దేశీయ, అంతర్జాతీయ సానుకూలతల నడుమ స్టాక్ మార్కెట్లు నేడు భారీ లాభాలతో ముగిశాయి. బొంబాయి స్టాక్ ఎక్స్చేంజి సూచీ-సెన్సెక్స్ 997 పాయింట్లు బలపడి 33,718 వద్ద స్థిరపడింది. జాతీయ స్టాక్ ఎక్స్చేంజి సూచీ నిఫ్టీ 306 పాయింట్లు పెరిగి 9,860 వద్దకు చేరింది.
- మహారాష్ట్ర డే సందర్భంగా మార్కెట్లకు శుక్రవారం సెలవు
దేశీయంగా రెండో దశ లాక్డౌన్ ముగింపు సమయం దగ్గరపడుతోంది. ఈ నేపథ్యంలో లాక్డౌన్ నుంచి మరిన్ని సడలింపులు ఉండే అవకాశం ఉందనే ఆశలు మదుపరుల సెంటిమెంట్‌ను బలపరిచినట్లు మార్కెట్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మరో వైపు అమెరికాలో లాక్డౌన్ ఎత్తివేతకు ముమ్మర సన్నాహాలు జరుగుతుండటం.. ఆర్థిక వ్యవస్థ సానుకూల పరిణామంగా భావిస్తున్నారు మదుపరులు. ఈ నేపథ్యంలోనే భారీగా కొనుగోళ్లకు దిగుతున్నారు. ఫలితంగా మార్కెట్లు లాభాలను నమోదు చేసినట్లు నిపుణులు చెబుతున్నారు.
ఇంట్రాడే సాగిందిలా..
సెన్సెక్స్ 33,887 పాయింట్ల అత్యధిక స్థాయి, 33,354 పాయింట్ల అత్యల్ప స్థాయిలను నమోదు చేశాయి.
నిఫ్టీ 9,868 పాయింట్ల గరిష్ఠ స్థాయి, 9,731 పాయింట్ల కనిష్ఠ స్థాయిల మధ్య కదలాడింది.
లాభనష్టాల్లోనివి ఇవే..
ఓఎన్జీసీ, హెచ్‌సీఎల్‌టెక్, హీరోమోటోకార్ప్, ఎన్టీపీసీ, టీసీఎస్, ఎం&ఎం, ఇన్ఫోసిస్, మారుతీ సుజుకీ షేర్లు భారీగా లాభపడ్డాయి.
సన్‌ఫార్మా, హెచ్‌యూఎల్, ఇండస్ఇండ్ బ్యాంక్, ఏషియన్ పెయింట్స్ షేర్లు నష్టాలను మూటగట్టుకున్నాయి.
రూపాయి..
రూపాయి నేడు అత్యధికంగా 57 పైసలు బలపడింది. డాలర్‌తో పోలిస్తే మారకం విలువ 75.09కు పెరిగింది.
ఇదీ చూడండి:'పేదలను ఆదుకునేందుకు రూ.65 వేల కోట్లు అవసరం'