గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ నిరుడు ‘డిజిటల్ వెల్‌బీయింగ్’ ప్రచారాన్ని ప్రారంభించారు. అందులో భాగంగానే ఇప్పుడు ఈ యాప్‌ను గూగుల్ ఆవిష్కరించింది. నిజానికి ఇప్పటికే పలు అప్లికేషన్లనూ, పై (ఆండ్రాయిడ్ 9), ఆండ్రాయిడ్ 10 ఆపరేటింగ్ సిస్టమ్స్‌ను డిజిటల్ ఆరోగ్యదాయకంగా రూపొందించింది. పేపర్ ఫోన్‌తో మరో ముందడుగేసింది.
దీంతో లాభమేంటి?
ఫోన్‌ను చేతపట్టుకుని దాన్నో కంట కనిపెడుతూ, ఎక్కడా మర్చిపోకుండా జాగ్రత్త పడుతూ... మన పనుల్ని మనం చేసుకోవడం ‘డిజిటల్ ఒత్తిడి’గా మారిపోయింది. మరి ఫోన్ చేతిలో లేకపోయినా, దానితో కలిగే ప్రయోజనాలన్నీ మనతోనే ఉంటే? సరిగ్గా ఇదే ఆలోచించింది గూగుల్. ఈ యాప్‌లో ఏ రోజుకారోజు మనకు అవసరమైన వ్యక్తుల ఫోన్ నంబర్లు, మ్యాప్‌లు, సమావేశాల వివరాలు గట్రా ఎంపిక చేసుకుంటే చాలు. అది మనకో పర్సనల్ బుక్‌లెట్ తయారుచేసి ఇస్తుంది. దీన్ని కావాలంటే ప్రింట్ తీసుకోవచ్చు. లేదంటే పీడీఎఫ్ రూపంలో దాచుకోవచ్చు. అన్నట్టు మరో విషయం. రోజంతా పనిలోనే మునిగిపోతే బోర్ కొట్టదూ! అందుకే... పజిల్స్, సుడోకు వంటి వాటిని కూడా ఈ డాక్యుమెంట్‌లో మీరు జత చేసుకోవచ్చు. తీరిక చిక్కినప్పుడు వాటిని పూర్తి చేయడం ద్వారా మెదడుకు పదునూ పెట్టుకోవచ్చు. ఈ డాక్యుమెంట్‌ను దగ్గర పెట్టుకుంటే... ఇక ఆ రోజు ఫోన్‌ను దూరం పెట్టేసి మనం చేయాల్సిన పనులపై పూర్తిస్థాయిలో దృష్టి సారించవచ్చు. ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టం ఆధారంగా పనిచేసే ఈ యాప్‌ను గూగుల్ ప్లే స్టోర్ నుంచి ఉచితంగా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఐటీ నిపుణుల కోసం ఈ యాప్ కోడ్‌ను ‘జిట్‌హబ్’లో పెట్టింది గూగుల్. పేపర్ ఫోన్‌ను లండన్ కేంద్రంగా పనిచేసే ‘స్పెషల్ ప్రాజెక్ట్స్’ డిజిటల్ స్టూడియో అభివృద్ధి చేసింది.
ఇప్పటికే ఐదు...
‘డిజిటల్ ఆరోగ్య పరిరక్షణ’లో భాగంగా ఇప్పటికే ఐదు యాప్‌లను గూగుల్ అందుబాటులోకి తెచ్చింది. ఇవన్నీ మన సమయాన్ని ఆదా చేసి, చేయాల్సిన పనిలో నిమగ్నం కావడానికి, మనకు అవసరమైన యాప్‌లను అందుబాటులో ఉంచడానికి ఉద్దేశించినవే. గూగుల్ ప్లేస్టోర్ నుంచి వీటిని ఉచితంగా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
అన్‌లాక్ క్లాక్
ఇది సెల్‌ఫోన్ తెరపై ఉండే వాల్‌పేపర్. మనం ఫోన్‌ని ఎన్నిసార్లు అన్‌లాక్ చేస్తున్నామన్నది లెక్కపెట్టి మనకు ఎప్పటికప్పుడు చెప్పేస్తుంది. తద్వారా రోజూ మనం ఫోన్‌ను ఎన్నిసార్లు చూస్తున్నామో తెలుసుకుని జాగ్రత్త పడొచ్చు.
పోస్ట్ బాక్స్
మనకు వివిధ రూపాల్లో వచ్చే సందేశాలన్నింటినీ ఒక్క చోట చేర్చే యాప్. నిర్ణీత సమయం వరకూ సందేశాలను దాచిపెడుతుంది. తర్వాత మనం వాటిని చదువుకోవచ్చు.
వి ఫ్లిప్
చుట్టూ జనం ఉన్నప్పుడు ఫోన్‌లో నిమగ్నం కాకుండా మన ఫోన్ వాడకం సమయాన్ని తగ్గిస్తుంది.
డిసెర్ట్ ఐలాండ్
మనకు ముఖ్యమైన మెయిల్స్, నోట్ టేకింగ్, యాప్‌లు ఏమిటన్నది గుర్తించి, వాటిని షార్ట్‌కట్ రూపంలో మనకు అందిస్తుంది. దీంతో మిగతా యాప్‌ల జోలికి అనవసరంగా వెళ్లే పనుండదు.
మార్ఫ్: సరైన సమయంలో సరైన అప్లికేషన్ నినాదంతో తీసుకొచ్చిన యాప్ ఇది. స్థలం, కాలం, పనులకు అనుగుణంగా... మనకు ఎప్పుడేం యాప్‌లు అవసరమో వాటిని అందుబాటులో ఉంచడం ఈ అప్లికేషన్ ప్రత్యేకత.
ఇదీ చూడండి : 'చమురు రంగంలో 100 బిలియన్ డాలర్ల పెట్టుబడులు'