబ్యాక్ గరిష్ఠంగా 6 నెలల వరకూ అందుబాటులో ఉంటుంది.
- బైబ్యాక్ విధానంలో వాటాదారులు తమ వద్ద ఉన్న షేర్లలో ఎన్నింటిని ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు.. షేర్లలో కంపెనీ ఆమోద నిష్పత్తి ఏ విధంగా ఉంటుందనే దానిని బట్టి, వారివారి లాభార్జన ఉండవచ్చు. రూ.2లక్షల లోపు షేర్లు ఉన్నవారు రిటైల్ పెట్టుబడిదారులు. బైబ్యాక్ పరిమాణంలో 15 శాతం వాటాను తప్పనిసరిగా రిటైల్ పెట్టుబడిదారులకే కేటాయించాలని సెబీ నిబంధన. దీని ప్రకారం అనుమతించే నిష్పత్తి ఎక్కువగానే కలిసి రావచ్చు.
వాటాదార్లకు
- మార్కెట్ ధరతో పోల్చినప్పుడు బైబ్యాక్ ధర ఎక్కువగా ఉంటుంది. కాబట్టి, అధిక ధరకు షేర్లను విక్రయించే అవకాశం లభిస్తుంది.
బైబ్యాక్ తర్వాత షేర్ల సంఖ్య తగ్గుతుంది. ఎర్నింగ్ పర్ షేర్ (ఈపీఎస్), రిటర్న్ ఆన్ నెట్‌వర్త్ (ఆర్‌ఓఎన్‌డబ్ల్యూ)లాంటి రాబడి నిష్పత్తులు, వాటాదారులకు అస్తులు మొదలైనవి పెరుగుతాయని చెప్పొచ్చు. - షేర్ల టెండర్ ఆఫర్ మార్గం ద్వారా బైబ్యాక్ ఇస్తే.. రాగల మూలధన లాభాలపై పన్ను మినహాయింపు పొందవచ్చు. ఈ అంశంలో మూలధన నష్టం వస్తే సర్దుబాటు చేసేందుకు వీలుండదు. ఓపెన్ మార్కెట్ ఆఫర్‌లో షేర్లను విక్రయిస్తే ఈక్విటీ మూలధన రాబడి పన్ను వర్తిస్తుంది.
ఏం చేయాలి?
- బైబ్యాక్‌లో పాల్గొనాలా? వద్దా? అనేది మదుపరుల ఇష్టమే. ఉన్న ధర కంటే బైబ్యాక్ ధర ఎక్కువనిపిస్తే మొగ్గు చూపొచ్చు. షేర్ల ధర వృద్ధి చాలా ఆశాజనకంగా ఉంటుందనీ, భవిష్యత్ రాబడితో పోల్చి చూసినప్పుడు బైబ్యాక్ ఆకర్షణీయం కాదని భావిస్తే షేర్లను అట్టిపెట్టుకోవచ్చు.
- మీ వద్ద ఉన్న మొత్తం షేర్లలో ఎన్ని బైబ్యాక్‌లో ఇవ్వాలో నిర్ణయించుకోవాలి. బైబ్యాక్ వివరాలను, సూచనలను క్షుణ్నంగా చదవాలి. పూర్తి వివరాలతో దరఖాస్తును నిర్ణీత గడువులోపు మీ బ్రోకరుకు, కలెక్షన్ సెంటర్‌కు అందేలా చూడాలి.
- మీకు బైబ్యాక్ ఆఫర్ లెటర్ అందకపోతే మర్చంట్ బ్యాంకర్ లేదా రిజిస్ట్రార్‌ను సంప్రదించాలి.
- బైబ్యాక్ ద్వారా 'అధిక విలువ', పన్ను ప్రయోజనం వాటాదారులకు కలిసివచ్చే అంశాలు.
- షేర్ల ధరలను మార్కెట్ హెచ్చుతగ్గులు, గిరాకీ-సరఫరాలోని ఎన్నో అంశాలు ప్రభావితం చేస్తుంటాయి. బైబ్యాక్ ద్వారా కొనుగోళ్ల మద్దతు కొంతకాలానికి ఉపయోగపడొచ్చు. స్టాక్ ఎక్స్ఛేంజీల ద్వారా కంటే టెండర్ ఆఫర్ బైబ్యాక్‌లోనే మదుపరులకు ప్రయోజనమని చెప్పొచ్చు.
"కంపెనీ లక్ష్యాలు, యాజమాన్యం, ఆర్థిక స్థితి, ఇతర అంశాలన్నీ లెక్కలోకి తీసుకొని, బైబ్యాక్ ఆకర్షణీయం అనుకుంటే సరే అనొచ్చు. దీర్ఘకాలిక మదుపరులు, రాబోయే రాబడి ఫలాల్ని అంచనా వేస్తూ పెట్టుబడుల్లో కొనసాగవచ్చు. బైబ్యాక్ ఆఫర్ ధరతోపాటు, కంపెనీ ప్రస్తుత, భవిష్యత్ పనితీరును పరిగణనలోనికి తీసుకోవాలి. నష్టభయ సామర్థ్యం, పెట్టుబడి కాల వ్యవధి, ఆశించే రాబడి మొదలైన వాటినీ అంచనా వేస్తూ సరైన నిర్ణయం తీసుకోవాలి."
- జాగర్లమూడి వేణుగోపాల్, జెన్ మనీ
ఇదీ చూడండి: Future Retail News: ఫ్యూచర్ రిటైల్ ఆస్తులకు బహిరంగ బిడ్డింగ్!