Money Saving Tips: పొదుపు ప్రతి ఒక్కరి జీవితంలోనూ భాగం కావాలి. ఇక్కడ ఎంత సంపాదిస్తున్నామనేది ముఖ్యం కాదు. సంపాదించిన మొత్తంలో ఎంత పొదుపు చేస్తున్నామనేదే ముఖ్యం. కొంత మంది ఎక్కువ మొత్తంలో సంపాదించినా పొదుపు చేయడంలో విఫలమవుతుంటారు. సరైన ఆర్థిక నిర్వహణ ఉండదు. దీంతో డబ్బు కూడబెట్టకపోగా.. అప్పులు చేస్తుంటారు. సంపాదన తక్కువగా ఉన్నప్పటికీ.. ఖర్చులు తగ్గించుకుని ఎక్కువ మొత్తం పొదుపు కోసం కేటాయిస్తే.. సరైన ఆర్థిక ప్రణాళికతో దీర్ఘకాలంలో లక్ష్య సాధనకు కావాల్సిన సంపదను సృష్టించుకోవచ్చు. ఇందుకోసం నెలవారీగా చేసే పొదుపు, పెట్టుబడులపైనే కాకుండా రోజు వారీ ఖర్చుల నుంచి కూడా డబ్బును ఏ విధంగా పొదుపు చేయొచ్చో తెలుసుకోవాలి.
- ఆదాయం తక్కువే అయినా: వీలైనంత త్వరగా పొదుపు ప్రారంభించండి. సంపాదన ప్రారంభమైన కొత్తలో ఆదాయం తక్కువగా ఉండొచ్చు. అలాంటి సమయంలోనూ ఎంతో కొంత పొదుపు చేయడం వల్ల పొదుపును అలవాటుగా మార్చుకోవచ్చు. ఈ అలవాటు రేపటి రోజున మీ ఆదాయం పెరిగినప్పుడు అనవసర ఖర్చులకు పోకుండా పొదుపు చేసేందుకే మిమ్మల్ని ప్రేరేపిస్తుంది.
- ముందు పొదుపు.. తర్వాతే ఖర్చులు: సాధారణంగా వచ్చిన ఆదాయం నుంచి ఖర్చులు పోనూ మిగిలిన మొత్తాన్ని పొదుపు చేస్తుంటారు చాలామంది. అయితే, ఈ విధానం క్రమానుగత పొదుపును దెబ్బతీస్తుంది. ఒక నెలలో ఖర్చులు పెరిగితే.. ఆ నెల పొదుపు తగ్గిపోతుంది. అలా కాకుండా వచ్చిన ఆదాయం నుంచి మీరు ఎంత మొత్తాన్నైతే ప్రతి నెలా పొదుపు చేయాలనుకుంటున్నారో ముందుగా ఆ మొత్తాన్ని తీసి పక్కన పెట్టాలి. మిగిలిన మొత్తంతోనే ఖర్చులను సర్దుబాటు చేసుకోవాలి. అంటే ఇక్కడ ఆదాయం - పొదుపు = ఖర్చులు అనే సుత్రాన్ని అనుసరించాలి.
- బ్యాంకు ఖాతా చెక్ చేయండి: మనలో చాలా మందికి ఒకటి కంటే ఎక్కువ బ్యాంకు ఖాతాలుంటాయి. ఆ ఖాతాలను ఓ కంట కనిపెడుతూ ఉండాలి. నెలవారీగా స్టేట్‌మెంట్ తీసుకుని క్షుణ్ణంగా పరిశీలించాలి. ఏ కారణం చేతనైనా ఛార్జీలను వసూలు చేస్తున్నారేమో తెలుసుకోవాలి. కనీస నిర్వహణ రుసుము చెక్ చేసుకోవాలి. ఒకవేళ ఏమైనా ఛార్జీలు వర్తిస్తుంటే.. అవి పునరావృతం కాకుండా తగిన చర్యలు తీసుకొనేందుకు అవకాశం ఉంటుంది. నిరుపయోగంగా ఉన్న ఖాతాలను మూసివేయడం మంచిది.
- రిస్క్‌లను కవర్ చేయండి: ఆర్థికంగా మీపై ఆధారపడిన సభ్యులు ఉంటే.. టర్మ్ ప్లాన్ ద్వారా తగినంత కవరేజ్‌తో బీమా తప్పనిసరిగా తీసుకోవాలి. అలాగే కుటుంబ సభ్యలందరికీ ఆరోగ్య బీమా కవరేజ్ ఉండేలా చూసుకోండి. ఇవి తీసుకోవడం వల్ల తక్కువ ప్రీమియం చెల్లిస్తునూ రిస్క్‌ను కవర్ చేయవచ్చు. దీంతో భవిష్యత్తులో ఆనారోగ్య సమస్యలు వచ్చినా, కుటుంబ దీర్ఘకాల లక్ష్యాలు, పొదుపు దారి తప్పకుండా చేసుకోవచ్చు.
- క్రెడిట్ కార్డు బకాయిలు: మొత్తం క్రెడిట్ కార్డు బిల్లు నుంచి కనీస బ్యాలెన్స్ చెల్లించి మిగిలిన మొత్తాన్ని తర్వాతి నెలకు బదిలీ చేస్తుంటారు కొంతమంది. ప్రతి నెలా ఈ విధంగా చేస్తుంటే ఛార్జీలు, పెనాల్టీ రూపంలో చాలా చెల్లించాల్సి వస్తుంది. కొన్ని కార్డులపై 40 శాతం లేదా అంతకంటే ఎక్కువ వార్షిక వడ్డీ రేటు వర్తిస్తుంది. ఇది మీ పొదుపు, పెట్టుబడులపై తీవ్ర ప్రభావాన్ని చూపుతుంది. క్రెడిట్ స్కోరు గణనీయంగా తగ్గేందుకు కారణం అవుతుంది. ఇలాంటి అధిక ఖర్చులను నివారించేందుకు గడువు తేదీలోపు పూర్తి బకాయిలను చెల్లించండి. అలాగే, క్రెడిట్ కార్డు ఉంది కదా అని అనవసర ఖర్చులు చేయడం సరి కాదు.
- గృహ రుణం: గృహ రుణం భారం కాకుండా ఉండేందుకు చాలా మంది కాలవ్యవధిని పెంచుకుని ఈఎంఐను తగ్గించుకుంటారు. ఇలా చేయడం వల్ల సులభంగా ఈఎంఐ చెల్లించవచ్చు అనుకుంటారు. కానీ ఇక్కడ ఒక విషయం గుర్తుంచుకోవాలి. కాలవ్యవధి పెరిగే కొద్దీ మీరు చెల్లించాల్సిన వడ్డీ కూడా పెరుగుతుంది. ఒకవేళ మీరు ఇప్పటికే గృహరుణం తీసుకుని ఉంటే.. ఇతర ఖర్చులను తగ్గించుకుని ఈఎంఐ మొత్తాన్ని పెంచుకునే ప్రయత్నం చేయండి. ఇలా చేయడం ద్వారా వడ్డీ తగ్గించుకుని అనుకున్న వ్యవధి కంటే ముందుగానే గృహ రుణం పూర్తి చేయొచ్చు.
- డిజిటల్‌గా పనులు పూర్తిచేయండి: ప్రస్తుతం డిజిటల్ వినియోగం బాగా పెరిగింది. చాలా వరకు లావాదేవీలు ఆన్‌లైన్ ద్వారానే పూర్తి చేసే అవకాశం ఉంది. షాపింగ్, ఇంటి అవసరాలకు, ఇతర బిల్లు చెల్లింపులు ఆన్‌లైన్ ద్వారా పూర్తి చేయడం వల్ల సమయం, డబ్బు రెండింటినీ ఆదా చేయవచ్చు. అలాగే జీవిత, ఆరోగ్య బీమా కొనుగోళ్లు, ప్రీమియం చెల్లింపులు ఆన్‌లైన్ ద్వారా చేయడం వల్ల కొంత వరకు ఖర్చు తగ్గించుకొనే అవకాశం ఉంటుంది. టర్మ్ ప్లాన్‌ను ఆఫ్‌లైన్‌తో పోలిస్తే ఆన్‌లైన్ ద్వారా కొనుగోలు చేయడం వల్ల దాదాపు 25 శాతం వరకు ప్రీమియం తగ్గించుకోవచ్చు.
చివరిగా: రోజువారీగా చేసే ఖర్చుల నుంచి చిన్న చిన్న మొత్తాలను ఆదా చేసి.. పొదుపు చేయడం అలవాటు చేసుకుంటే నెల చివరిలో అనుకున్న దానికంటే ఎక్కువ మొత్తాన్ని చూడగలుగుతారు. ఖర్చులు తగ్గించుకుంటూ.. ఎక్కువ పొదుపు చేసేందుకు కొత్త మార్గాలను అన్వేషించాలి. ఇప్పుడు కొద్ది మొత్తంలో చేసిన పొదుపు, దీర్ఘకాలం మదుపుతో కాంపౌండింగ్ శక్తితో సంపద సృష్టిస్తుంది.
ఇదీ చూడండి: క్రెడిట్ కార్డ్ ఉందా? ఈ ఆఫర్స్ అస్సలు మిస్ అవ్వొద్దు!