హ్యూమనాయిడ్ రోబో సోఫియా మరోసారి వార్తల్లో నిలిచింది. సోఫియా గీసిన ఓ చిత్రం ఎన్‌ఎఫ్‌టీ (నాన్ ఫంజిబుల్ టోకెన్) వేలంలో రూ.5 కోట్లకు (దాదాపు 7 లక్షల డాలర్లు) అమ్ముడైంది. కృత్రిమ మేథతో గీసిన ఓ చిత్రం వేలంలో అమ్మడం ఇదే ప్రథమం.
ఎలాన్ మస్క్ చిత్రం గీసిన సోఫియా..
ఇటలీకి చెందిన డిజిటల్ ఆర్టిస్ట్ ఆండ్రియా బొనాస్సిటో వద్ద మెళకువలు నేర్చుకుని ప్రపంచ ప్రముఖుల చిత్రాలను గీస్తోంది సోఫియా. వాటిని ఎన్‌ఎఫ్‌టీ రూపంలో వేలం వేస్తున్నారు. ఈ చిత్రాలను డిజిటల్ సంతకంలా బ్లాక్ చెయిన్ లెడ్జెర్స్‌లో భద్రపరుస్తారు. వేలంలో సోఫియా చిత్రాన్ని కొన్నవారికి అధికారిక హక్కులు వర్తిస్తాయి. టెస్లా సీఈఓ ఎలాన్ మస్క్ చిత్రం, స్వీయ చిత్రాన్ని కూడా సోఫియా గీసింది.
తన చిత్రాలపై సోఫియా స్పందన..
తన చిత్రాన్ని సోఫియా ఇన్‌స్టాంటియేషన్ అని పిలుస్తోంది. ట్రాన్స్‌ఫార్మర్ నెట్‌వర్క్స్, జెనెటిక్ అల్గారిథమ్స్‌ను ఉపయోగించి తాను చిత్రాలను గీస్తున్నానని సోఫియా వెల్లడించింది. తన చిత్రకళను ప్రపంచం ఆస్వాదిస్తోందని పేర్కొంది.
హాంకాంగ్‌కు చెందిన హాన్సన్ రోబోటిక్ సంస్థ ఈ హ్యూమనాయిడ్ రోబో (సోఫియా)ను రూపొందించింది. 2016 ఫిబ్రవరి 14 ఈ రోబోను ఆవిష్కరించింది. 2017లో సౌదీ ప్రభుత్వం సోఫియాకు అధికారికంగా పౌరసత్వం కూడా ఇచ్చింది. మ్యుజీషియన్, ఫ్యాషన్ డిజైనర్, సింగర్, మోటివేటర్‌గానూ సోఫియాకు గుర్తింపు ఉంది.
ఇదీ చదవండి:ట్వీట్లు.. ఫీట్లు.. అమ్మితే కోట్లు!