దేశీయ అంతరిక్ష రంగంపై అంకురాలు ఆసక్తి చూపుతున్నాయని భారత అంతరిక్ష పరిశోధ సంస్థ (ఇస్రో) ఛైర్మన్ కె.శివన్ తెలిపారు. పెద్ద సంస్థలు ఇందులోకి రావాల్సి ఉందని అభిప్రాయపడ్డారు.
ఇస్రో రెండో రాకెట్ ప్రయోగ కేంద్రం భూ సేకరణ ప్రక్రియ గురించి మీడియాతో మాట్లాడుతూ ఈ విషయాలు వెల్లడించారు శివన్.
రెండో రాకెట్ ప్రయోగ కేంద్రం..
ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల్లోని అంతరిక్ష పరిశోధన సంస్థలకు ఒకటికి మించి.. రాకెట్ ప్రయోగ కేంద్రాలు ఉన్నాయి. ఇస్రోకు మాత్రం ఆంధ్రప్రదేశ్లోని శ్రీహరికోటలో ఒకే రాకెట్ ప్రయోగ కేంద్రం ఉంది. ఇందులో రెండు లాంచ్ ప్యాడ్లు ఉన్నాయి. ఈ నేపథ్యంలో మరో కేంద్రం ఏర్పాటుకు సన్నాహాలు చేస్తోంది ఇస్రో. ఇందుకోసం తమిళనాడు తూత్తుకుడి జిల్లా కులశేఖర పట్టణంలో భూ సేకరణ జరుగుతున్నట్లు శివన్ తెలిపారు. ఇందుకు 2,300 ఎకరాల భూమి అవసరమవుతుందని వెల్లడించారు. భూ సేకరణ పనులు పూర్తవ్వగానే ఇతర పనులు ప్రారంభిస్తామన్నారు.
ప్రైవేటుకు అనుమతి..
అంతరిక్ష రంగంలో ప్రైవేటు సంస్థలకు అనుమతినిస్తూ కేంద్రం ఇటీవల నిర్ణయం తీసుకుంది. రాకెట్లు-ఉపగ్రహాల తయారీ, ఇతర సర్వీసుల్లో ప్రైవేటు సంస్థలు పెట్టుబడి పెట్టేందుకు అనుమతినిచ్చింది. ఈ నేపథ్యంలో అంతరిక్ష రంగంపై అంకుర సంస్థలు ఎక్కువగా ఆసక్తి చూపుతున్నట్లు చెప్పారు శివన్.
ప్రైవేటు సంస్థలు ఎందుకు?
ప్రపంచ అంతరిక్ష రంగం మార్కెట్ విలువ 352 బిలియన్ డాలర్లుగా ఉంది.. అందులో భారత్ వాటా 3 శాతం వరకు మాత్రమే ఉన్నట్లు శివన్ చెప్పుకొచ్చారు. అయితే ఇస్రో ఒంటిరిగా ఉంటే.. ప్రపంచ అంతరిక్ష రంగంలో భారత భాగస్వామ్యం పెంచుకోవడం కుదరదన్నారు. అందుకే ప్రైవేటు సంస్థల పెట్టుబడులు అహ్వానిస్తున్నట్లు వెల్లడించారు.
350 బిలియన్ డాలర్ల అంతరిక్ష రంగం వాటాలో.. రాకెట్ ప్రయోగ సేవల వాటా 2 శాతం, ఉపగ్రహాల తయారీ వాటా 5 శాతం, స్పేస్ అప్లికేషన్స్ సర్వీసుల వాటా 45 శాతం, గ్రౌండ్ ఎక్విప్మెంట్ వాటా 48 శాతం ఉన్నట్లు శివన్ వివరించారు.
ఇదీ చూడండి:ఆర్థికం తెలియకున్నా.. అందులోనూ తనదైన ముద్ర