కరోనా సంక్షోభంతో డీలాపడ్డ ఆర్థిక వ్యవస్థకు ఊతమిచ్చేందుకు రాష్ట్రాలు రూ.20లక్షల కోట్లతో ముందుకు రావాలని కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు. పబ్లిక్-ప్రైవేటు పెట్టుబడుల నుంచి మరో రూ. 10కోట్లు పొందాలని పేర్కొన్నారు.
ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించిన రూ. 20లక్షల కోట్ల ఆర్థిక ప్యాకేజీకి.. రాష్ట్రాల నుంచి వచ్చే మొత్తాన్ని కలిపితే రూ.50 లక్షల కోట్లు అవుతుందని అభిప్రాయపడ్డారు గడ్కరీ. ఆర్థిక వ్యవస్థపై పడిన ప్రతికూల ప్రభావాన్ని తొలగించేందుకు ఇది ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు.
ఆర్థిక వ్యవస్థ తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటుందని, వ్యాపారాలు మూతపడుతున్నాయని, నిరుద్యోగం పెరిగిపోతోందని గడ్కరీ పేర్కొన్నారు. సమాజంలోని అన్ని రంగాలూ తీవ్రంగా నష్టపోతున్నప్పటికీ... కరోనాపై పోరులో భారత దేశం కచ్చితంగా విజయం సాధిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
రహదారులు ఇలా...
యుద్ధ ప్రాతిపదికన జాతీయ రహదారుల పనులు చేపట్టినట్టు తెలిపిన గడ్కరీ.. వచ్చే రెండేళ్లల్లో రూ. 15లక్షల కోట్లు విలువ చేసే రహదారులను నిర్మించేందుకు ప్రభుత్వం ప్రణాళికలు రచిస్తోందన్నారు గడ్కరీ . 80శాతం ప్రాజెక్టుల్లో పనులు ప్రారంభమయ్యాయని పేర్కొన్నారు.
రానున్న వాన కాలాన్ని దృష్టిలో పెట్టుకుని నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా(ఎన్హెచ్ఏఐ) ఇప్పటికే ప్రాంతీయ అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. రహదారులు దెబ్బతినకుండా చర్యలు చేపట్టాలని సూచించింది.