నేటి కాలంలో డబ్బుకు ఎంతో విలువ వుంది. ఎందుకంటే డబ్బు లేకుండా ఏ పనీ జరగదు. ఎన్ని కాలాలు మారినా, డబ్బు అవసరం తీరదు. డబ్బు ఉంటే సుఖ సౌకర్యాలు పొందొచ్చు. ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. ఈ విషయం తెలియని వారు లేరు.
అయినా, సంపాదించిన సొమ్ములో ఎంత మొత్తం ప్రస్తుత అవసరాలకు ఖర్చు చేస్తున్నాం; భవిష్యత్ అవసరాలకోసం ఎంత దాచి పెడుతున్నాం అని చూసుకోవాలి. ఎందుకంటే భవిష్యత్లో కూడా ఇలాగే, ఇంతకన్నా ఎక్కువ సంపాదిస్తామన్న హామీ ఏమీ లేదు. ఉమ్మడి కుటుంబాలు తగ్గిపోవడం, ఉద్యోగ రీత్యా వేరు వేరు ప్రదేశాలలో ఉండడం వల్ల తల్లిదండ్రుల నుంచి దూరంగా ఉంటున్నాం. చిన్న కుటుంబాల అవసరాలు, ఖర్చులు పెరుగుతున్నాయి. అందువల్ల దీర్ఘకాలం పాటు ఆనందకరమైన జీవితానికి కొన్ని పద్ధతులు పాటించడం ఎంతో అవసరం, ముఖ్యం. అవేమిటో చూద్దాం:
బడ్జెట్..
నెలసరి ఆదాయం, ఖర్చులను రాసుకోవాలి. అలాగే కొన్ని ఖర్చులు ఆరునెలలకు లేదా ఏడాదికి ఒకసారి ఉంటాయి. ఉదాహరణకు దూర ప్రయాణాలు, బట్టల కొనుగోలు, బీమా ప్రీమియం వంటివి. ముందుగా ఒక ఏడాదికి తగిన బడ్జెట్ వేసుకోవాలి. వీలయితే రాబోయే రెండు మూడు ఏళ్లకు కూడా వేసుకుంటే మరింత స్పష్టత వస్తుంది. ఇవి వినడానికి, నోటి లెక్కలు వేయడానికి తేలికగా అనిపించినా , రాసి పెడితేగానీ నిజానిజాలు అనుభవంలోకి రావు.
టర్మ్ జీవిత బీమా..
మారుతున్న జీవన ప్రమాణాలు, విధానాలు, మనిషి జీవితాన్ని కొంత అనిశ్చితికి గురిచేస్తున్నాయి. సంపాదించేవ్యక్తికి ఏమైనా జరిగి, సంపాదన కోల్పోతే ఆ కుటుంబం అనేక ఆర్థిక ఇబ్బందులకు గురికావాల్సి వస్తుంది. కుటుంబానికి ఆర్థిక రక్షణగా టర్మ్ జీవిత బీమా తీసుకోవడం ఎంతో ముఖ్యం. టర్మ్ పాలసీని వార్షిక ఆదాయానికి కనీసం 10-15 రెట్లు బీమా హామీ ఉండేలా చూసుకోవాలి. సంపాదించే వ్యక్తికీ 60 ఏళ్ళు వచ్చే దాక పాలసీని కొనసాగించాలి.
ఆర్థిక లక్ష్యాలు..
ప్రతి వ్యక్తికి, కుటుంబానికి కొన్ని ఆర్థిక లక్ష్యాలు ఉంటాయి. అవి ప్రతి ఒక్కరికి వేరు వేరుగా ఉంటాయి. వీటిని స్వల్ప, మధ్య, దీర్ఘకాలిక లక్ష్యాలుగా గుర్తించడం. అందుకుతగిన మదుపు పథకాలను ఎంచుకోవడం, చిన్న వయసు నుంచే కొద్ది మొత్తంతోనైనా మదుపు ప్రారంభించడం.
ఉదాహరణకు పిల్లల ఉన్నత చదువులు, వారి వివాహాలు, ఇల్లు కొనుగోలు చేయడం, దేశ విదేశాలలో విహార యాత్రలు, పదవీవిరమణ అనంతరం కూడా ఆదాయం ఉండడం వంటివి.
అందరికి అన్ని లక్ష్యాలు గుర్తించడం కష్టం కాబట్టి, వీలైనంత త్వరగా మదుపు చేయడం. సమయానుకూలంగా పథకాలలో స్వల్ప మార్పులతో లక్ష్యాలను చేరుకోవడం.
పథకాలు..
పథకాలను ఎంచుకునేముందు లక్ష్యాలకు అనుగుణమైన వాటిని గుర్తించాలి. మనం చేసే ప్రతి పెట్టుబడి ముందు భద్రత, సమయానికి చేతికి సొమ్ము అందడం (లిక్విడిటీ), రాబడి, ఆర్థిక లక్ష్యం చేరుకోటానికి ఉన్న సమయం, మన రిస్క్ సామర్థ్యం, పన్ను ప్రభావం వంటి విషయాల గురించి క్షుణ్ణంగా తెలుసుకోవలసిన అవసరం ఎంతో ఉంది.
పీపీఎఫ్..
ఈ విధానం మధ్య, దీర్ఘకాలిక లక్ష్యాలకు మంచిది. ఉదాహరణకు పిల్లల పైచదువులు, ఇంటి కొనుగోలుకు డౌన్ పేమెంట్ , నెలవారీ చెల్లించాల్సిన ఈఎంఐ, పదవీవిరమణ నిధి వంటి వాటికి ఉపయోగించుకోవచ్చు.
ఎన్పీఎస్..
పదవీవిరమణ నిధిని సమకూర్చుకోవడానికి మంచిది. చిన్న వయసు నుంచే కొద్ది మొత్తంతోనైనా ప్రారంభించాలి. కొత్త సొమ్ము ఈక్విటీలలో మదుపు చేస్తారు కాబట్టి దీర్ఘకాలంలో మంచి రాబడి పొందొచ్చు.
ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్..
దీర్ఘకాలంలో అధిక రాబడినిచ్చేవి. వృత్తి నిపుణుల పర్యవేక్షణ, కనీస నిర్వహణ ఖర్చులు, తక్కువ పెట్టుబడి , పెట్టుబడులలో వైవిధ్యత , రిస్క్ సామర్థ్యాన్ని బట్టి ఫండ్ ఎంచుకునే అవకాశం, సెబీ నియంత్రణతో భద్రత వంటి కారణాల వల్ల ఇవి ఎంతో ప్రాచుర్యాన్ని పొందాయి.
చివరగా..
ధనవంతులు కావాలని అందరికి ఉంటుంది. అయినా అందరూ కాలేకపోతున్నారు. మంచి ఆలోచన, దాన్ని అమలు చేయడం, నిర్ణీత సమయానికి సమీక్షించడం, సమయానుకూలంగా అవసరమైన మార్పులు చేయడం వంటిని అమలుచేయక పోవడం. అనవసర ఖర్చులు తగ్గించుకోవడం, ఎక్కువ సొమ్మును మదుపు చేయడం అలవరచుకోవాలి. అవసరమైనప్పుడు వృత్తి నిపుణుల సహాయం తీసుకోవాలి. ఇంటర్నెట్ సదుపాయం ఉన్న ఈనాడు ఇది ఎంతో తేలిక. మీ భవిష్యత్ మీ చేతలలోనే ఉంటుంది.