ఆక్స్ఫర్డ్ తయారు చేసిన కరోనా టీకా క్లినికల్ ట్రయల్స్‌ను భారత్‌లో పునఃప్రారంభించేందుకు సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా(సీఐఐ)కు డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా(డీసీజీఐ) అనుమతిచ్చింది. రెండు, మూడు దశల ట్రయల్స్ కోసం కొత్తగా నియామకాలు చేపట్టవద్దని ఇదివరకు జారీ చేసిన ఆదేశాలను రద్దు చేసింది.
అయితే ట్రయల్స్ నిర్వహించేటప్పుడు అదనపు జాగ్రత్తలు తీసుకోవాలని సీరం సంస్థకు సూచించింది డీసీజీఐ. ప్రతికూల సంఘటనలు ఎదురైనప్పుడు మరింత పర్యవేక్షణ పాటించాలని నిబంధన విధించింది. ప్రతికూల పరిస్థితుల సమయంలో నిబంధనల ప్రకారం ఉపయోగించే ఔషధాల సమాచారాన్ని డీసీజీఐకి సమర్పించాలని సీరంను ఆదేశించింది.
అప్పుడు ఆగిన ట్రయల్స్
క్లినికల్ ట్రయల్స్‌లో భాగంగా ఇతర దేశాల్లో టీకా వేయించుకున్న ఓ వ్యక్తి అనారోగ్యానికి గురైన నేపథ్యంలో ఫార్మా సంస్థ ఆస్ట్రాజెనెకా ఈ ప్రయోగాలను నిలిపివేసింది. ఈ నేపథ్యంలో భారత్‌లోనూ ట్రయల్స్ నిలిపివేయాలని సెప్టెంబర్ 11న సీరంను డీసీజీఐ ఆదేశించింది. అయితే నియంత్రణ సంస్థల నుంచి అనుమతులు లభించిన తర్వాత యూకేలో ట్రయల్స్ పునఃప్రారంభించినట్లు సెప్టెంబర్ 12న ఆస్ట్రాజెనెకా ప్రకటించింది. టీకా ప్రయోగాలు సురక్షితంగానే జరుగుతున్నట్లు నియంత్రణ సంస్థ నిర్ధరించిందని పేర్కొంది.