స్టాక్ మార్కెట్లలో వరుసగా రెండో రోజు బుల్ జోరు కొనసాగింది. మంగళవారం సెషన్లో బీఎస్ఈ-సెన్సెక్స్ 1,197 పాయింట్లు బలపడి 49,798 వద్ద స్థిరపడింది. ఎన్ఎస్ఈ-నిఫ్టీ 367 పాయింట్లు పెరిగి 14,648 వద్దకు చేరింది.
బడ్జెట్ 2021 నింపిన ఉత్సాహం మార్కెట్ల దూకుడుకు ప్రధాన కారణంగా తెలుస్తోంది. ఇటీవల వరుసగా ఆరు రోజులు నష్టాలు నమోదు చేసిన సూచీలు.. కేవలం రెండు సెషన్లలోనే దాదాపుగా రికవరీ అయ్యాటంటే మార్కెట్ల లాభాలు ఏ స్థాయిలో ఉన్నయో అర్థం చేసుకోవచ్చు.
అంతర్జాతీయ సానుకూలతలూ మార్కెట్ల బుల్ దూకుడుకు తోడయ్యాయి.
దాదాపు అన్ని రంగాలు లాభపడ్డాయి. బ్యాంకింగ్, సిమెంట్, వాహన రంగాలు లాభాల్లో ప్రధానంగా ఉన్నాయి.
ఇంట్రాడే సాగిందిలా..
సెన్సెక్స్ 50,154 పాయింట్ల అత్యధిక స్థాయి 49,373 పాయింట్ల అత్యల్ప స్థాయిలను నమోదు చేసింది.
నిఫ్టీ 14,731 పాయింట్ల గరిష్ఠ స్థాయి 14,469 పాయింట్ల కనిష్ఠ స్థాయిల మధ్య కదలాడింది.
లాభనష్టాల్లోనివి ఇవే..
అల్ట్రాటెక్ సిమెంట్, ఎస్బీఐ, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఎల్&టీ, భారతీ ఎయిర్టెల్, మారుతీ షేర్లు లాభాలను గడించాయి.
బజాజ్ ఫిన్సర్వ్, హెచ్‌యూఎల్, టైటాన్ షేర్లు మాత్రమే 30 షేర్ల ఇండెక్స్‌లో నష్టాలను నమోదు చేశాయి.
ఇతర మార్కెట్లు
ఆసియాలో ఇతర ప్రధాన మార్కెట్లలో షాంఘై, టోక్యో, సియోల్, హాంకాంగ్ సూచీలు భారీ లాభాలను గడించాయి.
ఇదీ చూడండి:వార్షిక బడ్జెట్ 2021: ఈ పథకాలు కొత్తగా.. !